Monday, April 29, 2024

ఫైనల్ చేరేదెవరో?.. గుజరాత్‌తో చెన్నై ఢీ

- Advertisement -
- Advertisement -

ఫైనల్ చేరేదెవరో?
గుజరాత్‌తో చెన్నై ఢీ
నేడు క్వాలిఫయర్1 సమరం
చెన్నై: ఐపిఎల్ సీజన్16లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి నాకౌట్ పోటీలకు తెరలేవనుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మంగళవారం క్వాలిఫయర్1 పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు మే 28న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఓడినా జట్టుకు కూడా మరో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఓడిన జట్టు క్వాలిఫయర్2లో తలపడుతోంది. ఈ మ్యాచ్ మే 26న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మే 24న చెన్నైలోని ఎం.ఎ.చిదరంబరం స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. క్వాలిఫరయ్1కు కూడా చెన్నై ఆతిథ్యం ఇస్తోంది. ఇక చెన్నైగుజరాత్ జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు.

లీగ్ దశ పోటీల్లో ఇటు గుజరాత్, అటు చెన్నైలు అత్యంత నిలకడైన ఆటను కనబరిచారు. ఇరు జట్ల సారథులు హార్దిక్ పాండ్య, మహేంద్ర సింగ్ ధోనీలు తమ తమ జట్లను ముందుండి నడిపించారు. గుజరాత్ లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో ఏకంగా పదింటిలో విజయాలు సాధించింది. 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక చెన్నై 14 మ్యాచుల్లో 8 విజయాలు సొంతం చేసుకుంది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవ్వగా లక్నోతో జరిగిన పోరు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. 17 పాయింట్లతో చెన్నై లీగ్ దశలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో కూడా 17 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌లో వెనుకబడడంతో మూడో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఇక ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరు అర్హత సాధించింది.

జోరుమీదున్న టైటాన్స్
వరుస విజయాలతో లీగ్ దశలో పెను ప్రకంపనలు సృష్టించిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో చెన్నైతో జరిగే క్వాలిఫయర్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు జోరుమీదున్నారు. కిందటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో కదం తొక్కాడు.

ఈ సీజన్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్ దశలో రెండు శతకాలు బాది సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. విజయ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కెప్టెన్ హార్దిక్ పాండ్య తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, రషీద్, శనక, నూర్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో సిఎస్‌కె..
మరోవైపు మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. లీగ్ దశలో సిఎస్‌కె నిలకడైన ప్రదర్శనతో అలరించింది. క్వాలిఫయర్ పోరులోనూ మెరుగైన ఆటతో విజయం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై బలంగా ఉంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు పరుగులు వరద పారిస్తున్నారు. అజింక్య రహానె, శివమ్ దూబే, అంబటి రాయుడు, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోనీ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక తీక్షణ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, జడేజా, మోయిన్ అలీ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో చెన్నైకి కూడా ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయని చెప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News