Monday, April 29, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

కివీస్‌తో సమరానికి టీమిండియా సిద్ధం
హామిల్టన్: వరుస విజయాలతో టెస్టుల్లో బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా కివీస్‌తో జరిగే సిరీస్‌పై విరాట్ సేన కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకున్న భారత్‌కు కివీస్ సిరీస్ కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్టులోనైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఆడిన టెస్టుల్లోనూ విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ తదితరులు గాయాలతో జట్టుకు దూరం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

అయితే వీరు లేకున్నా భారత్ బలంగానే కనిపిస్తోంది. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులైన ఓపెనర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. కానీ, ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే కివీస్ పిచ్‌లపై వీరు ఎలా ఆడుతారనేది మాత్రం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు మయాంక్ అగర్వాల్ పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. పృథ్వీషా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్‌లో మెరుగైన శుభారంభం లభించడం కష్టంగా కనిపిస్తోంది. కాగా, మయాంక్, పృథ్వీషా, గిల్‌లను తక్కువ అంచనా వేయలేం. ఎటువంటి బౌలింగ్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా వీరికుంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. టెస్టుల్లో వీరికి కళ్లు చెదిరే రికార్డు ఉంది. నిలకడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే పుజారా, రహానెలు విజృంభిస్తే భారత్‌కు భారీ స్కోరు సాధించడం కష్టమేమి కాదు. అంతేగాక విరాట్ కోహ్లి రూపంలో భారత్‌కు మ్యాచ్ విన్నర్ సారథి ఉండనే ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్‌పై చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి చెలరేగితే కివీస్ బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. ఇక, వృద్ధిమాన్ సాహా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతోపాటు బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురులేదు. బుమ్రా, ఉమేశ్, షమి, అశ్విన్, జడేజాలతో బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే కివీస్ పిచ్‌లపై బుమ్రా త్రయాన్ని ఎదుర్కొవడం కివీస్ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్‌తో జరిగే సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

IND vs NZ Test Series 2020 start from Feb 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News