Saturday, April 27, 2024

‘కిమ్’నడం లేదేం!

- Advertisement -
- Advertisement -

 Kim Jong Un

 

పలు ఊహాగానాల చక్కర్లు
సోదరి యూకు పగ్గాలని వార్తలు

సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఎట్లా ఉన్నారు? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. తనదైన ప్రత్యేకతలతో దేశానికి తిరుగులేని నేతగా మారిన కిమ్ ఆరోగ్యంపై అనేక రకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. గత వారం రోజులుగా దేశ తూర్పు కోస్తా వెంబడి ఉండే ఆయన నివాస స్థావరం వెలుపల వారం రోజులుగా ఒక రైలు నిలిచి ఉంది. ప్రయాణాలకు కిమ్ ఈ రైలునే వాడుతుంటారు. ఆయన నివాసం వెలుపలి ఈ రైలును చూపుతూ వెలువడ్డ ఫోటోలు సంచలనం కల్గిస్తున్నాయి. ఈ శాటిలైట్ చిత్రాలను 38 నార్త్ అనే ప్రత్యేక వెబ్‌సైట్ వారు వెలువరించారు. ఉత్తర కొరియాపై ఎప్పుడు నిశిత అధ్యయనం చేస్తూ ఉండే ఈ వెబ్‌సైట్ వారు ఇప్పుడు పదేపదే ఈ రైలు ఛాయాచిత్రాలను పొందుపరుస్తున్నారు. అయితే కిమ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యానాలకు దిగకుండా వారు సూచనప్రాయంగా ఏదో తెలియచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ వర్గాలను ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌సైట్ ఇటీవలే కిమ్ గురించి కొంత సమాచారం వెలువరించింది. కిమ్ ప్రస్తుతం దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌ను వదిలి తన సొంత నివాసంలో ఉంటుంన్నట్లు ఈ వార్తాకథనంలో తెలిపారు. అయితే కిమ్‌కు ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవనే తమకు స్పష్టం అవుతోందని దక్షిణ కొరియా వర్గాలు చెపుతూ వస్తున్నాయి. అయితే చాలా రోజులుగా ఎవరికి కన్పించకుండా, కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న కిమ్ ఆరోగ్యం క్షీణించిందని మీడియా వార్తలు తెలియచేస్తున్నాయి. అయితే ఆయన అనారోగ్యంపై వార్తలు వదంతులే అని ఖండనలు కూడా వెలువడ్డాయి. కిమ్‌కు ఏదో ప్రత్యేక శస్త్రచికిత్స జరిగిందని, అది వికటించిందని కొన్ని వార్తలు తెలియచేశాయి. అయితే ఆయన కోలుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారని మరికొన్ని వార్తలు వెలువడ్డాయి.

లీడర్‌షిప్ రైల్వేస్టేషన్ వద్ద రైలు
చాలా రోజులుగా కిమ్‌కు చెందిన వాన్సన్ కాంపౌండ్‌కు సమీపంలోని లీడర్‌షిప్ రైల్వేస్టేషన్ వద్దనే ఆయన ప్రత్యేక రైలు నిలిచి ఉంది. ఈ ప్రాంతంలోని ఫోటోలను వెబ్‌సైట్ వారు తమ శాటిలైట్ ద్వారా పంపించారు. కిమ్ గురించి అనేక రకాల సంకేతాలను వెలువరించారు. 250 మీటర్లు (820 అడుగుల) పొడవుండే ఈ రైలు పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. అయితే ఈ రైలు అక్కడ ఉండటంతోనే కిమ్ అక్కడున్నట్లు కానీ, ఆయనకు ఏదైనా జరిగినట్లు కానీ ఊహించుకోరాదు. అయితే కిమ్ ఈ తూర్పు తీరం వెంబడి నివాసంలో ఉన్నట్లు స్పష్టం అయిందని వెబ్‌సైట్ తెలిపింది.

