Monday, April 29, 2024

బంగళా అమ్మకం వివాదం.. సుప్రీం కోర్టు లాయరును చంపేసిన భర్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సుప్రీంకోర్టు లాయరు రేణూ సిన్హాను భర్త దారుణంగా హత్య చేశాడు. వారి సొంత బంగళాలోనే ఈ దారుణం జరిగింది. జీవితాంతం కలిసి ఉండే భార్యను ఇంతకు ముందు ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారిగా పనిచేసిన 62 సంవత్సరాల అజయ్‌నాథ్ ఆదివారం చంపేసి, ఇంట్లోనే స్టోర్ రూంలో దాక్కున్నట్లు ఈ కిరాతక భర్తను పట్టుకున్న తరువాత సోమవారం పోలీసులు తెలిపారు.

61 సంవత్సరాల రేణూ సిన్హా సోదరుడు గత రెండు రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ వస్తున్నా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి విషయం పోలీసులకు తెలిపాడు. దీనితో స్థానిక పోలీసు బలగాలు బంగళాకు చేరుకున్నాయి. లోపలి నుంచి గడియ వేసి ఉంది. ఎంతకు ఎవరూ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా లోపల బాత్రూంలో ఈ మహిళ చనిపోయి ఉండగా కనుగొన్నారు. తరువాత భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. భార్యాభర్తలిద్దరూ తరచూ తగవు పడుతున్నారని సోదరుడు పోలీసులకు తెలిపారు. దీనితో పోలీసులు భర్త కోసం అక్కడ ఇక్కడా గాలించారు. చివరికి ఇంట్లోనే స్టోర్‌రూంలో దాక్కుని ఉండగా అరెస్టు చేశారు.

హత్య చేసిన తరువాత ఈ వ్యక్తి బంగళాకు తాళం వేసి , పై భాగాన ఉన్న ఖాళీ స్టోర్‌రూంలోకి వెళ్లి రెండు రోజులు గడిపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు విచారణలో అజయ్ నాథ్ బంగళా అమ్మకం విషయంలో ఇద్దరి మధ్య తగవులు తలెత్తాయని తెలిపారు. దీనిని రూ 4 కోట్లకు విక్రయించాలని ఆయన ఆలోచిస్తూ , బేరాలకు దిగుతూ వచ్చి, అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. విక్రయానికి భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాధమికంగా తెలిసింది. అయితే ఆమెను ఆయన దాడికి దిగి చంపివేశాడా? లేక పరస్పరం జరిగిన ఘర్షణలో ఆమె కిందపడి పోయి, రక్తస్రావం అయ్యి చనిపోయిందా? అనేది నిర్థారణ కావాల్సి ఉందని తెలిసింది. మృతురాలు చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ గడిపింది. ఇటీవలే క్యాన్సర్ నయం అయిందని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు చివరికి విషాదాంతం చెందింది. వీరి కుమారుడు విదేశాలలో ఉంటున్నాడు. జరిగిన ఘటన గురించి ఆయనకు సమాచారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News