Thursday, May 9, 2024

సార్ చెబితే రైతులు వింటారు

- Advertisement -
- Advertisement -

Interview with Tescob Vice Chairman gongidi Mahender Reddy

 

నియంత్రిత సాగులో విజయం సాధిస్తాం
ఈ దసరాకు యాదాద్రి ప్రధానాలయం పూర్తి…
టెస్కాబ్ వైస్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ

మన తెలంగాణ ప్రతినిధి : సింగిల్ విండో ( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఛైర్మెన్‌గా ఆరుసార్లు ఎన్నికై… తొలిసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాల డిసిసిబి ఛైర్మెన్‌గా.. టెస్కాబ్ వైస్ ఛైర్మెన్‌గా ఎన్నికైనా.. అదే నిరాండంబరత, పార్టీ పట్ల నిబద్ధత.. తన ప్రజల మధ్యే జీవితం. ఆయనే గొంగిడి మహేందర్ రెడ్డి. సతీమణి సునీతా ఆలేరు నియోజకవర్గానికి ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహేందర్ రెడ్డి తన వారికోసం ఎంతైనా చేసే తత్వంతో పాటు సౌమ్యుడిగా పేరుంది. స్వయనా రైతు, తెలంగాణ రాష్ట్ర సమితి రైతువిభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజల కష్టా సుఖాలను ఎరిగిన సిఎం కెసిఆర్ రాష్ట్రానికే కాకుండా దేశానికే నాయకత్వం వహించే సత్తా ఉందన్న ఆయనతో నియంత్రిత సాగు, యదాద్రి నిర్మాణం, ప్రాథమిక సహకార సంఘాలు, డిసిసిబిలు, టెస్కాబ్‌లో తీసుకువస్తున్న పలు సంస్కరణలపై ఆయన మన తెలంగాణ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ప్రభుత్వం చెప్పిన పంటలే రైతులు వేయాలంటే కుదురుతుందా ?

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రంపై, సాగునీటిపై, వ్యవసాయంపై విపరీతమైన జ్ఞానం, అవగాహన ఉంది. రైతులపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్నారు. స్వయనా సిఎం రైతు కావడం తెలంగాణకు వరం. మద్ధతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అదీ మన తెలంగాణే. ఉద్యమం సమయం నుంచే కెసిఆర్ ఏం చెప్పినా.. ప్రజలు అది చేశారు. ఆఖరుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ప్రభుత్వం మంచి కోసమే చెబుతుందన్నది అన్నదాతలకు అర్థమైతే చాలు. ఇంకేం అవసరం లేదు. సిఎం సారు చెబితే రైతులు ఖచ్చితంగా వింటారు. నియంత్రిత పంటల సాగులో విజయం సాధిస్తాం. నేను కూడా రైతునే. ఈ వానకాలం సీజన్‌లో తెలంగాణ సోనా సాగు చేయబోతున్నాను.

యదాద్రి నిర్మాణం ఇప్పట్లో పూర్తవుతుందా ?

యదాద్రి పునఃనిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పూర్తిగా సిఎం పర్యవేక్షణలో శాస్త్రం ప్రకారం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నా సతీమణి సునీతకు (ఆలేరు ఎంఎల్‌ఎ) కానీ, నాకు గానీ, జిల్లా మంత్రికి కూడా ఈ విషయంలో ఎటువంటి జోక్యం లేదు. కెసిఆర్ చెబితే దానికి అనుగుణంగా చేస్తున్నాం. వాస్తవానికి గతేడాదికి ప్రధానాలయం పూర్తి కావాల్సి ఉంది. కాకపోతే దేనికి కూడా వెనకడుగు వేయకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందుకే కాస్త ఆలస్యమౌతోంది. ఈ దసరాకు ప్రధానాలయం పూర్తిగా రెడీ అవుతుందనుకుంటున్నాం. ఇప్పటికే రూ.960 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.1000 కోట్లు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.కాకపోతే పుణ్యక్షేతం చుట్టు పక్కల నిర్మాణ పనులు అన్ని పూర్తి కావడానికి మరో మూడేళ్లు పడుతుంది.

డిసిసిబిల్లో అక్రమాల నిరోధానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు ?

గతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో (డిసిసిబి)ల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మొత్తం పారదర్శకంగా నిర్వహించేందుకు కంప్యూటరైజేషన్ చేశాం. అవకతవకలకు పాల్పడేందుకు అవకాశం లేదు. ప్రతి రికార్డును నమోదు చేయాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. ప్యాక్స్‌లను మరింత సమర్థవంగా నిర్వహిస్తాం. వంద సంవత్సరాలలో రూ.300 కోట్లు పంట రుణాలు ఇస్తే, ఉమ్మడి నల్లగొండ డిసిసిబి చరిత్రలో రికార్డు స్థాయిలో రూ.100 కోట్ల పంట రుణాలు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.60 కోట్లు ఇచ్చినం. ప్రతీ సొసైటీకి రూ.50 లక్షల చొప్పున ఇచ్చినం. బిజినెస్ లోన్ కుడా పరిచయం చేశాం. వ్యాపారాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఇస్తున్నాం. ఇది కూడా నా హయాంలోనే చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో చేసుకునే అవకాశం ఉంది. అయితే కొందరు పంట, అనుబంధ రంగాలకే ఇస్తున్నారు.

ప్యాక్స్‌లకు కమిషన్ సరైన సమయంలో అందుతుందా ?

ఇంతకు ముందు ఐకెపి సెంటర్లు ధాన్యం కొనుగోలు చేపట్టేవి. ఆ బాధ్యతను ప్రభుత్వం ప్యాక్స్‌లకు అప్పగించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నాం. రైతులు కూడా ప్యాక్స్‌లలోనే అమ్మకాలకు ఇష్టాపడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కమిషన్ సరైన సమయంలో అందడం లేదనేది వాస్తవమే. నా సొసైటీకి కూడా కొంత మొత్తం రావాల్సి ఉంది. ప్రభుత్వం త్వరలోనే బకాయిలు ఇస్తుందనే నమ్మకం ఉంది.

ఇద్దరూ ప్రజా జీవితంలోనే ఉన్నారు.. వ్యక్తిగత జీవితం కోల్పోవడం లేదా ?

గత 20, 25 ఏళ్లుగా ప్రజా జీవితంలోనే ఉన్నాను. ఉంటాను. మా మేడం కూడా సర్పంచ్ స్థాయి నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా, ఎంఎల్‌ఎగా ఉంది. నాపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఎంఎల్‌ఎ పనుల్లో కలుగజేసుకుంటానని, అయితే ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారు. పార్టీ లీడర్‌గా, కార్యకర్తగా పార్టీ కార్యాకలపాల్లో కలుగజేసుకుంటాను. ఎంఎల్‌ఎ అధికార విధుల్లో కాదు. మేడం చదువుకున్నది. తెలివైనది. తన నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతుంది. ఇంట్లో కూడా మా మధ్యలో ప్రజా సమస్యలపైనే చర్చలు వస్తాయి. అలా అని వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది. ప్రజా జీవితంలోనే మాకు సంతృప్తి ఉంది. ఇప్పటికీ ఎంత హోదా వచ్చినప్పటికీ, మహేందర్ తన వాళ్లతోనే కలిసి నడుస్తాడు.. నడిపిస్తాడు. నా ప్రజల సమస్యలు తెలియాలంటే వాళ్ల స్థాయిలో ఉంటేనే తెలుస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News