Monday, April 29, 2024

ఇజ్రాయెల్-పాలస్తీనా.. మనమెటు?

- Advertisement -
- Advertisement -

ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేకత బిజెపి విధానంతో భారత దేశంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పెరుగుతోంది. ‘భారతీయులు ఎంతగా మారిపోయారు!’అని పాలస్తీనా రచయిత్రి సుశాన్ అబుల్ హవా ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌తో అన్నారు. ‘వలసవాద ఇజ్రాయెల్ అనుసరించే తీవ్రహింసతో చితికిపోతున్న గాజా ప్రజల దుస్థితిని అర్థం చేసుకోవడంలో వలసవాద క్రూరత్వ అనుభవాలున్న భారత ప్రజలు విఫలమయ్యారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘వలస వచ్చి, ఇక్కడ తిష ్టవేసి, గాజా ప్రజలను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ విజయాన్ని భారతీయులు ఎలా కోరుకుంటారు?’ అని ఆమె ప్రశ్నించారు.

భారత దేశంలో గతానికి భిన్నంగా ఇటీవల జరిగిన అనేక మార్పులకు ఎన్నో కారణాలున్నాయి. బ్రిటిష్ వలస వాదాన్ని మర్చిపోయి, అంతకు పూర్వపు మొఘల్ ముస్లిం పాలనే నిజమైన వలస వాదమనే భావన పెరగడం ఈ మార్పునకు ఒక కారణం. భారత దేశంలో హిందూవులు అధిక సంఖ్యాకులన్న విషయం ప్రపంచమంతా వ్యాపింప చేశారు. అందువల్ల పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి భారత దేశంలో విస్తృతమైన మద్దతు తీసుకు రాగలిగారు. పురాతనమైన జాతి నివసించే ఈ ప్రాంతంలో యుద్ధం ముగియాలని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది కోరుతున్నారు. గాజా లో ప్రజలను నిర్మూలించాలని హిందీలో అనేక మంది పోస్టులు పెట్టారు. ఇజ్రాయెల్ ఆధీనంలో మహిళలు, పిల్లలు సహా అయిదు వేల మంది పాలస్తీనియన్లు ఉన్నారు.

దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై హమాస్ బాంబు దాడి చేసి 1,300 మందిని చంపేసి, 200 మంది ఇజ్రాయిల్ వాసులను బందీలుగా పట్టుకుంది. ఇజ్రాయెల్ ప్రతి దాడి చేశాక భారత పత్రికా రంగంలో కొంత సంతోషం పెల్లుబికిందన్న మాట అతిశయోక్తి కావచ్చుకానీ, ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇజ్రాయెల్ పట్ల పక్షపాత ధోరణిలో ఉన్న పశ్చిమ దేశాలకు భారత పత్రికా రంగం ఏమాత్రం భిన్నంగా లేదన్నది సుస్పష్టం. హమాస్ దాడి తరువాత ఇజ్రాయెల్ ప్రతిస్పందనను అధిక భాగం పత్రికలు, వార్తా చానెళ్ళు ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్‌లో మహిళలు, పిల్లలు చనిపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. గాజాలో పిల్లలను విచక్షణా రహితంగా ఇజ్రాయిల్ దాడుల్లో చంపడం గురించి స్పందిస్తూ, పౌరుల మధ్యే ‘హమాస్’ ఉండడం వల్ల ఇలా జరిగిందని అవి సరిపెట్టుకున్నాయి.

