Monday, April 29, 2024

ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న కుటిలనీతి. ఈ విధానం మంచిది కాదని కెసిఆర్ హెచ్చరించడం తప్పా? ఇప్పటి వరకు అనేక మంది పారిశ్రామికవేత్తల మీద సిబిఐ, ఇడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, కొన్ని రోజుల విచారణ తరువాత వారు బిజెపిలో చేరగానే కేసులన్నీ మాయం చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. సుజనా చౌదరి, సిఎం రమేష్, ముకుల్ రాయ్, సువెందు అధికారి, హేమంత్ బిస్వా, నారాయణ్ రాణే లాంటి ఎంతోమంది నేతలు కేసులను ఎదుర్కొని, తీరా కాషాయ కండువా కప్పుకోగానే పరిశుద్ధులు కావడం ఈ దేశం కళ్లారా చూసింది.

CM KCR Slams BJP Party and PM Modi

మొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన మీడియా సమావేశం చల్లని తెలంగాణ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ప్రత్యర్థులను విమర్శించడం, విరుచుకుని పడటం కెసిఆర్‌కు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు విన్నాము కన్నాము. కానీ తాజా ప్రెస్ మీట్ మాత్రం వాటన్నింటికీ పరాకాష్ట అని చెప్పుకోవాలి. కెసిఆర్‌లో కనిపించే ఒక విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఇంతకన్నా గొప్పగా మళ్ళీ కెసిఆరే మాట్లాడలేడు అని మనం అనుకున్నప్పుడల్లా తన తదుపరి పత్రికా సమావేశంలో మన అభిప్రాయం తప్పు అని నిరూపిస్తారు ఆయన.

మొన్నటి ప్రెస్ మీట్‌లో కెసిఆర్ వ్యక్తిగత విమర్శలు చేశారు అని కొందరు విమర్శిస్తున్నారు. కానీ లోతుగా చూస్తే ఆయన చేసినవి నిర్మాణాత్మకమైన విమర్శలే. మోడీ మీద తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకతా లేదని ఆయన పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. మొన్న కెసిఆర్ లేవనెత్తిన అంశాలన్నీ విధానపరమైనవే. కాంగ్రెస్ ప్రభుత్వకాలంలో బ్రెయిన్ డ్రైన్, బిజెపి హయాంలో కాపిటల్ డ్రెయిన్ అంటూ కెసిఆర్ వేసిన ప్రశ్నలో అబద్ధం ఏముంది? కాంగ్రెస్ పాలనలో మేధావుల వలసలు ఎక్కువగా ఉండేవి. స్వదేశంలో తమ అర్హతకు తగిన అవకాశాలు రావడం లేదని భావించిన మేధావులు ఎందరో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్లి ఉన్నతావకాశాలను చేజిక్కించుకున్నారు.

శాస్త్రవేత్తలు, వైద్యు లు విదేశాల్లో తమ ప్రతిభకు తగిన పట్టాభిషేకం జరుగుతుందని భావించి వెళ్లేవారు. నేడు బిజెపి పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ శక్తుల వశం అవుతున్నాయి. ప్రయివేట్ రంగంలోని జనరల్ మోటార్స్, ఫియట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాయి. వాటినే కెసిఆర్ ప్రస్తావించారు. ఎల్లైసి, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను అమ్మేయడం, పోర్టులు, ఎయిర్ పోర్టులను అమ్మేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు కర్మాగారం కూడా త్వరలో కార్పొరేట్ పరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలనే కెసిఆర్ ఎత్తి చూపారు.
ఇక రాజకీయాలను కూడా బిజెపి భ్రష్టుపట్టిస్తున్నదని అనేక సార్లు రుజువైంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడం, గోవా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఒక ఎత్తైతే, తమిళనాడులో కూడా ఒక ఏకనాథ్ షిండేను తయారు చేస్తామని, తెలంగాణలో కట్టప్పలు ఉన్నారని బిజెపి నాయకులు ప్రకటించడాన్ని కెసిఆర్ తప్పు పట్టారు.

రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం, కూల్చేయడం ప్రజాస్వామ్యమా? మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. రఘురామ రాజన్, అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తలు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పు పడుతున్నారు. రిజర్వ్ బ్యాంకు అనేది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా తయారైంది. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ప్రతిష్టించారు. పోనీ నీతి ఆయోగ్ సూచనలు, సలహాలు కేంద్రం స్వీకరిస్తున్నదా అంటే అదీ లేదు. ఇక ఇటీవల నూపుర్ శర్మ మత విద్వేష వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చేసిన కొన్ని పరుషమైన వ్యాఖ్యలను తప్పుపడుతూ కొందరు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఎఎస్ అధికారులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుపడుతూ మాజీలు లేఖ రాయడం ఏమిటి? వారు అలాంటి లేఖను రాయ డం వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏమిటి అనే విషయం దేశానికి తెలియాల్సి ఉంది.

తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న కుటిలనీతి. ఈ విధానం మంచిది కాదని కెసిఆర్ హెచ్చరించడం తప్పా? ఇప్పటి వరకు అనేక మంది పారిశ్రామికవేత్తల మీద సిబిఐ, ఇడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, కొన్ని రోజుల విచారణ తరువాత వారు బిజెపిలో చేరగానే కేసులన్నీ మాయం చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. సుజనా చౌదరి, సిఎం రమేష్, ముకుల్ రాయ్, సువెందు అధికారి, హేమంత్ బిస్వా, నారాయణ్ రాణే లాంటి ఎంతోమంది నేతలు కేసులను ఎదుర్కొని, తీరా కాషాయ కండువా కప్పుకోగానే పరిశుద్ధులు కావడం ఈదేశం కళ్లారా చూసింది. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైనవేనా అనే విషయం ఆలోచించాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేకిన్ ఇండియా అనే నినాదం ఇచ్చారు. మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు, ఇయర్ ఫోన్లు కూడా చైనావే వినియోగిస్తున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మనం పూజించే గణపతి విగ్రహాలు, గాలిపటాలు ఎగుర వేసే దారాలు, పార్టీల జెండాలు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు మేకిన్ ఇండియాకు అర్థమేమిటి అని కెసిఆర్ ప్రశ్నించడంలో ఆశ్చర్యం ఏముంది?
మొత్తానికి చాలా రోజుల తరువాత కెసిఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ చాలా వాడిగావేడిగా సాగింది అని చెప్పాలి.

సంజయ్ కుమార్ పాదయాత్ర వందరోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం అని ప్రకటించారు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు… ఎన్నికల తేదీ చెప్పండి.. అసెంబ్లీని రద్దు చేస్తా… ఇద్దరం ఎన్నికలకు వెళదాం అంటూ కెసిఆర్ ప్రతి సవాల్ విసిరారు. అసలు అమిత్ షా అలాంటి సవాల్ విసరడమే ప్రజాస్వామ్య వ్యతిరేకం. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అంతే తప్ప నాయకుల ఇష్టానిష్టాలను బట్టి కాదు. కేంద్రంలో బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంటూ ఒక రాష్ట్రాన్ని ఎన్నికలు పెట్టాలని సవాల్ విసరడం ఏ విధమైన సంప్రదాయం?

ఇక కెసిఆర్ విసిరిన తూటాలు బిజెపికి బాగానే గుచ్చుకున్నాయి. కెసిఆర్ ప్రెస్ మీట్ ముగిసిన అరగంటలోనే బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దూకారు. కెసిఆర్‌వి చిల్లర రాజకీయాలంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు… ఏమిటి చిల్లర రాజకీయాలు? కెసిఆర్ అడిగిన వాటిలో చిల్లర మాటలు ఏమున్నాయి?వాటిలో అబద్ధాలు ఉంటె అంశాల వారీగా ఖండించవచ్చు., చిల్లర మాటలని కొట్టివేయడంతోనే కిషన్ రెడ్డి దగ్గర తగిన జవాబు లేదని అర్ధం అయింది.

మురళీమోహన్ రావు
8143318849

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News