Monday, April 29, 2024

భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు పాలవుతాయి. తెలంగాణను ఆసాంతం అధ్యయనం చేయకుండానే, రాసిచ్చిన చిట్టీలను కాపీకొడుతూ వాగితే నవ్వుల పాలవుతారు తప్ప నలుగురి మెప్పు పొందలేరు. రామ బాణాన్ని వదిలేసిన బిజెపి శకుని పాచికలను నమ్ముకొని అన్ని రాష్ట్రాలలాగేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయజెండా ఎగరేస్తామని కలల కనడం వారి అవివేకానికి నిదర్శనం. రాజకీయ కుయుక్తులతో షిండే లాంటి శిఖండిలను రాష్ట్రంలో తయారు చేయడం భారతీయ జనతా పార్టీకి ఎన్నటికీ సాధ్యపడదు.

KCR speech on modi

ఆదివారం సాయంత్రం చిల్లులు పడ్డట్లుగా ఆకాశం జల్లులు కురిపిస్తుంటే, టెలివిజన్ తెరల మీద రాటుదేలిన నేత కెసిఆర్ విసురుతున్న పొలిటికల్ పంచ్‌లు విపక్షాలకు ముచ్చెమటలు పట్టించి ఉంటాయనడంలో సందేహమే ఉండనక్కర లేదు. దేశ రాజకీయ వ్యవస్థలో ప్రెస్‌ను తప్పించుకొని తిరిగే నాయకులను లేదా ప్రచారం యావతో నిత్యం మీడియాలోనే మునిగితేలే నేతలను చూస్తూ ఉంటాం. సహజంగా రాజకీయ నాయకుల పాత్రికేయ సమావేశాలు పరనిందల చుట్టూతా పరిభ్రమించి ముగుస్తాయి. దినపత్రికలలో, టివి వార్తలలో చోటును సంపాదించడం మినహా మరే లక్ష ్యం కానరాని ప్రెస్‌మీట్‌లు పాత్రికేయులకే కాదు ప్రజలకు కూడా “మెడకు పడ్డ పాము కరువకుండ ఉంటదా” అన్నట్లుగానే ఉంటాయి. కానీ దానికి పూర్తి భిన్నంగా వార్తను అందించడానికో, విమర్శను ప్రచారంలో పెట్టడానికో పరిమితం కాకుండా కెసిఆర్ ప్రెస్‌మీట్లు మాత్రం జాగృతిని రగిలిస్తుంటాయి. ఆద్యంతం జనాలను ఆలోచనల్లోకి నడిపించుకొని వెళతాయి.

అదే ధోరణిలో ఆదివారం పాత్రికేయుల సమావేశం ద్వారా కెసిఆర్ చాలా లోతైన, గాఢమైన, విస్తృతమైన సమాచారాన్ని, స్పష్టమైన లక్ష్యంతో ప్రజా సమూహం ముందు చర్చకు పెట్టారు. అయితే మొన్నటి కెసిఆర్ ప్రెస్‌మీట్ తెలంగాణ జనాలను మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రగతికాముకులైన బుద్ధిజీవులు అనేక మందిని కదిలించింది. దోపిడీ, దుఃఖం, అసమర్థత, అన్యాయాలతో నిండిన భారత ఫైల్స్‌ను బయటపెట్టి యావత్తు దేశాన్ని ఆలోచింపజేశారు. గడిచిన రెండు దశాబ్దాలుగా నా విద్యార్ధి, యువజన ఉద్యమాలు, రాజకీయ కార్యాచరణ రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పరిచయాలను సంపాదించిపెట్టింది. అలాగే జెఎన్‌యు తో మొదలుకొని దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థి నేతలు, అధ్యాపకులతో విస్తృతంగా సంబంధాలను నాకు ఏర్పరిచింది. దానికి తోడు భౌగోళికంగా నాస్వంత ప్రాంతానికి ఆనుకొని ఉండే కర్ణాటక రాష్ట్రంలో మిత్రులతో పాటు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు.

