Monday, April 29, 2024

కిమ్ రష్యా పర్యటన

- Advertisement -
- Advertisement -

వసుధైవ కుటుంబకం పేరుతో జి20 దేశాలు దేని ప్రయోజనాలను అది నెరవేర్చుకొని ఇళ్ళకు వెళ్ళిపోయిన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైల్లో వెళ్ళి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖీ చర్చలు జరపడం మామూలు పరిణామం కాదు. ఎప్పుడో గాని దేశం విడిచి వెళ్ళని కిమ్ జరుపుతున్న రష్యా పర్యటన దానికి ఆయుధ సరఫరా చర్చల కోసం ఉద్దేశించినదేనని అమెరికా ముందుగానే ప్రకటించింది. అంతేకాదు రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే నీ పని పడతా అంటూ కిమ్‌ను అమెరికా హెచ్చరించింది. బుధవారం నాడు పుతిన్‌కు, కిమ్‌కు మధ్య 4 గం. పాటు చర్చలు జరిగాయి. ఈ భేటీలో తమ రెండు దేశాలు పరస్పరం ఎక్కడ, ఏవిధంగా సాయం చేసుకోవచ్చునో నాయకులిద్దరూ సవివరంగా చర్చించుకొన్నట్టు తెలుస్తున్నది.

1950-53 మధ్య జరిగిన కొరియాల యుద్ధంలో ఉత్తర కొరియాకు మాస్కో ఆయుధాలు సరఫరా చేసింది. అప్పటి నుంచి దానికి మద్దతు ఇస్తున్నది. చిరకాల మిత్రులైన ఈ రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి పరిమితులు వుండే అవకాశం లేదు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఆయుధ నిలలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంక్షల దిగ్బంధంలో వున్న తనకు ఎటు నుంచి ఏ సహాయం అందే అవకాశాలు లేవు. రష్యా పుట్టి మునిగిపోతోంది అనే పరిస్థితులు దాపురిస్తే గాని చైనా దానికి నేరుగా ఆయుధ సహాయం చేయకపోవచ్చు. అందుచేత ఉత్తర కొరియా అక్కరకు వస్తుందని పుతిన్ ఆశించడం సహజం. యుద్ధంలో ఒక వైపు రష్యా తడబడే పరిస్థితి నెలకొనగా, ఇంకొక వైపు ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి దండిగా సహాయం అందుతున్నది.

దానితో యుద్ధ రంగంలో అది పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దానిని తిరిగి అణచిపెట్టి వుంచాలంటే మాస్కోకు ఉత్తర కొరియా ఆయుధాల అవసరమెంతైనా వుంది. రష్యా తన సార్వభౌమాధి కార హక్కులను కాపాడుకోడానికి సామ్రాజ్యవాద శక్తులతో న్యాయమైన పోరాటం చేస్తున్నదని కిమ్ అన్నారు. మాస్కో తీసుకొనే అన్ని చర్యలకు తమ మద్దతు వుంటుందని గట్టిగా చెప్పారు. అయితే ఉత్తర కొరియా రష్యాల మధ్య కుదిరే ఒప్పందం ఏకపక్షం కాబోదని చెప్పవచ్చు. రష్యన్ రక్షణ మంత్రి సెర్గీ షొయుగు గత జులైలోనే ఉత్తర కొరియాను సందర్శించారు. దానితో రెండు దేశాల మధ్య సైనిక సహకారం గురించి ఊహాగానాలు అప్పుడే వినవచ్చాయి. ఉత్తర కొరియా వద్ద వున్న పాత ఆయుధాల నిల్వలను రష్యా తీసుకొని అందుకు బదులుగా అణ్వస్త్రాలను సంధించగలిగే రాకెట్ సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వగలదని సమాచారం. రష్యాలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వున్న ఓస్టోక్ని కాస్మోడ్రోమ్‌లో నాయకులిద్దరూ సమావేశం కావడానికి కూడా ప్రాధాన్యం వుంది. రష్యా నుంచి సైనిక ఉపగ్రహాలను సంపాదించాలని కిమ్ కోరుకొంటున్నారు.

ఇటీవలి కాలంలో తన సైనిక గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఉత్తర కొరియా పదేపదే విఫలమైంది. ఈ లోటు తీర్చుకోడం దానికి అత్యంత ఆవశ్యకంగా వుంది. ఉత్తర కొరియా వద్ద కోట్లాది పాత ఆయుధాలున్నాయని, ఇప్పుడు అవి రష్యాకు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా నుంచి రష్యా ఆయుధాలు పొందడం గాని, అందుకు ప్రతిగా దానికి రాకెట్ నైపుణ్యాన్ని అందజేయడం గాని రష్యా సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందాలకు ఉల్లంఘన కాగలదని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాను ప్రపంచమంతా తప్పుపడుతున్నది. అందుకుగాను దాని నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయరాదని అమెరికా ఆంక్షలు విధించింది. వాటి భారంతో రష్యా ఆర్థికంగానూ చితికిపోయి వున్నది. అయితే అమెరికా, దాని నాటో సైనిక కూటమి ఉక్రెయిన్‌లో తిష్ఠవేసుకొంటే అక్కడి నుంచి అవి నేరుగా మాస్కోను లక్షంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదమున్నదనే కారణంతో పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించారు.

ఆదిలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంగానే వున్న పరిస్థితి నెమ్మదినెమ్మదిగా అమెరికా రష్యాల యుద్ధంగా పరిణమించింది. అయినా ప్రపంచ అభిప్రాయం రష్యాకు అనుకూలంగా మారడం లేదు. ఈ నేపథ్యంలో యుద్ధ విరమణకు చర్చల అవసరముంది. అక్కడ కూడా అమెరికా చెప్పినట్టు రష్యా నడుచుకొనే ప్రసక్తే లేదు. అందుచేత అమెరికాకు బయట తటస్థ శక్తులు చర్చలకు చొరవ చూపించవలసి వుంది. ఇండియా ఆ పాత్ర వహిస్తుందనే భ్రమలు కల్పించారు. కాని అమెరికాను కాదని వ్యవహరించే పరిస్థితి ఇండియాకు కూడా లేదు. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు సరఫరా చేయడమే ఖాయమైతే అది యుద్ధాన్ని నిరవధికంగా కొనసాగింప చేస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైంది. ఇప్పటికి 18 మాసాలు నిండింది. దాని ప్రభావంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ముందు ముందు ప్రపంచం మరింత అశాంతికి గురి కావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News