Monday, April 29, 2024

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ భూమార్గంలో, సముద్ర మార్గం నుండి ఎయిర్ గ్లేయిడెర్స్ ద్వారా మారణాయుధాలతో చేసిన ఆకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నెవ్వరపోయాయి. ఇప్పుడు హమాస్ చేసిన ఈ దుందుడుకు చర్యలను ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. ఈ హింసా ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ విధిగా ఖండించవలసిందే. అందులో ఏమాత్రం సంశయం అక్కర లేదు. అయితే, ఒకసారి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పాలస్తీనా- ఇజ్రాయెల్ సమస్యను నిష్పాక్షికంగా అంచనా వేయాలి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ముద్రవేస్తున్నారు. అయితే బిజెపి అగ్రనాయకుడు, ఆ పార్టీ మూలపురుషుడు వాజ్‌పేయీ ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు, అలాగే ప్రధాన మంత్రిగా వున్నప్పుడు కూడా పాలస్తీనా సమస్యను సానుభూతితో అర్ధం చేసుకున్నారు. వారి న్యాయమైన భూభాగంలో ఇజ్రాయెల్ అక్రమ చొరబాటును ఆక్షేపించారు. పాలస్తీనాపై అనేకసార్లు అమెరికా, ఇతర ఐరోపా దేశాల సహకారంతో ఇజ్రాయేల్ చేసిన యుద్ధాలు, చేసిన దాడులను, క్రూరమైన హింసాయుత చర్యలను ఆయన ఖండించారు.

ఆ విషయాన్ని మనం మరచిపోకూడదు. చారిత్రకంగా పాలస్తీనాకు జరిగిన అన్యాయం విషయంలో భారత దేశంతో సహా సమస్త అలీన దేశాలు అండగా నిలిచిన చరిత్రను మరిచిపోవద్దు. ముఖ్యంగా ఆనాటి మన ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇంధిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయీ, పివి వరకు పాలస్తీనా తన భూభాగంలో తనకు స్థానం లేకుండా చెయ్యడాన్ని అందరూ ఏకకంఠంతో ఖండించినవారే. సానుభూతి ప్రకటించారు. ఒకప్పుడు పాలస్తీనాకు అండదండగా యునైటెడ్ అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 1987 ఇస్లామిక్ రెసిస్టెన్స్ ముస్లిం బ్రదర్ హుడ్‌కు సపోర్ట్ కూడా ఉంది. ‘పతా’ లాంటి మితవాద సంస్థ కూడా పాలస్తీనాకు అండగా వున్నాయి. రష్యాకూడా ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేసినప్పుడు పాలస్తీనాకు అండగా నిలబడింది. ఇప్పుడు ‘గాజా’ భూభాగంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో, ఇరువైపులా అనతికాలంలోనే సంభవించిన వందలాది మరణాలు, అపరిమితమైన విధ్వంసం ఆవేదన కలిగిస్తున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ పక్షాన అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు, ఇండియాతో సహా సపోర్ట్‌గా ఉంటే,

హమాస్ (పాలస్తీనా) పక్షాన లిబియా, సిరియా, ఇరాక్, ఇరాన్, యునైటెడ్ అరబ్ మొదలైన ఇస్లామిక్ దేశాలు అండగా, ఇతర రాజ్యేతర శక్తులు రంగప్రవేశం చేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో క్రమంగా మూడవ ప్రపంచ యుద్ధంగా మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆధునిక యుద్ధంలో, అణు బాంబులు, రసాయినిక బాంబులు, బయో కెమికల్ బాంబులు, లేజర్ బాంబులు, క్లసట్టర్ బాంబులు, లాంగ్ రేంజ్ బాలెస్టిక్ గైడెడ్ మిసైల్స్, డ్రోన్ల వినియోగ టెక్నాలజీ మొదలైన ఆయుధాలు ఇబ్బడిముబ్బడిగా కలిగి ఉన్న అభివృద్ధి చెందిన ఆధిపత్య దేశాల పోరులో సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, కదలలేని, మెదలలేని స్థితిలో వున్న అనారోగ్య పీడితులు, అభంశుభం తెలియని యువతీ యువకులకు కష్టకాలం వచ్చిపడింది. వారు అన్ని రకాలుగా నలిగిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో మండుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి.కొన్ని వస్తువులను వ్యాపారులు ఇప్పటి నుండే బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నారు.అన్ని దేశాల కరెన్సీ విలువలు పడిపోతున్నాయి.