ఈ నా పరిచయస్థుల్లో అనేక మందికి కెసిఆర్ ప్రెస్‌మీట్ ప్రత్యక్ష ప్రసార లింక్‌ను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత ఫోన్ ద్వారా వారు వ్యక్తపరచిన స్పందన విన్న నాకు ఖచ్చితంగా కెసిఆర్ చెప్పినట్లు దుర్మార్గాలపై దేశమే స్పందిస్తుందనేది నిజమవుతుందనే విశ్వాసం పెరిగింది. తెలంగాణ ప్రగతి నమూనా ఇతర రాష్ట్రాల ప్రజల డిమాండ్‌గా మారకుండా ఉండేందుకు దేశాన్ని ఏలుతున్న పాలకులు పన్నుతున్న కుయుక్తులను సూటి గా కెసిఆర్ ఎండగట్టారు. దేశాన్ని లొంగదీసుకోవడానికి కుట్రాజకీయంతో దుర్నీతికి తెగబడుతున్న కమలం సర్కార్ ప్రమాదకర తీరును సమాజం ముందు కెసిఆర్ స్పటిక దృశ్యంలా పరిచారు. 70 వేల టిఎంసిల నీటి వనరుల లభ్యత అందుబాటులో ఉన్న భారతావనికి దప్పికతో ఉండాల్సిన ఖర్మ ఎందుకు వచ్చిందని నిలదీసిన కెసిఆర్, ఆలోచనాపరులందరినీ ఏకోన్ముఖ ఏజెండా దిశగా చూసేలా చేయగలిగారు. దేశం నుంచి మేధో వలసకు కాంగ్రెస్ కారణమైతే, సంపద తరలిపోవడానికి మోడీ విధానాలే కారణమని ఆధారాలతో సహా కెసిఆర్ బట్టబయలు చేయగలిగారు.

భారత దేశంలో బుద్ధిజీవుల మీద ఉక్కుపాదం మోపుతూ, వైరి పక్షాలపైకి దర్యాప్తు సంస్థలను వేటకుక్కలలాగ ఉసిగొల్పుతున్న బిజెపి పాలకుల అణచివేత వికృత రూపాన్ని అద్దంలో చూపినట్లు ప్రజలందరికీ తేటతెల్లం చేశారనడంలో సందేహమే లేదు. దేశాన్ని దోచుకున్న ఆర్థిక నేరగాళ్ళకు ఎర్రతివాచీలు పరుస్తున్న మోడీ సర్కార్, రాజకీయ విరోధుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని పొట్టనబెట్టుకుంటున్న దుర్మార్గాన్ని కెసిఆర్ బట్టబయలు చేసిన తీరు బుద్ధి జీవులందరినీ కదిలించింది. శిఖండి షిండేల రూపంలో ప్రజాస్వామ్య హంతకులను తయారు చేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటిస్తున్న సిగ్గుమాలినతనాన్ని కెసిఆర్ నిలబెట్టి కడిగే శారు. దివాలాకోరు విధానాలతో దుఃఖిస్తున్న దేశానికి మతం ముసుగేసి దాచేసే కుట్రలకు పాల్పడుతున్న కమలం వికృత క్రీడలను ఆదివారం నాటి ప్రెస్‌మీట్‌లో కెసిఆర్ నగ్నంగా నిలబెట్టారు.

వ్యవసాయ, విద్యుత్, రక్షణ రంగాలతో పాటు అన్ని కీలకమైన రంగాలలో భారతదేశాన్ని దారి తప్పించి, అగాధ లోయలోకి తోసేస్తున్న అర్థంలేని, అన్యాయమైన, అసమర్ధ పాలకుల దిక్కుమాలిన విధానాలను నిప్పుతో కడిగినట్లు కడిగిపారేశారు కెసిఆర్. దేశ జనాన్ని కాంగ్రెస్ పెనం మీద పడేస్తే, బిజెపి గద్దెనెక్కి పొయ్యిలోకి విసిరేసిన పాపాన్ని ఎలాంటి శషబిషలు లేకుండా ఆవిష్కరించిన విధానం ఆలోచనపరులందరినీ ఆకట్టుకుంంది. ప్రజలు కోరుకుంటున్న దేశ ప్రగతికి దారి చూపెట్టాడు కెసిఆర్.
విద్వేష గురువు విషకౌగిలి నుంచి భారతదేశానికి విముక్తి కలిగించి, వెన్నెలలాంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి యువతరం బాధ్యత తీసుకోవాల్సిన చారిత్రక సందర్భం వచ్చిందని నవశక్తికి నిన్న కెసిఆర్ ఇచ్చిన సందేశం సూటిగానే చేరింది. దేశానికి పాత్రికేయుల సమావేశం చివరికి దారిదీపంలా మారింది. చీకటిలో చిక్కుకున్న భారత దేశానికి వెలుగు పూల తొవ్వను వాగ్దానం చేసినట్లుగ కొనసాగింది. దేశంలోపడ్డ దొంగలను తరిమేందుకు ఖచ్చితంగా యువతరం సిద్ధపడుతుంది. కెసిఆర్ ఒక్క ప్రెస్‌మీట్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి కావాల్సిన విజన్‌ను అందించగలిగారు.

