Sunday, April 28, 2024

ఇంటి పరిసరాలు బాగుంటేనే.. కుటుంబం, సమాజం బాగుంటుంది

- Advertisement -
- Advertisement -
పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించండి: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ : ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో 10 నిమిషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని అన్నారు. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.

పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతోపాటు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి, గ్రామ పంచాయతీల్లోని సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నా.. మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో టీ- డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రభుత్వం ఉచితంగా వైద్యపరీక్షలు చేస్తున్నదని వెల్లడించారు. అదేవిధంగా మందులతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ హాస్పిటళ్లను సంప్రదించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News