Saturday, April 27, 2024

సమరోత్సాహంతో ‘భారత్’

- Advertisement -
- Advertisement -

India vs England 4th Test today

 

ఇంగ్లండ్‌కు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు

అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే నాలుగో, చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో ఉన్న భారత్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ను డ్రా చేయాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. ఒకవేళ ఈ టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం కావడంతో పాటు టీమిండియా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. దీంతో భారత్ ఓటమి పాలుకాకుండా చూడడమే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కోహ్లి సేన ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఇంగ్లండ్ ఫైనల్ ఆశలు ఇప్పటికే ఆవిరయ్యాయి. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈ స్థితిలో టీమిండియా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్ కూడా సిరీస్‌ను సమం చేయడమే లక్షంగా పెట్టుకుంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడ ఖాయంగా కనిపిస్తోంది.

ఓపెనర్లే కీలకం

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కీలకంగా మారారు. రోహిత్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఈసారి కూడా రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మూడో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. క్లిష్టమైన పిచ్‌పై రోహిత్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో గిల్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అయితే ఆఖరి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. చాలా రోజులుగా కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచ లేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

ఈసారైన రాణిస్తారా

మరోవైపు జట్టుకు కీలకంగా ఉన్న సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదనే చెప్పాలి. జట్టును ఆదుకుంటారని భావించిన వీరిద్దరూ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. దీని ప్రభావం జట్టు బ్యాటింగ్‌పై బాగానే కనిపిస్తోంది. టెస్టుల్లో అద్భుత రికార్డును కలిగిన రహానె, పుజారాలు ఇంగ్లండ్‌పై జోరును కొనసాగించలేక పోతున్నారు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైన వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. వీరితో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన పంత్ విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. పంత్ కూడా మెరుపులు మెరిపించాలనే లక్షంతో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

జోరు సాగాలి

సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. మూడో టెస్టులో ఇటు అక్షర్ పటేల్, అటు రవిచంద్రన్ అశ్విన్‌లు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డేనైట్ టెస్టులో అక్షర్ ఏకంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈసారి కూడా ఇద్దరు వికెట్ల పండించేందుకు తహతహలాడుతున్నారు. సుందర్ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాది సిరాజ్‌కు ఈసారి కూడా తుది జట్టులో స్థానం కష్టమనే చెప్పాలి. సీనియర్లు ఉమేశ్, ఇషాంత్‌లతో భారత్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రతీకారం కోసం

ఇక ఇంగ్లండ్ భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది. కిందటి మ్యాచుల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమంగా ముగించాలని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. కాగా, కిందటి మ్యాచుల్లో చేసిన పొరపాట్లు ఈసారి జరుగకుండా చూస్తే ఇంగ్లండ్‌కు కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News