Monday, April 29, 2024

అసంఘటిత హస్తకళా రంగం!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమర యోధురాలు, మహాత్మా గాంధీ ప్రియ శిష్యురాలైన స్వర్గీయ కమలా చటోపాధ్యాయ భారతీయ చేనేత హస్తకళల పట్ల చూపిన ఆదరణ, అంకిత భావాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏట డిసెంబర్ 0814 తేదీల్లో అఖిల భారత హస్తకళల వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించుట ఆనవాయితీగా మారింది. చేనేత, హస్తకళల పట్ల ప్రజలకు ఆదరణ, అవగాహన, ప్రోత్సాహం, చేయూత, బహుళ ప్రచారం, కళాకారులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఈ వారోత్సవాల వేదికగా నిర్వహించుట జరుగుతున్నది.

భారతీయ హస్తకళల ఉత్పత్తులకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తున్న కారణంగా దాదాపు 67,000ల ఎగుమతి కేంద్రాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. హస్తకళల వారోత్సవాలలో భాగంగా మహా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో హస్తకళా ప్రదర్శనలు నిర్వహించడం, నైపుణ్యం కలిగిన కళాకారుల్ని గుర్తించడం, ఉత్పత్తులను కొనడం, ఉత్సాహపరచడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. హస్తకళల కళాకారులలో ఉచిత నైపుణ్య శిక్షణలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక చేయూత, సాంకేతిక వనరుల కల్పన, కళాకారుల ఉత్పత్తులకు సరైన ధరలను కలిపించడం లాంటి చర్యలు తీసుకోవడానికి 1952లో అఖిల భారత హస్తకళల బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

అనాదిగా భారత దేశంలో అసంఘటిత హస్తకళల రంగాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఆధునిక నైపుణ్య శిక్షణలు అందుబాటులోకి లేకపోవడం, మార్కెటింగ్ వసతులు కల్పించకపోవడం, సరైన ధరలు పలకకపోవడం, గిరాకీ లేకపోవడం లాంటి పలు సమస్యలు ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ హస్త కళారంగంలో 7 మిలియన్ల శ్రామికులు, కళాకారులు పని చేస్తున్నారు. ఈ హస్తకళా నిపుణుల్లో 56 శాతం మహిళలు, 44 శాతం పురుషులు, అందులో 21 శాతం ఎస్‌సిలు, 8 శాతం ఎస్‌టిలు, 52 శాతం ఒబిసిలు దేశవ్యాప్తంగా విస్తరించబడి ఉన్నారు. హస్తకళల్లో చేనేత వస్త్రాలు, లెదర్, కలప, లోహాలు, బంక మట్టి, ఎముకలు, కొమ్ములు, గవ్వలు, గాజులు, శిల్పాలు, కార్పెట్లు, జరీ ఉత్పత్తులు, పేయింటింగ్‌లు, నార వస్తువులు, వెదురు, కేక్ డెకరేషన్, కొవ్వొత్తులు, పేపర్, వ్యర్థ పదార్థాలు లాంటి వస్తువుల మాధ్యమంగా కళాత్మక కళాఖండాల అద్భుతాలు ఆవిష్కరించబడతాయి.

అధిక హస్తకళల ఉత్పత్తుల ఎగుమతులు కలిగిన దేశాల జాబితాలో భారతం కూడా ఉండడం ముదావహం. 2019-20 ఏడాది హస్తకళల ఎగుమతులు 3.35 శాతం తగ్గాయి. గత సంవత్సరం 26,213 కోట్ల రూపాయల విలువైన హస్తకళల వ్యాపారం జరుగగా, రూ. 13,412 కోట్ల ఎగుమతులు అయ్యాయి. కొవిడ్ -19 కల్లోలాన్ని అధిగమించి 2020 -21లో రూ. 24,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. 2021 -22లో 25.7 శాతం వృద్ధితో 4.35 బిలియన్ డాలర్ల హస్తకళల ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి.

విదేశీ గిరాకీ

ప్రపంచ హస్తకళల వ్యాపారం లో ఇండియా 1.2 శాతం మాత్రమే ఉండడం విచారకరం. మన దేశ కర్ర, ఎంబ్రాయిడరీ, చేనేత, ఇమిటేషన్ ఆభరణాలు, లోహ కళాఖండాలకు అమెరికా, యుకె, యుఎఇ, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నెదర్లాండ్ లాంటి పలు దేశాల్లో మంచి ఆదరణ ఉండటం హర్షదాయకం. దేశ విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం, జీవన వైవిధ్యం నెలవుగా ఉన్నందున భారతీయ హస్తకళల్లో అద్వితీయ విలక్షణత కనిపిస్తుంది. దేశీయ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ, డిమాండ్- సప్లై వ్యత్యాసం, నాణ్యతలో విదేశీ వస్తువులతో పోటీ, ఈ -ప్రభంజనాన్ని తట్టుకోలేకపోవడం, విదేశీ ఆధునిక సాంకేతికను సత్వరమే అందిపుచ్చుకోలేకపోవడం లాంటి సమస్యలు మన హస్తకళల రంగాన్ని వెంటాడుతున్నాయి. విదేశీ యంత్ర ఉత్పత్తుల కన్న భారత హస్తకళలకు మంచి గిరాకీ ఉండడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నది. బ్రాండ్ ఇమేజింగ్ కలిపించడం, క్రాఫ్ట్ ఫెస్టివల్స్/ రోడ్డు షోల నిర్వహణ, పబ్లిసిటీ, ఆకర్షణీయ ప్యాకేజింగ్, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయం, ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వడం, సృజనను ప్రోత్సహించడం, ప్రధాన కూడళ్లలో దుకాణాలు తెరవడం లాంటి చర్యలు హస్తకళల కళాకారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాయి.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గ్రామీణ కళలకు ఊతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ రూపొందించిన వన్ డిస్ట్రిక్ వన్ ప్రాడక్ట్‌తో పాటు జిల్లాను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చే పథకాల ద్వారా ప్రతి జిల్లాలోని తమవైన స్థానిక ఉత్పత్తులను తయారు చేయడం, ఉద్యోగ ఉపాధులు కల్పించడం, ఆర్థిక,- సామాజిక-, సంస్కృతిక చైతన్యం తీసుకురావడం లాంటి లక్ష్యాలను అధిగమించనున్నాయి. పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేయడం, వ్యర్థాలు లేకుండా చూడడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విదేశీ ఉత్పత్తుల ఖరీదును తట్టుకోవడం, ఉత్పత్తిదారులకు ఆర్థిక చేయూత ఇవ్వడం, ముడి సరుకులను అందించడం లాంటి సమస్యల నడుమ మన హస్తకళల పోషకులను ఆదుకోవలసి ఉంది. ఈ పోటీ ప్రపంచ మార్కెట్లో భారతీయులు మనవైన సుందరమైన హస్తకళల ఉత్పత్తులను ఆదరిస్తూ, కళాకారులు/ శ్రామికవర్గాల ఇంట్లో నవ్వుల పువ్వులు వికసించేలా చూద్దాం. హస్తకళల అందాలను ఆశీర్వదిద్దాం.

డా. బుర్ర
మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News