Wednesday, May 8, 2024

తెలుగు అకాడమీ నిధుల కేసు దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

Investigation of Telugu Academy funding case is in full swing

నిందితులను 10 రోజుల కస్టడీ కోరిన సిసిఎస్ పోలీసులు
రిమాండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర అంశాలు
నకిలీ లెటర్ హెడ్, సంతకాలతో నిధులను మళ్లింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైన అంశాలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, ఎపి మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిసిఎస్ పోలీసులు శనివారం నాడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అకాడమీలో రూ. 60కోట్ల రూపాయల డిపాజిట్లను మాయం చేసి నగదును ఎక్కడికి మళ్లించారనే విషయం తెలుసుకోవడానికి నిందితులను 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుందని, కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలు :

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎపికి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో అకాడమీ అధికారులు భేటీ అయ్యారు ఎపి అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఈ నెల 21 న కార్వాన్ యూబిఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా చేసేందుకు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు. ఈక్రమంలో మస్తాన్‌వలి అనుచరడునంటూ అకాడమీ ఉద్యోగి రఫీక్ తో రాజ్‌కుమార్ పరిచయం చేసుకున్నాడు. కాగా మస్తాన్ వలీ, రాజ్‌కుమార్‌తో చాలా వరకు రఫిక్ సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అర్ధ సంవత్సరం కావడంతో ఎఫ్‌డిలు క్లోజ్ చేయడానికి యూబిఐ మేనేజర్ మస్తాన్‌వలి సమయం కోరారు. అనంతరం మూడు రోజులైనా మస్తాన్‌వలీ స్పందించలేదు. దీంతో అకాడమీ డైరెక్టర్ ఈ నెల 24న బ్యాంక్ కి మళ్లీ రఫిక్‌ని పంపించాడు. యూబిఐ కార్వాన్ బ్రాంచ్‌లో ఉన్న అన్ని ఎఫ్‌డిలు క్లోజ్ అయినట్లు రఫిక్ తెలుసుకున్నారు. యూబిఐ కార్వాన్‌లో తెలుగు అకాడమీ రూ.43 కోట్లు ఎఫ్‌డిలను వివిధ సమయాల్లో చెల్లించింది.

ఇందులో భాగంగా రూ. 18 కోట్ల రూపాయలకు సంబంధించి తెలుగు అకాడమీ వద్ద రసీదులున్నాయి. ఈక్రమంలోనే యూబిఐ కార్వన్ మేనేజర్ కొన్ని నెలల కిందటే సంతోష్ నగర్ కి బదిలీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డిఐల క్లోజింగ్ సమావేశానికి హాజరైన సందర్భంలో తాను రెండు బ్యాంకులకు మేనేజర్ గా పని చేస్తున్నానని మస్తాన్‌వలి నమ్మబలికాడు. కాగా ఈనెల 21 నాడే అన్ని బ్యాంకులకు ఎఫ్‌డిలు క్లోజ్ చేయాలని తెలుగు అకాడమి లెటర్ రాసింది.. కానీ, కార్వాన్ బ్రాంచ్‌లో మస్తాన్‌వలి ఎఫ్‌డిలు క్లోజ్ చేసేందుకు సమయం కోరడంతో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందున సమయం ఇవ్వలేమని తెలుగు అకాడమీ అధికారులు స్పష్టం చేశారు.. ఇదే సమయంలో తెలుగు అకాడమీ నకిలీ లెటర్ హెడ్ లు క్రియేట్ చేసి నిధులు మళ్లించే కార్యక్రమం చేపట్టారు.. అకాడమీ లెటర్‌పై ఎప్పుడూ రబ్బర్‌స్టాంప్ ఉండదని, లెటర్ హెడ్ చూడగానే అది నకిలీగా గుర్తించవచ్చని, ఈక్రమంలో నకిలీ లెటర్ హెడ్ సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు మళ్లించినట్టు సిసిఎస్ పోలీసులు గుర్తించారు.

