Saturday, April 27, 2024

కృష్ణా రివర్ బోర్డు సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

కృష్ణారివర్ బోర్డు త్రిసభ్య కమిటి సమావేశం వాయిదా
తదుపరి తేదిని తర్వలో తెలియపరుస్తాం: బోర్డు చైర్మన్ ఎంపి సింగ్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలవివాదాలను చర్చించేందుకు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటి సమావేశాన్ని కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు వాయిదా వేసింది. బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.పి సింగ్ కార్యాలయ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించిన 24గంటల్లోనే నిర్ణయం తీసుకొని త్రిసభ్యకమిటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జూన్ ఒకటి నుంచి వాటర్ ఇయర్ ప్రారంభం కావటంలో కృష్ణానది జలాల్లో ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగాల్సివుంది.

ఈ నేపధ్యంలోనే తెలంగాణ, అంధప్రదేశ్ నీటిపారుల శాఖలకు చెందిన ఇద్దరు ఈఎన్సిలు సభ్యులుగా, బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన బోర్డు త్రిసభ్యకమిటి సమావేశాన్ని నిర్వహించి తొలుత నీటిపంపిణీపై చర్చించాలని నిర్ణయించింది. అయితే ఆంధప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పట్ల అభ్యంతరాలు రావటం, వెంటనే పనులు నిలిపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డుకు ఫిర్యాదులు చేయటం, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు లేకుండా పాలమూరురంగారెడ్డి పథకం నిర్మిస్తోందని, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ప్రారంభించిన జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో బోర్డు త్రిసభ్య కమిటి సమావేశం కీలకంగా మారింది. రాష్ట్రంలో పంటల సాగు సీజన్ ప్రారంభమైందని, నీటి పారుదల పనుల వత్తిడితో అధికారులు బిజిగా ఉన్నందువల్ల 9న జరగాల్సిన బోర్డు త్రిసభ్య కమిటి సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది.

అంతే కాకుండా కృష్ణనదిలో గత వాటర్ ఇయర్‌కు సంబంధించి తెలంగాణకు కేటాయించిన వాటా నీటిలో కొంత నీటిని మిగిల్చామని, ఈ నీటిని ఈ వాటర్ ఇయర్‌కు జత కలపాలని కోరింది.తాగునీటికి కేటాయించిన వాటాలో 20శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కోరింది. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి వున్నందున బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని ఈ నెల 20 తర్వాత నిర్వహించాలని లేఖలో బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌తోపాటు, ఈఎన్‌సి మురళీధర్ వేర్వేరుగా లేఖలు రాశారు. బుధవారం బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎంపి సింగ్ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను పరిశీలించిన మీదట త్రిసభ్య కమిటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.తదుపరి సమావేశపు తేదిని త్వరలోనే నిర్ణయించి తెలియ పరుస్తామని తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖలకు బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్ గురువారం లేఖలు రాశారు.

Krishna River Board Meeting postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News