గాజాలో పౌరులను చంపడాన్ని సమర్థించకుండా, వారి మద్దతు లేకుండా హమాస్ నిలబడదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. హమాస్‌కు వ్యతిరేకంగా గాజా పౌరులు తిరుగుబాటు చేయకపోతే వారికి ఇబ్బంది ఏర్పడుతుందని హితవు పలుకుతున్నాయి. అసలు వాస్తవాన్ని వదిలేసి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండానే హమాస్ దాడి చేసిందని పశ్చిమ దేశాల పత్రికా రంగంతో పాటు రాజకీయనాయకులు కూడా ఆరోపించారు. ఇజ్రాయెల్ భద్రతా దళాలే కాకుండా, ఇజ్రాయెల్‌కు వలస వచ్చి అక్కడ స్థిరపడిన వారికి ఆయుధాలు ఇచ్చి పాలస్తీనియన్లపై దాడి చేసి, వారిని చంపడమే కాకుండా వారి ఇళ్ళను దోచుకోవడం రోజూ చూస్తున్నాం.

ఇజ్రాయెల్‌కు చెందిన యూదు జాతీయుడు, సీనియర్ జర్నలిస్టు అమిరా హాస్ మాట్లాడుతూ ఇది నిజాయితీ లేని చర్యని తప్పుపట్టారు. ఈ అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడితోనే ఈ వివాదాల చరిత్ర మొదలవ్వలేదని అంటారు. పాలస్తీనాలోని గాజాలో, వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంలలో కూడా ఇజ్రాయెల్ అనూహ్యమైన అరాచకాలకు పాల్పడకపోతే హమాస్ దాడి జరిగేది కాదంటారామె. గాజాను పూర్తిగా విధ్వంసం చేయడం ద్వారా ఈ పోరాటానికి ముగింపు పలకాలని భారత పత్రికారంగం కోరుతోంది. భారత ప్రధానిగా కూడా ఉన్న భారత పత్రికల చీఫ్ ఎడిటర్ వ్యక్తం చేసిన తొలి స్పందనతో ఇదంతా జరుగుతోంది. ‘ఇజ్రాయిల్ పైన టెర్రరిస్టు దాడి చేయడంతో తీవ్రంగా కలత చెందాను’ అని నరేంద్ర మోడీ వెంటనే ట్వీట్ చేశారు. ‘ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులతో, వారి కుటుంబాలతోనే ఉంటాయి. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తాం’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ మాటలను భారత పత్రికారంగం ప్రేవ్‌ు కట్టి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ రంగ ప్రవేశం చేశారని ప్రచారం మొదలు పెట్టింది. మన ప్రధాని మాటలతో హమాస్‌కు భయం పట్టుకుందని కూడా పేర్కొంది. స్వాతంత్య్రానంతరం నుంచి ఇజ్రాయెల్‌తో ప్రదర్శిస్తూ వస్తున్న విధానానికి గౌరవం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మరి కొన్ని పత్రికలు కీర్తించాయి. హమాస్ దాడితో విచారం వ్యక్తం చేసిన భారత దేశం సంయమనం పాటించాలని, గాజాలో అమాయకులపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను కోరింది. ఇజ్రాయెల్ దాడి చేసిన అయిదు రోజుల తరువాతనే పాలస్తీనా సార్వభౌమాధికారం తరపున నిలబడుతున్నట్టు భారత్ తన అధికారిక అభిప్రాయాన్ని సరిచేసుకుంది. గాజాపైన ఇజ్రాయెల్ దాడి చేసిన పజ్జెనిమిది రోజుల తరువాత కూడా కాల్పుల విరమణకు భారత దేశం పిలుపివ్వలేదు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరలేదు. దీన్ని బట్టి మనకు అర్థముతున్నది ఏమిటంటే, గాజాలో పౌరులపైన జాతి వివక్షతో దాడి చేయడాన్ని భారత దేశం అనుమతించినట్టయిందన్న సందేశం సూచిస్తోంది.