ప్రపంచం క్రమంగా ద్రవ్యోల్బణం వలలో చిక్కుకుంటుంది. ఈ దేశాల మధ్య శాంతి చర్చలు జరగకపోతే, ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోకపోతే ఇక ముందు జరగబోయే వినాశనం ఏస్థాయిలో ఉంటుందో ఊహించలేము. ఇండియాతో పాటు కొన్ని దేశాలు హమాస్ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇజ్రాయెల్‌కు సంపూర్ణ సహకారం ప్రకటిస్తూ యూరోపియన్ రాజ్యాలు తమ ప్రకటనలో, హమాస్ ఎంత భయానకమైన ఉగ్రవాద సంస్థో, దాని గతం ఎంత దుర్మార్గమైనదో సుదీర్ఘంగా వివరించాయి.అదే ప్రకటనలో పాలస్తీనా ప్రజల ‘న్యాయబద్ధమైన’ ఆకాంక్షల గురించి ఓ నామమాత్ర ప్రస్తావన చేస్తూ, ఈ ఆకాంక్షలకు హమాస్ ప్రతినిధి కాదని, దాని చర్యలు హింసను పెంచడానికి తప్ప పాలస్తీనియన్ల సంక్షేమానికి ఉపకరించవని వ్యాఖ్యానించాయి. అది కొంత మేరకు నిజమే కావచ్చు. కానీ పాలస్తీనియన్ల సంక్షేమం, ఆకాంక్షల విషయంలో ఈ అగ్ర రాజ్యాలన్నీ ఏడున్నర దశాబ్దాలుగా ఏం చేశాయి? అవి అనుసరిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అనుకూల వైఖరే హమాస్ వంటి ఒక మిలిటెంట్ సంస్థ ఇంతగా బలపడటానికి దోహదం చేసింది అనే చారిత్రక సత్యాన్ని మరచిపోతే ఏలా? హమాస్ స్వయంగా సముద్ర, వాయు, భూతల మార్గా ల్లో దాడి చేయడమే కాదు,

దానికి తోడుగా, వేలాదిమంది యువకులు ప్రాణ త్యాగానికి సిద్ధపడి అడ్డుగోడలు ఛేదించి మరీ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన సాహసం గమనించాలి. నాలుగు తరాలుగా సొంత భూభాగంలో పరాయివారుగా ఉంటూ ఆంక్షలు, నిర్బంధాల మధ్య కనీసం జీవించే హక్కుకు కూడా నోచుకోని స్థితిలో సామాన్యులు సైతం ఇటువంటి మిలిటెంట్ సంస్థల వైపు ఆకర్షితులు కావడం సహజమే కదా! చారిత్రకంగా ఇజ్రాయెల్ ఏర్పాటే ఓ వివాదాస్పదమైన ప్రక్రియ. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో కనీసం అరడజను భద్రతా మండలి తీర్మానాలు, ‘ఓస్లో’ ఒప్పందాలను అది యథేచ్ఛగా ఉల్లంఘించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టిన అగ్రరాజ్యాలే ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటూ, ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరిని సమర్థిస్తుంటే, పాలస్తీనియన్లకు శాంతి ఒప్పందాల మీద మిగతా ప్రపంచం మీద నమ్మకం సడలిపోకుండా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరిగ్గా యాభై యేళ్ళ క్రితం ఆరు అరబ్ దేశాలను ఆరు రోజుల్లోనే ఓడించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఎంతో బలమైన నిఘా సమాచార వ్యవస్థ, అత్యంత శక్తిమంతమైన సైన్యం, ఆధునిక ఆయుధ సంపత్తి ఉండి కూడా హమాస్ దాడిని నిలువరించలేకపోయిందనే విషయాన్ని మనం గుర్తుంచు కోవాలి.

