Monday, April 29, 2024

సముద్రపు దొంగలకు భారత్ చెక్!

- Advertisement -
- Advertisement -

అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం సరిహద్దులుగా ఉన్న అరేబియా సముద్ర తీరాన, యెమెన్, ఒమన్, పాకిస్తాన్, ఇరాన్, భారత్, మాల్దీవులు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో నౌకాశ్రయాలు, పోర్టులను కలుపుతూ విస్తరించిన ఉన్న అరేబియా సముద్రం వాణిజ్యపరంగా కీలకమైన సముద్ర మార్గంగా చెప్పుకోవచ్చును. అంతర్జాతీయ వ్యాపారాలకు ముఖ్యమైన రవాణా మార్గంగా మారింది. కేవలం రవాణా మార్గమే కాదు. ఇక్కడ సహజ సిద్ధమైన చమురు, వాయు నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయి. భారత్, ఇరాన్, అమెరికా దేశాలకు చెందిన నౌకాదళాలకు ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో బేస్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఆయా దేశాల భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. దేశ భద్రత, స్థిరత్వం, వాణిజ్య కార్యకాపాల దృష్ట్యా భారత్‌కు అరేబియా సముద్ర ప్రాంతం ఎంతో ముఖ్యమైనది.

అరేబియా సముద్రంలో ఎలాంటి ఉద్రిక్తతలు ఏర్పడకపోతేనే ప్రపంచ దేశాలకు వాణిజ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అరేబియా సముద్రంలో ఏర్పడే స్థిరత్వమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ఆ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోని కార్మిక రంగం, ఉత్పాదక పరిశ్రమలు, ఆసియా దేశాలు, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశాల వాణిజ్య కార్యకాలాపాలు నిరంతరాయంగా జరగాలంటే అరేబియా సముద్ర రవాణా మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకూడదు. గతంలోనూ అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు దాడులు జరిగేవి. కానీ ఈ స్థాయిలో ఇంతకు ముందు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో దాడులు గణనీయంగా పెరిగాయి. తిరుగుబాటుదారుల సంఖ్యకూ అందుకు సమానంగానే పెరిగింది. వారికి డబ్బు కావాలి. అందుకోసం సముద్ర మార్గాలను వారు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే సముద్రంలో దాడులు చేయడానికి భారీ ఆయుధాలు అవసరముండదు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెరుగుతోన్న అంతర్గత కల్లోలాలు సముద్రంలో నౌకలపై దాడులు పెరగడానికి కారణం అవుతున్నాయి.

యెమెన్, సూడాన్లతో పాటు పలు మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే బృందాలకు డబ్బు అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, దాడులకు పాల్పడుతున్నారు. వాణిజ్య మార్గాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డబ్బు సంపాదించొచ్చని వారు భావిస్తున్నారు. హిందూ మహా సముద్ర తీరాన ఉన్న దేశాలకు ఇటీవలి కాలంలో చైనా కీలక భాగస్వామిగా మారింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్, ది మారిటైమ్ సిల్క్ రోడ్ ప్రాజెక్టులతో ఆయా దేశాల మధ్య ఆర్థిక, సైనిక అంశాలపరంగా పరస్పర సహకారం అందించుకునేందుకు వేదికగా మారాయి. ఆ దేశాల్లో చైనాకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతున్న కారణంగా భారత్ మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. 2017లో జిబౌతిలో తొలి మిలిటరీ బేస్‌ను చైనా ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే అక్కడ ఫ్రాన్స్, జపాన్, అమెరికా దేశాలు మిలిటరీ బేస్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే సముద్రపు దొంగల ముప్పు కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. దీనికి తాజా ఉదాహరణే గత నెలలో అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి గురైన మాల్టా నౌకను భారత నౌకాదళం రక్షించింది.

డిసెంబర్ 23వ తేదీన ఎంవి కెమ్ ప్లుటో అనే పేరు గల లైబీరియా దేశానికి చెందిన వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. మంగుళూరుకు వస్తోన్న ఆ నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారిలో 21 మంది భారతీయులు ఉన్నారు.ఈ దాడి తర్వాత ఎర్రసముద్రంలో గాబన్ దేశానికి చెందిన ఎంవి సాయిబాబా ఆయిల్ ట్యాంక్‌పై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఆ సమయంలో అందులో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలన్నీ ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయని భారత నౌకాదళం స్పష్టం చేసింది. జలాంతర్గ మార్గాల్లో నౌకలపై జరుగుతున్న సందర్భంగా ఆయా నౌకల్లో భారతీయ సిబ్బందే పెద్ద సంఖ్యలో ఉండడం ఇక్కడ ఆందోళనలకు దారి తీస్తున్న సంఘటనలు. ఈ కారణంగా దాడులను తిప్పికొట్టడం, దీటుగా దాడులకు సన్నద్ధం కావడం భారత్‌కు అనివార్యంగా మారింది. ఇప్పటికే ఐదు యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించింది భారత్.అంతేకాక సముద్ర మార్గంపై గస్తీ నిర్వహించేందుకు విమానాలు, డ్రోన్లతో నిఘా పెంచింది. దాడులు చేస్తే సహించే పరిస్థితుల్లో తాము లేమని భారత్ తన చర్యలతో శత్రు దేశాలకు చెప్పకనే చెప్పింది.

ఈ ఆపరేషన్ వాణిజ్యపరంగా భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అరేబియా సముద్రం గుండా వాణిజ్య నౌకలు అటు మధ్యధరా సముద్రం వైపు, సూయజ్ కాలువ వైపు ప్రయాణం చేస్తాయి. సూయజ్ కెనాల్ ప్రపంచ దేశాలకు ఎంతటి కీలకమైన మార్గమో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఈ మార్గం గుండా యూరోపియన్ దేశాలకు, అమెరికాకు వాణిజ్యపరమైన రవాణా జరుగుతుంది’ అని అరవింద్ యెల్లేరి వివరించారు. భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భావిస్తూ చైనా వైపు మొగ్గు చూపుతున్న దేశాలకు భారత్ సామర్థ్యం గురించి చెప్పకనే, ఓ సందేశాన్ని ఇచ్చినట్లే ఆయన స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. అరేబియా సముద్రంలోని సోమాలియా తీరంలో భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ భారత నౌకాదళ సమర్థతకు, సాహసానికి, సముద్రపు హైజాకర్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పగలరనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ సంఘటన. భారత నౌకా దళంపై భారీ పెట్టుబడులు పెట్టారు. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భారత నౌకాదళ సామర్థ్యాన్ని చూపే వీలు కలుగుతుంది? ఇక భూభాగంలోనే కాదు, సముద్ర భాగంలోనూ భారత్‌ను ఢీకొట్టేవారు లేరని భారత నావికాదళం మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News