Monday, April 29, 2024

ప్రగతిశీల తీర్పు

- Advertisement -
- Advertisement -

Inter Marriage paves way for reduction of caste and religious tensions

 

సతీసహగమనాలు పోయాయి, బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి, స్త్రీ విద్య పుంజుకుంటున్నది, యువతీ యువకులు తాము కోరుకున్న వారిని జీవిత భాగస్వాములుగా చేసుకుంటున్నారు సమాజం మార్పును ఆహ్వానించి అక్కున చేర్చుకొంటున్నందునే ఇవి సాధ్యమవుతున్నాయి. అయినా కుల, మత దురహంకారాలు, కట్టుబాట్లు, గిరిగీసుకొని బతకడాలు, వివక్షలు, కక్షలు మన సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అవి మరింతగా గట్టిపడి గత కాలపు అంధత్వాన్ని గాఢతరం చేయాలని చూస్తున్నాయి. ఈ దుస్థితిని పూర్తిగా తొలగించాలంటే మరెన్నో ముందడుగులు పడాలి. ఇంకెన్నో ప్రగతి దారులు తొక్కాలి. సమష్టి సహజీవనమే లక్షంగా, భిన్నత్వంలో ఏకత్వ సాధన పరమాశయంగా మనం ఆవిష్కరించుకున్న రాజ్యాంగమే ఇటువంటి దారులను మనకు తెరుస్తున్నది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడూ అందుకోసం ఉద్దేశించినవే.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జాతి భవ్యగమనానికి, ప్రగతి నడకకు దోహదం చేసే కొత్త బాటలను చూపుతూ ఉండడం మన రాజ్యాంగ లక్ష సాధన గమనంలో అడుగడుగునా అది కరదీపిక పట్టుకొని వహిస్తున్న చరిత్రాత్మక పాత్రకు నిదర్శనమని చెప్పాలి. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోడం ద్వారా విద్యావంతులైన యువత దేశంలో కుల, మత ఉద్రిక్తతలు తగ్గడానికి మార్గదర్శకులవుతున్నారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఒక తీర్పులో వెలిబుచ్చిన అభిప్రాయం ఈ సందర్భంలో ప్రత్యేకించి గమనించదగినది. జాతి ప్రగతికి చెప్పరాని అడ్డంకిగా ఉన్న కుల, మత కట్టుబాట్లను మళ్లీ గట్టి పరచడానికి, సామాజిక రంగంలో ఖాప్ పంచాయతీల మాదిరి నిరంకుశ పాలనను పునరుద్ధరించడానికి చూస్తున్న శక్తులు ప్రాబల్యం గడించి అత్యంత బలంగా ఉక్కు పాదం మోపుతున్న వర్తమానంలో సుప్రీం ధర్మాసనం ఈ విధంగా దృఢమైన ప్రగతి శీల దిశానిర్దేశం చేయడం ఎంతైనా హర్షించవలసిన పరిణామం.

‘విద్యావంతులైన యువకులు, యువతులు స్వతంత్ర నిర్ణయాలతో తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్ల విషయంలో కులం, మతం ప్రధాన పాత్ర పోషించిన పూర్వపు నియమాలకు ముగింపు పలుకుతున్నారు. ఇటువంటి అంతర్వివాహాలే కుల, మత ఉద్రిక్తతలు తగ్గడానికి దారులు వేస్తాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు ‘కుల నిర్మూలన’ అనే గ్రంథంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ‘కులాంతర, మతాంతర వివాహాలే నిజమైన పరిష్కారమవుతాయి. భిన్న రక్తాల సమ్మేళనతో కూడిన బంధమే ప్రజల మధ్య విడదీయలేని బాంధవ్యాన్ని గట్టిపరుస్తుంది. అందరమూ ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టామనే భావనే కుల మతాలు సృష్టించిన వేర్పాటు, ఒంటెత్తు ధోరణులకు తెర దించగలుగుతుంది’ అని అంబేడ్కర్ ఆ గ్రంథంలో చెప్పిన మాటలను ఉదహరించింది. లవ్ జిహాద్ పేరిట హిందూ యువతులకు వల వేసి వారిని ప్రేమలోకి దించి పెళ్లిళ్లు చేసుకోడం ద్వారా బలవంతపు మతాంతరీకరణలకు పాల్పడుతున్నారనే ప్రచారం ఇటీవలి కాలంలో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ఊపందుకున్న సంగతి తెలిసిందే.

ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి పెళ్లిళ్లను అడ్డుకునేందుకు ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. ఇతర మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు వార్తలు తెలిపాయి. యుపిలో అయితే హిందూ యువతులకు లవ్ జిహాద్ వలలు పన్నుతున్నారనే ఆరోపణతో కేసులు, అరెస్టులు కూడా జరిగిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ నెల 8వ తేదీన ఇచ్చిన ఈ తీర్పు ఎంతైనా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. మైనారిటీ తీరిన, వివాహ వయసు వచ్చిన యువతీ యువకులు తీసుకునే సొంత పెళ్లి నిర్ణయాలకు వారి కుటుంబాల, కుల, వంశ, మత పెద్దల అనుమతి అవసరం లేదని ధర్మాసనం స్పష్టంగా ప్రకటించింది. బెంగళూరులో లెక్చరర్‌గా పని చేస్తున్న ఒక యువతి ఢిల్లీ వెళ్లి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడిని పెళ్లి చేసుకున్న ఉదంతంలో వెంటనే భర్తను వదిలిపెట్టి రావాలని పోలీసులు ఆదేశించారు. ఆ ఆదేశాలను ఆ యువతి తిరస్కరించింది. దీనితో ఆ నవ దంపతులపై దాఖలైన కేసును కొట్టి వేస్తూ సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఇటువంటి కేసులను దర్యాప్తు చేసే పోలీసు సిబ్బందికి తగిన శిక్షణనివ్వాలని సామాజికంగా అత్యంత సున్నితమైన ఈ వ్యవహారాల్లో బాధ్యతగా నిర్ణయాలు తీసుకునేటట్టు చూడాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వయసు, మానసిక పరిణతి కలిగిన యువతీ యువకులు సచేతనంగా తీసుకునే ప్రేమ, వైవాహిక నిర్ణయాలను కాదని, మన సంస్కృతికి భిన్నమైనవంటూ ప్రేమికుల దినాల వంటి వాటని పాటించడాన్ని బలవంతంగా అడ్డుకొని సమాజం చేత వెనుకడుగు వేయించడానికి సాగే దుష్ట ధోరణులు ఇటువంటి తీర్పులతోనైనా తోక ముడవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News