Monday, April 29, 2024

హిజాబ్‌పై రేపు కర్నాటక హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

Karnataka High Court to rule on hijab tomorrow

అంతటా ఉత్కంఠ… కర్నాటకలో భద్రతా ఏర్పాట్లు

బెంగళూరు : హిజాబ్‌పై నిషేధం అంశంపై కర్నాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో హిజాబ్ నిషేధం అంశం కర్నాటకలో వివాదాస్పదం అయ్యి, పలు ప్రాంతాలలో ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలలో విద్యార్థినుల ముఖాలకు ముసుగులు ధరించిన వ్యవహారంపై కీలక తీర్పు వెలువడనుండటంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సునిశిత ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తీర్పు నేపథ్యంలో ఎటువంటి ప్రదర్శనలు, సభలు నిర్వహించరాదని పోలీసు విభాగం ఉత్తర్వులు వెలువరించింది. విద్యాసంస్థలలో హిజాబ్‌లపై నిషేధాన్ని సవాలు చేస్తూ ఉడుపికి చెందిన విద్యార్థుల బృందం కోర్టుకు వెళ్లింది. హిజాబ్ ధారణపై ఎక్కడా ఎటువంటి నిషేధాన్ని నిర్ధేశించే నిబంధన కానీ చట్టం కానీ లేవని, ఉన్నట్లుండి దీనిని ఎందుకు నిషేధించారని పిటిషనర్లు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ప్రసాదితం అయిన మతపరమైన స్వేచ్ఛకు అనుగుణంగానే హిజాబ్ ధారణ ఉందని, దీనిని ఎవరైనా ఎందుకు కాదంటారని నిలదీశారు.

విద్యాసంస్థల పాలకమండలికి పౌరుల ప్రాధమిక మతపరమైన హక్కును కాదనే నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని, భద్రత ఉల్లంఘనల పరిధిలోకి వస్తుందనే కారణంతో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఈ కేసుకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం తన వాదన విన్పించింది. దేశంలో ఎక్కడ కూడా హిజాబ్ వాడకంపై ఆంక్షలు లేవని, అయితే విద్యాసంస్థలలో సమగ్రత, విద్యార్థుల వస్త్రధారణ, ప్రత్యేకించి క్రమశిక్షణల నేపథ్యంలో విద్యా సంస్థలు సముచిత ఆంక్షలు విధించేందుకు వీలుందని ప్రభుత్వం తెలిపింది. ఉడుపి ప్రాంతంలో ఓ స్కూల్‌లోకి హిజాబ్‌లతో వచ్చిన వారిని స్కూలు యాజమాన్యం అనుమతించలేదు. వీటిని తొలిగించాలని చెప్పినప్పటికీ విద్యార్థులు నిరాకరించారు. తరువాతి క్రమంలో ఇది వివాదాస్పదం అయింది. దీనిపై ఇప్పుడు న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందనేది కీలకంగా మారింది. ఇప్పుడు దాఖలైన పిటిషన్‌పై 11 రోజుల పాటు సుదీర్ఘ వాదోపవాదాలు ముగిశాయి. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేశారు. 15వ తేదీ మార్చి మంగళవారం తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది. హిజాబ్‌పై నిషేధం అంశం కర్నాటక, దేశంలోని కొన్ని ప్రాంతాలలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.

విద్యాసంస్థలకు సెలవు 144 సెక్షన్ అమలు

కర్నాటక హైకోర్టు తీర్పు దరిమిలా బెంగళూరులో 144వ సెక్షన్ విధించారు. మంగళూరులో స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తగు నిషేధాజ్ఞలతో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News