Sunday, April 28, 2024

పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా…

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. పివికి భారతరత్న ప్రకటించాలని బిఆర్‌ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పివి నరసింహారావుకు అత్యు న్నత జాతీయ పురస్కారం భారత రత్న ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. పివికి భారత రత్న పురస్కారం ఇవ్వాలనే ప్రధాని నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిఎం హోదాలో అనేకసార్లు పివికి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా పివి శతజయంతి ఉత్సవాలను నిర్వహించి, భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పివి నరసింహరావుకు భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయం. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పివి అని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీశ్‌రావు కొనియాడారు. స్వరాష్ట్రంలో పివికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చింది. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించింది. ఏడాది పాటుగా పివి శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందన్నారు. పివికి భారత రత్న ఇవ్వాలని మొదటిసారిగా డిమాండ్ చేసింది బి ఆర్ ఎస్ పార్టీనేనన్నారు. అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పివిని ‘ తెలంగాణ ముద్దు బిడ్డ‘ అని కొనియాడారన్నారు. తమ డిమాండ్ ను గౌరవించి భారత రత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వ కారణమని మాజి మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ పివి నర్సింహ రావుకు భారత రత్న ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్ని కోరారనీ, పి.వికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారనీ మాజీ మంత్రి, బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఠీవి మన పివి అని కెసిఆర్ సగర్వంగా అన్ని వేదికల మీద చెప్పారనీ, పివి కూతురు వాణి దేవికి ఎంఎల్‌సిగా అవకాశం కల్పించి, వారి కుటుంబానికి సమున్నత గౌరవాన్ని ఇచ్చారన్నారు. పివి గౌరవార్థం ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం, జయంతి ఉత్సవాలు, నెక్లెస్ రోడ్ ను పి.వి మార్గ్ గా మార్పు, అసెంబ్లీ లాబీ హాల్ లో ఆయన చిత్రపటాన్ని పెట్టారని గుర్తు చేశారు. పివికి భారతరత్న కోసం కృషి చేసిన కెసిఆర్‌కు, భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ఎంఎల్‌ఎ వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మండలి చైర్మన్ హర్షం…
భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్టంలో జన్మించిన పివి దేశ అత్యున్నత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని,ఆయనకి భారతరత్న ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

పివి నర్సింహారావుకు భారత రత్న ఇవ్వడం పట్ల బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల హర్షం
కేంద్రం పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి ఆవరణలో పివి కుమార్తె ఎంఎల్‌సి వాణి దేవిని కల్వకుంట్ల కవిత, సత్యవతి, రమణ , మాజీ మంత్రి మహముద్ అలీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ మట్టిబిడ్డకు దక్కిన అరుదైన గౌరవమని ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత అన్నారు. పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కటం అంటే తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో బిఆర్‌ఎస్ చేసిన డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆమె వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News