ముఖ్యంగా యూబిఐ కార్వాన్ బ్రాంచ్ నుండి రూ.95 లక్షలను రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ తెలుగు అకాడమికి పంపించాలని నకిలీ లెటర్ హెడ్ లు ఎఫ్‌డి వెనకాల తెలుగు అకాడమీ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి జనవరి 18 నుండి సెప్టెంబర్ 18 వరకు విడతలవారీగా నిధుల మళ్లించారు. ఎపిమర్కంటైల్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ బండారు సుబ్బారావు ఆదేశాల మేరకు నిధులు మళ్లించినట్లు ఆ బ్యాంక్ మేనేజర్ పద్మావతి విచారణలో ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గోల్‌మాల్ అయిన నిధుల్లో 10 శాతం కమిషన్ ను విజయవాడ హెడ్ ఆఫీసర్ కు బదిలీ చేశారని, మిగతా డబ్బును గుర్తు తెలియని వ్యక్తికి ఇవ్వాల్సిందిగా సుబ్బారావు విచారణలో అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సంతకాలు :

అకాడమీ నిధులు దిగమింగేందుకు ఎపి మర్కంటైల్ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతా తెరిచి ఆపై యూబిఐలోని డిపాజిట్లను అక్కడికి మళ్లించారు. డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డిపాజిట్లను మాయం చేసినట్లు తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయడంతో సంతకం ఫోర్జరీ చేశారా..?దీంతో డిపాజిట్ పత్రాల్లోని సంతకాలను సిసిఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డైరెక్టర్ సంతకాలు అసలైనవా లేకపోతే ఫోర్జరీ చేశారా అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో తేలిన అనంతరం దర్యాప్తులో పురోగతి లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. డిపాజిట్లను మాయం చేశారని తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయగా అధికారులు లేఖ రాయడంతోనే డబ్బులు చెల్లించామంటూ యూబిఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ చెబుతుండటంతో పోలీసులు రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గల్లంతైన నిధుల వాటాలపై ఆరా..!

తెలుగు ఆకాడమీలో గల్లంతైన రూ. 60 కోట్ల రూపాయలలో నిందితులు ఎవరు ఎంత వాటా తీసుకున్నారన్న అంశాలపై సిసిఎస్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కుంభకోణంలో రూ. 60కోట్ల రూపాయల నగదును ఎక్కడికి మళ్లించారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుట్రలో భాగస్వాములైనందుకు ఎపి మర్కంటైల్ ఛైర్మన్ సత్యనారాయణకు రూ. 6 కోట్లు ఇచ్చారు. మిగతా 54 కోట్లను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని సిసిఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. మస్తాన్‌వలీ ఒక్కడే ఈ డబ్బంతా తీసుకున్నాడా? లేకపోతే ఎవరెవరికి వాటాలు పంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రూ. 60కోట్లలో రూ. 6 కోట్లు మర్కంటైల్ సొసైటీకి పోను మిగతా రూ. 54కోట్లను పంచుకున్నారా? లేకపోతే ఇంకే బ్యాంకులోనైనా డిపాజిట్ చేశారా? అనే వివరాలను సిసిఎస్ పోలీసులు సేకరిస్తున్నారు.

నిధులు కాజేసేందుకు ఏడాది కాలంగా కుట్ర :

తెలుగు అకాడమీ నిధుల గల్లంతుపై త్రిసభ్య కమిటీ విచారణలో యూబిఐ మేనేజర్ మస్తాన్ వలి అకాడమీ నిధులు కాజేసేందుకు గత ఏడాది నుండే పథకం రచించినట్టు తేలింది. ఈక్రమంలో గతేడాది చివరల్లో ఎపి మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణతో కలిసి నిధులు కొట్టేసే పథకం అమలు చేసినట్లు వెలుగుచూసింది. ది ఆంధ్ర ప్రదేశ్ ఎన్‌సిఎస్ తెలుగు అకాడమీ పేరుతో అగ్రసేన్ బ్యాంకులో బిజినెస్ అకౌంట్ తెరిచిన సొసైటీ చైర్మన్ ఈ ఏడాది జనవరి 2వ వారం నుండి సెప్టెంబర్ 18 వరకు సొసైటీ ఖాతాకు మొత్తం రూ.63.47 కోట్ల తెలుగు అకాడమీకి చెందిన మొత్తాన్ని నగదు రూపంలో విడుదల చేశారు.ఈ క్రమంలో అకాడమీలో నెల రోజుల సిసి ఫుటేజి, హార్డ్ డిస్క్‌ల ను త్రిసభ్య కమిటీ స్వాధీనం చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News