వచ్చే నెలలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఇజ్రాయెల్ ‘యుద్ధం’ ప్రభావం పడిందని చండీగఢ్‌కు చెందిన ఒక జర్నలిస్టు మిత్రుడు ఒకరు నాతో అన్నాడు. అతని ఆందోళన కొట్టిపారేసేది కాదు. పెద్ద పత్రికలు, చానెళ్ళను గమనించినట్టయితే అవి బిజెపికి కంఠస్వరంలా పని చేస్తున్నాయి. తీవ్రవాదం అనేది ముస్లింలను ద్వేషించడానికే ఉపయోగపడుతోంది. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకునే విధంగా ఇస్లామిక్ దేశాలలో పాలస్తీనా ప్రజలు నివసించడానికి సదుపాయాలు కల్పించాలని అవి సూచిస్తున్నాయి. భారతీయ ముస్లింలను పాకిస్థాన్‌కు తరిమి వేయాలనే విధంగా ఈ సూచన ఉంది.

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఘర్షణను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడమే కాకుండా, ముస్లింలను పిశాచాల్లాగా చూపించడం మొదలుపెట్టారు. పాలస్తీనా ‘తీవ్రవాదం’ ఫలితంగానే ఇందిరా గాంధీ విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ రూపొందాయని బిజెపి ప్రచార సెల్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. హమాస్ దాడి తరువాత మోడీ అభిప్రాయానికి భిన్నంగా కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. హమాస్ దాడిని ఖండించడమే కాకుండా వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ‘కాల్పుల విరమణ పాటించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి (సిడబ్ల్యుసి) కోరుతోంది. ప్రస్తుత పరిస్థితికి కారణమైన అత్యవసర సమస్యలతో పాటు, దీర్ఘకాలిక సమస్యలను కూడా చర్చించడానికి సంప్రదింపులు జరపాలి’ అని ప్రకటించింది. పాలస్తీనా వాసుల స్వాతంత్య్రం గురించి మాట్లాడాలని మాత్రం కాంగ్రెస్ భావించలేదు.

కాంగ్రెస్ పార్టీ విధానం పాకిస్థాన్ విధానంలా ఉందని అసోం ముఖ్యమంత్రి హిమాం త్ బిశ్వాన్ శర్మ వ్యాఖ్యానించారు. పాలస్తీనా ప్రజల హక్కుల గురించి, వారి భూమి గురించి, వారి వనరుల గురించి మాట్లాడిన శరద్ పవార్ తన కుమార్తె సుప్రియ సులెను హమాస్ తరపున పోరాడడానికి పంపించాలని వ్యంగ్యం గా వ్యాఖ్యానించడమే కాకుండా, భారత ప్రధాన మంత్రులంతా పాలస్తీనాకు మద్దతుగా నిలిచారని అన్నారు. మరొక బిజెపి నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘భారత దేశంపై తీవ్రవాదుల దాడి చేసిన వారిని ఢిల్లీలోని బట్లాహౌస్ వద్ద ఎన్‌కౌంటర్‌లో చంపేయడం పట్ల శరద్ పవార్ కన్నీరుకారుస్తున్నారు. ఆ ప్రభుత్వం లాగానే ఆయన కూడా వ్యవహరిస్తున్నారు’ అన్నారు.

పాలస్తీనాను సమర్థించడమంటే తీవ్రవాదాన్ని సమర్థించడమే అవుతోంది. భారత దేశంలో పాలస్తీనాను సమర్థిస్తే జైలు పాలు కావచ్చు.పాలస్తీనాపైన నిరసన తెలపడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. బిజెపి చేపట్టిన ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక విధానం పెరగడం వల్ల భారత దేశంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పెరుగుతోంది. అలాగే ఇజ్రాయెల్‌లో యూదులు ప్రథమ శ్రేణిపౌరులు కాగా,మిగతా వారు రెండవ శ్రేణి పౌరులనే ఆలోచన బిజెపిని బాగా ఆకట్టుకుంది. భారతదేశంలో హిందువులను ప్రథమ శ్రేణి పౌరులుగా భావించాలనేది వారి ఆలోచన. ఇజ్రాయెల్ లాగా భారత దేశం కూడా అధిక సంఖ్యాకుల ప్రజాస్వామ్యం కావాలని వారి కోరిక.