ఒకసారి బాగా ఆలోచిస్తే ఇజ్రాయెల్-, అరబ్బు దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒప్పందాలు స్నేహ సంబంధాలను విచ్ఛిన్నం చేయడం కూడా ఈ దాడి లక్ష్యం కావచ్చు. చివరకు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధపడుతున్న తరుణంలో హమాస్ ఈ దాడి జరపడం అరబ్ దేశాలను తీవ్ర సందిగ్ధంలో పడేసినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారం ఎంత బీభత్సంగా ఉంటుందో గతంలో చూశాం. ఇప్పుడూ గత 5, 6 రోజులుగా మీడియాలో చూస్తూనే ఉన్నాము. దాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఆ రక్తపాతం మధ్యన ఈ దేశాలు తాము ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఏర్పడింది. హమాస్ దాడితో పాలస్తీనా, -ఇజ్రాయెల్ మధ్య శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగిందన్న విమర్శలు అర్థం లేనివి, సత్యాన్ని వక్రీకరించేవే. బెంజిమిన్ నెతన్యాహూ తన పదవీ కాలంలో ఎన్నడూ పాలస్తీనీయన్లతో న్యాయబద్ధంగా వ్యవహరించలేదనే విషయం ప్రపంచానికి తెలియదా? పైగా ఇజ్రాయెల్ చరిత్రలోనే తొలిసారిగా అతిమితవాద పక్షాలన్నింటినీ కూడకట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన గతంలో కంటే దుర్మార్గంగా వ్యవహరించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఉన్మాదుల సలహాదారులతో నిండిన ఆయన ప్రభుత్వం ఆక్రమిత ప్రాంతాల్లో

చేసే దుశ్చర్యలకు న్యాయస్థానాలు కొద్దో, గొప్పో అడ్డుతగులుతున్నందున జడ్జీల నియామక ప్రక్రియనే తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. లక్షలాది మంది ఇజ్రాయెల్ పౌరులు ఆయన న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని వేలాది రిజర్వు సైనికులు కూడా బెంజిమిన్ నెతన్యాహూ నిర్ణయాలను తప్పుపడుతున్నారు.దేశంలోని మాజీ న్యాయమూర్తులతో సహా అన్ని రంగాలలోని ప్రముఖులు ఆయన పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇజ్రాయెలీల రక్షకుడిగా తనను తాను చెప్పుకొనే నెతన్యాహూ ‘హమాస్’ దాడితో అసమర్ధుడిగా పేరొస్తున్నదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. కానీ గతంలో ఎన్నడూ లేనం విస్తృతమైన, బలమైన దాడికి ‘హమాస్’ సిద్ధపడుతున్నదని, ఆయుధాలు సమ కూర్చుకొంటుందనే సమాచారం పది రోజుల క్రితమే ఆయనకు సైనిక ఇంటెలిజెన్స్ తెలిపినా నెతన్యాహూ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్షంతో,

అజాగ్రత్తగా ఉన్నట్లు వార్తా కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఆ వార్తలు ఎంత వరకు నిజమో చెప్పలేము. ఇప్పుడు ఇజ్రాయెల్ నిర్ణయం గాజాతో పాటు మొత్తం పాలస్తీనానే తుడిచిపెట్టే దిశగా సాగుతుంది. ఈ దాడులతో విజయం సాధించి మరోపక్క స్వదేశంలో అసమ్మతి లేకుండా చేయడానికి ఇది బెంజమిన్ నెతన్యాహూకు ఉపకరిస్తుంది. హమాస్ మీద ఉన్న ప్రతీకార కక్షనంతా ఆయన అమాయకులైన గాజా ప్రజల పైన ఆహారం, నీరు, మందులు, విద్యుత్తు అందనీయకుండా అమానుషంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో మీడి యా ద్వారా ప్రపంచం చూస్తూనే ఉంది.ఏది న్యాయమో, ఏది అన్యాయమో భవిష్యత్తులో తేలుతుంది.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News