Monday, April 29, 2024

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

interstate drug gang arrested in hyderabad

మూడు ముఠాలకు చెందిన ఎనిమిది మంది, 30మంది వినియోగదారులనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
140 గ్రాముల చరాస్, 184 ఎల్‌ఎస్‌డి, 10 గ్రాముల ఎండిఎంఏ
స్వాధీనం చేసుకున్న పోలీసులు
డార్క్ వెబ్‌సైట్ ద్వారా సరఫరా
క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు
నిందితులు ఉన్నత విద్యావంతులు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: ఆన్‌లైన్ డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితులు, 30మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 140 గ్రాముల చరాస్, 184 ఎల్‌ఎస్‌డి, 10 గ్రాముల ఎండిఎంఏ, ఏడు మొబైల్ ఫోన్లు, రూ.2,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.9లక్షలు ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన నరేంద్ర ఆర్య అలియాస్ హోలీ షాప్, ఫర్హన్ మహ్మద్ అన్సారీ అలియాస్ ట్రీమినేటర్, హైదరాబాద్, జీడిమెట్లకు చెందిన ఉత్కర్స్ ఉమాంగ్, ఎర్రగడ్డకు చెందిన సాహిల్ శర్మ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మలక్‌పేటకు చెందిన అబ్దుల్లా అన్సార్ అహ్మద్ ఖాన్ బిబిఏ స్టూడెంట్, హైదరాబాద్, సుభాష్‌నగర్‌కు చెందిన ఇంద్ర కుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు.

హైదరాబాద్, యూసుఫ్‌గూడకు చెందిన అవిటి చరణ్‌కుమార్, మణికొండకు చెందిన భూషన్ రాజ్ జోమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నిందితులపై హుమాయున్‌నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులు నరేంద్ర ఆర్య అలియాస్ హోలీ షాప్ గోవాలో స్థిరపడ్డాడు. గత ఏడాది నుంచి డార్క్ వెబ్‌సైట్ ద్వారా అవసరం ఉన్న వారికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ కొనుగోలు చేసే వారికి ఇష్టం ఉన్న డ్రగ్స్ ఎంపిక చేసుకునేందుకు విక్కర్ మీ అనే యాప్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాడు. నిందితుడు డ్రగ్స్ వాడుతున్న వారి వద్ద నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు 450మందికి డ్రగ్స్ విక్రయించి రూ.30లక్షలు వరకు ట్రాన్‌జాక్షన్ చేశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫర్హాన్ మహ్మద్ అన్సారీ అలియాస్ ట్రీమినేటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో స్థిరపడ్డాడు, గత ఆరు నెలల నుంచి ఆన్‌లైన్‌లో డార్క్ వెబ్‌సైట్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇండియా పోస్టు, కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు, ఇప్పటి వరకు రూ.15లక్షల వరకు ట్రాన్‌జాక్షన్స్ చేశాడు. ఇద్దరు ప్రధాన నిందితులు యాప్‌లో రకరకాల పేర్లతో ఐడిలు సృష్టించి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఉత్కర్ష్ ఉమాంట్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సార్ అహ్మద్ ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్ కుమార్, భూషన్ రాజు డ్రగ్స్ హోలీ షాప్, ట్రీమినేటర్, జంబాకార్‌టెల్ నుంచి డార్క్ వెబ్‌సైట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు. వీరు వాడడంతో పాటు అవసరం ఉన్న నగరంలోని పలువురికి విక్రయిస్తున్నారు. ఇందులో అబ్దుల్లా అన్సార్ అహ్మద్ ఖాన్, ఉత్కర్ష్ ఉమాంగ్ ఇద్దరు బిబిఏ బ్యాచ్‌మేట్లు వీరు ఇంద్రకుమార్ వద్ద భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి వద్ద కొనుగోలు చేసిన 30మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డిసిపి చక్రవర్తి గుమ్మి, ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై డానియెల్, ఇన్స్‌స్పెక్టర్లు నారాయణరెడ్డి, సతీష్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News