Sunday, April 28, 2024

భద్రతా వలయంలో ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే ఈ సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా పలు దేశాల నేతలు శుక్రవారం ఢిల్లీ చేరుకోనున్నారు. అందరికన్నా ముందుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాశ్రయంలో దిగనున్న సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. భారతీయ మూలాలున్న సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అంటే మధ్యాహ్నం 2.15 గంటలకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వస్తారు. ఆయనకు కూడా చౌబే విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. కాగా అందరి దృష్టీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పైనే ఉంది. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఢిల్లీ చేరకోనున్న బైడెన్‌కు కేంద్ర మంత్రి వికె సింగ్ స్వాగతం చెబుతారు. జి20 శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ వస్తారా లేదా అనే సస్పెన్స్ కొంత ఉండింది.

ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు కొవిడ్19 పాజిటివ్ రావడమే దీనికి కారణం. అయితే బైడెన్‌కు నెగెటివ్ రావడంతో ఆయన భారత పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. బైడెన్ ఢిల్లీ చేరుకునే సమయానికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా వస్తారు. ఆయన శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వస్తారు. ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం చెబుతారు. సాయంత్రం 7.45 గంటలకు చైనా ప్రధాని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సదస్సుకు వెళ్లరాదని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానంలో ప్రధాని లి క్వియాంగ్ చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్‌చిన్‌లను చైనా భూభాగాలుగా పేర్కొంటూ ఆ దేశం ఇటీవల అధికారిక మ్యాప్‌ను విడుదల చేయడం ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతకు కారణమైన విషయం తెలిసిందే. అయితే జీ జిన్‌పింగ్ సదస్సుకు రాకపోవడం అసాధారణమేమీ కాదని, దాని ప్రభావం సదస్సుపై ఉండదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పడం గమనార్హం. వీరే కాకుండా నైజీరియా, ఇటలీ, ఇటలీ,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, యుఎఇ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బ్రెజిల్, ఇండోనేసియా, టర్కీ, ఈజిప్టు, తదితర దేశాలకు చెందిన నేతలు కూబా ఒకరి తర్వాత ఒకరుగా శుక్రవారం అర్ధరాత్రి వరకు రానున్నారు. వీరందరికీ ఢిల్లీలోని వివిధ స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్
ఇదిలా ఉండగా భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జి20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ నగరం ముస్తాబయింది. ఓ వైపు రహదారులు, దర్శనీయ స్థలాలు లాంటి వాటిని అందంగా తీర్చి దిద్దడంతో పాటుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఏర్పాట్ల తుది తనిఖీ కోసం ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం సదస్సు జరిగే ప్రగతి మైదాన్‌తో పాటు గాంధీ సమాధి ఉన్న రాజ్‌ఘాట్ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ ‘భారత్ మండపం’లో జి20 సదస్సు శనివారంనుంచి రెండు రోజలు పాటు జరగనుండగా ఈ సదస్సుకోసం ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే వివిధ దేశాల నేతలు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత గాంధీజీకి నివాళులర్పించనున్నారు.ఈ దృష్టా రాజ్‌ఘాట్ లేక్ ప్రాంతంలో పోలీసులు ట్రాక్టర్‌తో పెట్రోలింగ్ నిర్వహించారు. రాజ్‌ఘాట్, ప్రగతి మైదాన్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన లెఫ్టెనెంట్ గవర్నర్ ఈ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా, ఏర్పాట్లన్నీ సరిగే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అనంతరం సీనియర్ అధికారులతో కలిసి సక్సేనా మినీ బస్సులో ఢిల్లీలో ప్రధాన మార్గాల్లో పర్యటించి సదస్సుకోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఢిల్లీ పోలీసు, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన కంట్రోల్ రూమ్‌లను కూడా సందర్శించారు. సదస్సు కోసం చేసిన భద్రతా ఏర్పాట్లతో పాటుగా కంట్రోల్ రూమ్ విశేషాలను ఢిల్లీ పోలీసు కమిషనర్ లెఫ్టెనెంట్ గవర్నర్‌కు వివరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 5 వేలకు పైగా సీసీ టీవీ కెమెరాల విజువల్స్ ఈ కంట్రోల్ రూమ్‌కు అందుతాయని, రోజులో 24 గంటల పాటు వివిధ షిఫ్టుల్లో ఒక్కోటి 25 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెండు బృందాలు ఈ విజువల్స్‌ను నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా నగరంలోని వివిధ మార్గాల్లో పరిణామాలను నిరంతరం మానిటర్ చేయడం కోసం 30 సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక కమాండ్ రూమ్‌ను కూడా ఈ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేశారు. లెఫ్టెనెంట్ గవర్నర్ గత 65 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 59 తనిఖీలు నిర్వహించారని, ఇది చివరి తనిఖీ అని అధికారులు చెప్పారు. మరో వైపు జి20 సదస్సును దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పోటీసులు రాజధాని నగరాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నారు. నిఘా కెమెరాలతో డేగకన్ను వేశారు. డాగ్ స్కాడ్స్‌ను కూడా రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లలో వచ్చి పోయే వారందరిపైనా నిఘా పెట్టారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాద్వారా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులకు చెందిన ప్రతి బ్యాగ్‌ను చెక్ చేస్తున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, ప్రైవేటు బస్సులు, కమర్షియల్ వెహికిల్స్‌పైన పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. స్విగ్గీ, జొమాటోలాంటిఫుడ్ డెలివరీ యాప్స్‌ను కూడా అనుమతించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News