Saturday, April 27, 2024

భౌతిక వాదానికి భారతదేశమే పుట్టినిల్లు

- Advertisement -
- Advertisement -

India is the birthplace of materialism

భౌతికవాదం అంటే అదేదో ప్రాశ్చాత్య సిద్ధాంతం కాదు. భారత దేశమంటే కేవలం ఆధ్యాత్మిక దేశమే కాదు, బలమైన భౌతికవాద మూలాలున్న దేశంగా చెప్పవచ్చు. మన తాత్విక సిద్ధాంతాల్లో ప్రధానమైన ధోరణి భౌతికవాదమే. దర్శనాలలోని ఉత్తర మీమాంస సాంఖ్యం, పూర్వ మీమాంస, యోగం, న్యాయం, వైశేషికంలలో ఒక్క ఉత్తర మీమాంస తప్ప తక్కిన ఐదూ మౌలికంగా భౌతికవాద దర్శనాలే.

మన మెదడులోని ఆలోచనలను వాస్తవ ప్రపంచంపై ఆపాదించేది భావవాదం కాగా, ప్రంచంలోని వాస్తవమైన అంశాలని మన మెదడులోకి ఎక్కించుకొనేది భౌతిక వాదం. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించింది భౌతిక వాదమే. కాలక్రమంలో వందల సంవత్సరాల కాలంలో అది హీనయానం, మహాయానంగా చీలిపోయింది. భౌతిక వాదాన్ని సాంఖ్యరూపంలో కపిలుడు ప్రతిపాదించాడు. పశ్చిమ దేశాల్లో ఒక మతం స్థానే ఇంకో కొత్త మతం వచ్చింది. కొత్త మతం వచ్చాక పాత ఆచారాలన్నీ అంతర్ధానమైపోయాయి. మన దేశంలో మాత్రం అలా జరగలేదు. పాత ఆచారాలపై కొత్త సంప్రదాయాలు రుద్దబడ్డాయి. పాతవి, కొత్తవి కలిసే ఉంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని మత సంస్కరణలు జరిగాయి. ప్రకృతిని అర్ధం చేసుకోవాలన్న జిజ్ఞాస కన్నా, అదుపు చేయాలన్న తాపత్రయమే తాంత్రిక వాదులలో ఆనాడు ఎక్కువగా కన్పించేది.

పశ్చిమ దేశాలలో భౌతిక వాదులందరిలోకి ప్రాచీనుడు హిరాక్లిటస్. ఇతడు క్రీ.పూ. 550- 480 సంవత్సరాల మధ్య జీవించిన గ్రీకు తత్వవేత్త. అంతకన్నా దాదాపు 400-500 సంవత్సరములకు ముందే మన దేశంలో సాంఖ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావవాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉందని ఈ వాదం చెప్తుంది. బౌద్ధం, జైనం కూడా భౌతిక వాదాన్ని బలపరిచాయి. అహిం సా సిద్ధాంతాన్ని ఆచరించాయి. ఆదిమ కాలంలో ప్రధానమైన మానవ కార్యమంతా తమ మనుగడ కొనసాగించడం ఎలా అన్నదాని చుట్టూ తిరిగింది. ఆనాటి ఉత్పత్తి స్థాయి అతి తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఎవరి తిండి, ఎవరి అవసరాలు వారు వెతుక్కోవడమే తప్ప ఒకరి శ్రమపై ఇంకొకరు ఆధారపడే పరిస్థితి లేదు. కనుక దోపిడీకి అవకాశం ఉండేది కాదు.

శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ, ప్రజల్లో భౌతికవాదం బలపడిపోతుందనుకోవడం పొరబాటు అవుతుంది. విద్యా విధానాన్ని పాలక వర్గాలకు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అంతేగాక విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ అది వేర్వేరు శాస్త్రాలుగా విడిపోతూ వస్తున్నది. దీని వలన ఎవరి విభాగంలో వారే నిష్టాతులౌతున్నారు గానీ మొత్తం సమాజానికి సంబంధించిన అవగాహన వారు ఏర్పరచుకోలేదు. ప్రాచీన భారతదేశంలో కణాదుడు వంటి వారు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తొలివేద కాలంలో కులాల ప్రస్తావన లేదు. తర్వాత పూజారులు, మతాధికారులు పాలక వర్గాల వారికి అనుకూలంగా వ్యవహరించి చదువులకి సామాన్యులను దూరం చేశారు. అంటరానితనం, కుల వివక్ష భారతీయ సమాజంలోకి వచ్చాయి. ఫలితంగా నిమ్న వర్గాల వారి హక్కులు కాలరాయబడ్డాయి. తద్వారా నిమ్నవర్గాల వారు మరో మతం వైపు మళ్ళారు.

రామానుజుడు వంటి వారు కుల వ్యవస్థని ధిక్కరించి దేవుడిని సామాన్య ప్రజలకు చేరువగా చేయడానికి పూనుకొన్నారు. కబీరు వంటి వారు హిందూ, ముస్లింల మధ్య సామరస్యతను పెంచడానికి కృషి చేశారు. మధ్యయుగంలో వచ్చిన భక్తి ఉద్యమాలు కొత్త సంప్రదాయాలని తీసుకొచ్చాయి. కొత్త మతాలు ఆవిర్భవించాయి. రాజారామ్మోహన్‌రాయ్, ఫూలే దంపతులు, అంబేడ్కర్ తదితరులు మన దేశంలోని సాంఘిక దురాచారాలని రూపుమాపడానికి కృషి చేశారు. తిలక్, గాంధీజీ వంటివారు మతాన్ని ప్రజల్ని సంఘటితం చేయడానికి ఉపయోగించారే తప్ప మతోన్మాదానికి వారి వ్యక్తిత్వంలో చోటివ్వలేదు. వివేకానందుడు వంటి వారు భారతదేశం గొప్పతనాన్ని విదేశాలకి చాటి చెప్పారు. బ్రిటీష్ వారి పరిపాలన వల్ల భారతీయుల్లో జాతీయవాదం పెరిగింది. ఈ జాతీయవాదం వల్ల స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది. ఫలితంగా భారతీయులు భిన్నత్వంలో ఏకత్వం అనే విశిష్ట లక్షణంతో బలమైన జాతిగా ఎదిగారు.

కానీ ఆధునిక కాలంలో మళ్ళీ పాత వాసనలు పురుడు పోసుకుంటున్నాయి. మతం వ్యక్తిగత జీవన విధానం కన్నా రాజకీయ నినాదంగా మారింది. ప్రపంచీకరణ కొందరికి మాత్రమే లాభాల్ని చేకూర్చింది. పేదవారి జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వారి బతుకులకు భరోసా లేకుండా పోయింది. ఇటువంటి సందర్భాల్లో వారు దేవుడిపై భారం వేసి కాలం వెళ్ళబుచ్చుతారు. ఆర్ధిక సంక్షోభాలు, కరోనా వైరస్‌లు వీరి జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయి. తద్వారా వారు మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారు. చివరికి సంక్షోభాలు, వైరస్‌ల విజృంభణ అనేవి ప్రజల నిర్లక్ష్యమే అని పాలక వర్గాలు తేల్చేశారు. ఇటువంటి సమయంలోనే బలమైన సైన్స్ ఉద్యమాలు రావాలి. ప్రజలలో భౌతికవాద ధోరణులు పెరిగిప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందుకు భారతదేశ చరిత్రను అన్ని కోణాలలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

యం. రాంప్రదీప్- 9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News