తాత కిమ్ జయంతికి రాలేదెందుకు?
ఈ నెల 15న దేశవ్యాప్తంగా దేశ వ్యవస్థాపకులు, కిమ్ తాత కిమ్ 2 సంగ్ 150వ జయంతి జరిగింది. ఈ వేడుకలలో ఎక్కడా మనవడు కిమ్ కన్పించలేదు. సాధారణంగా సంగ్ జయంతి ఉత్సవాలకు ప్రధాన అతిథిగా కిమ్ హాజరవుతూ ఉంటారు. ఉత్తర కొరియా మూడు తరాలుగా కిమ్ కుటుంబీకుల పాలనలోనే ఉంది. ఇప్పటి అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఈ వరసులో మూడో తరం వ్యక్తి. తాత జయంతి దేశంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. దీనికి ప్రస్తుత నేత రాకపోవడం చర్చనీయాంశం అయింది. ఆయన ఆరోగ్యంపై పలు రకాల కథనాలకు దారితీసింది. 2011లో తండ్రి రెండో కిమ్ మరణం తరువాత పగ్గాలు చేపట్టిన కిమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలలో కీలకమైన వ్యక్తిగా మారారు. అమెరికాకు తనదైన రీతిలో ప్రతిఘటన చర్యలతో జవాబు ఇస్తున్నారు.

అంతేకాకుండా ఆయన తన ప్రత్యేక జీవన అలవాట్లు, ఎక్కడికి వెళ్లినా సొంత వాహనాలు, గుర్రాలు, తరచూ ప్రత్యేక రైలు వాడుతూ ఉండటం ఇవన్నీ కూడా ఆయనను వార్తలలో వ్యక్తిగానే నిలిపాయి. ఉత్తర కొరియన్లకు కిమ్ దాదాపుగా దేవుడితో సమానం, ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. ఈ నేత ఆరోగ్యం బాగా లేకపోయినా, నేత గతించినా దేశంలో ఇది అత్యంత కీలక ఘట్టంగా మారుతుంది. ఓ వైపు ఇప్పటికీ పేదరికం, మరో వైపు అణ్వాయుధ దేశంగా మారిన ఉత్తర కొరియాకు అనేక చిక్కులు ఏర్పడుతాయి. రాజధానిని వీడి దూరంగా ఏకాంతంగా, అధికారిక కార్యక్రమాలకు, సంస్మరణలకు అతీతంగా ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నారనేదే కీలకంగా మారింది. ఆయన జీవనశైలికి ప్రతీక అయిన రైలు నివాస ప్రాంగణంలో ఉండటం పలు రకాల అనుమానాలకు దారితీసింది. ఆయనకు ఏమైనా అయితే దేశానికి అస్థిరత్వపు వైరస్ సోకుతుందనే భయాలు అలుముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు కమ్ముకున్న దశలో కిమ్ అనారోగ్యం మరో కీలక వార్తాంశం అయింది.

అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులను ప్రత్యర్థి దాయాది దేశం దక్షణ కొరియా కొట్టి పారేసింది. ఒక వేళ ఆయనకు కీడు జరిగినా వెంటనే దేశానికి వచ్చే ముప్పు ఏదీ లేదని తేల్చిచెపుతున్నారు. ఆయనకు జరగరానిది జరిగితే ఇప్పటికే శక్తివంతమైన నాయకురాలిగా పేరొందిన సోదరి కిమ్ యూ జాంగ్ తెరపైకి వస్తారని వారు తెలిపారు. అయితే కిమ్ సుదీర్ఘ రాజకీయ భవిష్య కార్యక్రమాలు ఏ మేరకు కొనసాగుతాయనేది స్పష్టం కావడం లేదంటున్నారు. దేశంలో నాయకత్వ అంశం ఇతర విషయాలపై ఏం జరుగుతున్నదనేది ఉత్తర కొరియా అధికార వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అక్కడి పరిణామాలపై దక్షిణ కొరియా ప్రధాన గూఢచారి సంస్థ కూడా పెదవి విప్పడం లేదు. అత్యున్నత స్థాయి నేతలకు అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే గోప్యతను పాటించి తరువాతనే అధికారిక ప్రకటన వెలువరించే ఆనవాయితీ కొన్ని దేశాలలో ఉంది. ఈ కోవలోనే ఉత్తర కొరియా కూడా గతంలో వ్యవహరించింది. కిమ్ జాంగ్ 2011 డిసెంబర్‌లో మృతి చెందిన రెండు రోజులకు కానీ దీని గురించి అధికారిక వార్తాసంస్థలు ప్రకటన వెలువరించలేదు.

How is Kim Jong Un?
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News