కెసిఆర్ ప్రెస్‌మీట్ సందర్భంగా ఆయన మాటల్లోని తడిని, కళ్ళల్లో తొణికిసలాడిన ఆర్తిని, గొంతులో ప్రతిధ్వనించిన ఆవేదనను సమాజం ఆలింగనం చేసుకున్నది. క్యూబాకు విముక్తి కల్పించిన చెగువేర, లాటిన్ అమెరికన్ దేశాల స్వేచ్ఛకు బయలుదేరినట్లుగా, కెసిఆర్ మన దేశం కోసం అడుగులు వేస్తున్నారు. కోట్లాది పాదాలు ఆ అడుగుల వెంట నడిచి తీరుతాయి.
అయితే కెసిఆర్ ప్రెస్‌మీట్‌కు ప్రతిపక్షాల స్పందన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మళ్ళీ, మళ్ళీ కెసిఆర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారో అందరికీ స్పష్టం గా అర్థమై ఉంటుంది. బండి సంజయ్ దగ్గర నుంచి మొదలుకొని విపక్షాల నాయకులందరూ బడి దొంగలు అనుసరించే ‘బట్టి విద్యనే’ వల్లించారు. ‘పాడిందే పాడరా పాసుపళ్ళ సోదరా’ అన్నట్లు ఎప్పటిలాగే తిట్లను అప్పజెప్పారు. దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఉన్న వ్యక్తిగత అలవాట్ల గురించి వైరి పక్షాలు ఏనాడైనా గతంలో నోరు పారేసుకున్నాయా..? అంతెందుకు పక్క రాష్ట్రంలోని యెడ్యూరప్ప వ్యక్తిగత జీవితంలోని విచిత్రాలు కమలానికి వన్నెతెచ్చిపెట్టాయా..?

దిగజారుడు భాషతో, అర్థం లేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్య దూరమైన ప్రసంగాలు అభాసుపాలవుతాయి. తెలంగాణను ఆసాంతం అధ్యయనం చేయకుండానే, రాసిచ్చిన చిట్టీలను కాపీకొడుతూ వాగితే నవ్వుల పాలవుతారు తప్ప నలుగురి మెప్పు పొందలేరు.

రామ బాణాన్ని వదిలేసిన బిజెపి శకుని పాచికలను నమ్ముకొని అన్ని రాష్ట్రాలలాగేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయజెండా ఎగరేస్తామని కలల కనడం వారి అవివేకానికి నిదర్శనం. రాజకీయ కుయుక్తులతో షిండే లాంటి శిఖండిలను రాష్ట్రంలో తయారు చేయడం భారతీయ జనతా పార్టీకి ఎన్నటికీ సాధ్యపడదు. అప్రజాస్వామిక వ్యవహార శైలితో తెలంగాణ సమాజం ముందు ప్రతిరోజు కాషాయ పార్టీ రాజకీయ వికారత్వాన్ని ప్రదర్శిస్తున్నది. అయినా తెలంగాణను గట్టెక్కించిన కెసిఆర్ ఇప్పుడు ఎత్తిపట్టింది దేశ ఎజెండాను దశాబ్దాలుగా భారత దేశంలో తిష్ఠ వేసుకొని కూర్చున్న దరిద్రాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు యుద్ధ శంఖారావం పూరించారు.

ధర్మానికి, అధర్మానికి మధ్య రాజుకున్న పోరులో దేశం నలుమూలల నుంచి జనం నినాదమై కదలిరావడం చూడబోతున్నాం. చీకటి తొలగి సూర్యుడికి దారిచ్చినట్లు గా, రాజకీయ బేతాళులు కృశించి, కెసిఆర్ దేశం గెలుపై నిలవడం చారిత్రక సత్యం. ఆ గెలుపు సమరంలో పాలుపంచుకునేందుకు యువతరమే ముందుంటుంది. యువతరమా… కళ్ళు నీవే… కాళ్ళు నీవే… దొంగల తరిమేటందుకు దండుగా కదిలిరా… ఈ దేశం మనది… మనందరిది.

డా. ఆంజనేయ గౌడ్ (రాష్ట్ర మాజీ
బిసి కమిషన్ సభ్యులు)
9885352242

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News