ఇజ్రాయెల్‌లో యూదులకంటే పాలస్తీనా ప్రజలు తక్కువ అనే భావనను వారు పంచుకుంటున్నారు. ఇజ్రాయెల్ గురించి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అనుసరించే విధానం వారి మద్దతుదారులకు అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగా తయారైంది. యూదుల సమస్యకు వారిని తుద ముట్టించడమే నాజీల తుది పరిష్కారమైనప్పుడు, యూదులను సమర్థించడాన్ని నాజీల మద్దతు దారులు ఎలా సమర్దించుకుంటారు? ఈ వైరుధ్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఆధిపత్యం ద్వారానే వివరించగలుగుతాయి. హింస ద్వారా ఇతరుల పైన ఆధిపత్యాన్ని చెలాయించేవారు ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు. వందేళ్ళ క్రితం నాజీలు ఆధిపత్య శక్తి. ఇప్పుడు ఇజ్రాయిల్‌లో యూదులు ఆధిపత్య శక్తి. నాడు హిట్లర్‌ను ఆరాధించిన ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు ఇజ్రాయెల్‌ను భక్తితో ఆరాధించేలా తయారయ్యింది.

విద్యాలయాల్లో ఎందుకు నిశ్శబ్దం రాజ్యమేలుతోందని నా జర్నలిస్టు మిత్రుడు ఆశ్చర్యపోతున్నాడు. యువతరం ఎందుకు నోరు విప్పడం లేదు? వారికి తగినంత సమాచారం లేకపోవడం ఒక కారణం. సమాచారం కోసం వారు పెద్ద పెద్ద టివి వార్తా చానెళ్ళపైన, పెద్దపెద్ద పత్రికలపైన ఆధారపడతారు. మణిపూర్‌లో ఆరు నెల్లుగా హింస చెలరేగుతుంటే అసలు ఏం జరుగుతోందో భారతీయ యువతకు తెలియడం లేదు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని వారు నిరసన ప్రదర్శన చేయలేదు. అలాంటి యువతరం పాలస్తీనాలో ఏం జరుగుతోందో ఆలోచించమనడం అసంబద్దం. హమాస్ దాడి నుంచి ఇజ్రాయెల్ అస్తిత్వం మాత్రమే వారికి కావాలి. పాలస్తీనా అంటూ ఒకటుందన్న ఊహ కూడా వారికి అందదు. పాలస్తీనా ప్రజలకు హక్కులు కావాలని గాంధీ, నెహ్రూ కోరారు.

ఆ మహా నాయకులు చేసిన తప్పులను ఇప్పటి భాతదేశం సరిచేస్తోందని ఇప్పుడు హిందూ మతంలో గణనీయంగా ఉన్న ప్రజలు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ అనుసరించే హింసాత్మక విధానం ప్రజలను అదుపు చేయడానికని బహుశా వారు భావిస్తూ ఉండవచ్చు. భారత దేశ విముక్తి పోరాటానికి సంబంధించిన సమాంతర విద్యా బోధన ఇప్పుడు అందడం లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య లెక్కలు 5 ప్రకారం 52% మంది భారతీయులు ముప్పై ఏళ్ళలోపు వారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్ష గురించి చాలా మంది భారతీయులకు గుర్తుండకపోవచ్చు. భారత రాజకీయ నాయకత్వం జాతి వివక్షపై అంతర్జాతీయ అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉండవచ్చు. అంత కంటే మించి భారతీయ సమాజంలో కులం పేరుతో మనుషులను విడదీయడం అనే మరొక రకమైన జాతి వివక్ష గురించి, దానిలో ఇమిడి ఉన్న మేం అధికులం అనే ఆధిపత్యవాదం గురించి చాలా మంది భారతీయులకు స్పృహ ఉండకపోవచ్చు. ఇజ్రాయిల్ ఆ స్పృహను సాధించింది. అందుకునే అసంకల్పితంగా దాన్ని ఆరాధిస్తోంది.

మూలం: అపూర్వానంద్ అనువాదం రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News