Thursday, May 9, 2024

బాక్సింగ్ డే టెస్టులో పట్టుబిగించిన భారత్..

- Advertisement -
- Advertisement -

భారత బౌలర్ల జోరు.. కష్టాల్లో కంగారూలు
ఆస్ట్రేలియా 133/6, పట్టు బిగించిన టీమిండియా

IND vs AUS 2nd Test: Australia 133/6 at Stumps in 3rd day

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగుల ఆధిక్యంలో మాత్రమే నిలిచింది. మంగళవారం ఆరంభంలోనే మిగిలిన వికెట్లను సాధ్యమైనంత త్వరగా పడగొడితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు అసాధ్యమేమి కాదు. పరిస్థితులను గమనిస్తే భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ తొలి టెస్టు ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటే విజయం అంత తేలిగ్గా లభిస్తుందని భావించలేం. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించడం భారత్‌కు సానుకూలంగా మారింది. ఆస్ట్రేలియా ఇప్పటికే కీలకమైన ఆరు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌లలో కామెరూన్ గ్రీన్ ఒక్కడే మిగిలాడు. అతన్ని ఎంత త్వరగా పెవిలియన్ పంపిస్తే భారత్‌కు గెలుపు అంత తొందరగా లభిస్తోంది. దీంతో నాలుగో రోజు ఉదయం ఆటపై అందరి దృష్టి నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు కీలకమైన 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 277/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 49 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. కెప్టెన్ అజింక్య రహానె 223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, టెయిలెండర్లు పెద్దగా రాణించక పోవడంతో భారత్ ఇన్నింగ్స్ 326 పరుగుల వద్దే ముగిసింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో స్టార్క్, లియాన్ మూడేసి వికెట్లు తీయగా, కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 195 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
అదే తడబాటు..
ఇక భారత్‌ను ఆశించిన స్కోరు కంటే తక్కువకే ఆలౌట్ చేసిన ఆనందంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జో బర్న్ (4)ను ఉమేశ్ యాదవ్ వెనక్కి పంపాడు. ఈ దశలో మరో ఓపెనర్ మాథ్యూ వేడ్‌తో కలిసి లబూషేన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 28 పరుగులు చేసి నిలదొక్కుకుంటున్నట్టు కనిపించిన లబూషేన్‌ను అశ్విన్ అద్భుత బంతితో వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా రక్షణాత్మక ఆటను కనబరిచాడు. మాథ్యూ వేడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించాడు. అయితే కుదురుగా ఆడుతున్న స్మిత్ (8)ను బుమ్రా ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి అతను క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత చెలరేగి పోయారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వేడ్ 3 ఫోర్లతో 40 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ (17) కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ ఖాతాలోకి ఈ వికెట్ వెళ్లింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ పైన్ (1) కూడా నిరాశ పరిచాడు. జడేజా బౌలింగ్‌లో పైన్ ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కామెరూన్ గ్రీన్ 17 (బ్యాటింగ్), కమిన్స్ 15 (బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఆస్ట్రేలియా స్కోరును 133 పరుగులకు చేర్చారు. భారత బౌలర్లలలో జడేజా రెండు, ఉమేశ్, అశ్విన్, బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

IND vs AUS 2nd Test: Australia 133/6 at Stumps in 3rd day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News