Monday, April 29, 2024

డ్రగ్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

 

కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం ప్రభావం భేష్
ఇండో-అమెరికన్ డాక్టర్ ఆధ్వర్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్
వాషింగ్టన్ : వైరస్ నివారణ సామర్థ్యం కలిగిన జౌషధాల్లో రెమ్‌డెసివిర్ పై ఆశలు చిగురిస్తున్నాయి. అమెరికా ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని కరోనా రోగులపై పరీక్షించగా సత్ఫలితాలు కనిపించాయి. ఇండో-అమెరికన్ ఫిజీషియన్‌తో సహా పరిశోధకుల బృందం మూడో దశ ట్రయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని ఫార్మా కంపెనీ వెల్లడించింది. కాలిఫోర్నియా కేంద్రం గల ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ ఈ ఫలితాల గురించి వివరిస్తూ కరోనా రోగుల్లో 50 శాతం మందిని రెమ్‌డెసివిర్ ఐదు రోజుల డోస్‌లతో చికిత్స చేయగా చాలా పురోగతి కనిపించిందని వారిలో సగానికి సగం మందిని ఆస్పత్రి నుంచి రెండు వారాల్లో డిశ్చార్జి చేయడమైందని వెల్లడించింది. మూడో దళ క్లినికల్ ట్రయల్ అంటే ఔషధం ఆమోదంలో తుది అడుగుగా పేర్కొంది. రోగులు ఎవరైతే తక్కువ కాలం ఐదు రోజుల రెమ్‌డెసివిర్ చికిత్స పొందారో వారు పది రోజుల చికిత్సలా పురోగతి అనుభవం పొందుతున్నారని క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అరుణా సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ స్కూలు ఆఫ్ మెడిసిన్‌లో ఇమ్యునోకాంప్రమైజ్డ్ హాస్ట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ చీఫ్ గా అరుణ వ్యవహరిస్తున్నారు. ఈ అధ్యయనం సాగించే పరిశోధకుల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఔషధం వల్ల క్షేమం కలుగుతుందని, సమర్ధంగా ఇది పనిచేస్తుందని నిరూపణ అయితే అదనపు డేటా అవసరమౌతుందని, ఈ ఔషధంతో చికిత్స గురించి స్పష్టత ఏర్పడుతుందని అభిప్రాయ పడ్డారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్సియస్ డిసీజెస్ (ఎన్‌ఐఎడి) అధ్యయనంలో కూడా రెమ్‌డెసివిర్ నుంచి సత్ఫలితాలు వచ్చాయని ఫార్మా కంపెనీ వివరించింది. కరోనా తీవ్రంగా ఉన్న రోగులపై సాగే ట్రయల్స్ నుంచి త్వరలో అదనపు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామని కంపెనీ పేర్కొంది.
వైట్‌హౌస్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్సులోని కీలక సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫాసి ఫలితాలు వందశాతం రాకపోయినా కనీసం 30 శాతం ఫలితం కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని నమ్మకం వెలిబుచ్చారు. ఇది శుభవార్తగా వైట్‌హౌస్ ఆనందం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 21న ఈ ఔషధంపై అధ్యయనం ప్రారంభమైంది. అమెరికా, ఐరోపా, ఆసియా లోని 68 ప్రాంతాల్లో వెయ్యి మందిపై ఈ ఔషధ ప్రభావాన్ని పరీక్షించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రెమ్‌డెసివిర్ ప్రత్యేకత
రెమ్‌డెసివిర్ ప్రత్యేకత ఏంటంటే ఇది వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది. గతంలో ఎబోలా వైరస్ నివారణకు దీన్ని నివారించారు. వైరస్ ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎ లోని మూలకాలను పోలి ఉండే ఈ ఔషధం వైరస్ పునరుత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇతర ఔషధాలు మనిషి లోని రోగ నిరోధక శక్తిలో మార్పులు తీసుకొచ్చి వైరన్‌ను అడ్డుకునేలా చేస్తే ఈ ఔషధం మాత్రం వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది.

Indo-American Doctors Team try to found Corona Vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News