Thursday, May 9, 2024

పరిశుభ్ర పట్టణాలు

- Advertisement -
- Advertisement -

 

ఇంటి నుంచే మార్పు తెద్దాం, వ్యక్తి శుభ్రతతో పాటు పరిసరాల పారిశుద్ధానికీ ప్రాధాన్యమిద్దాం

ఇంటి నుంచి గల్లీ వరకు పరిశుభ్రంగా ఉంచితే అంటు రోగాలు ప్రబలవు
ఖాళీ స్థలాల్లో చెత్తను ఏరివేయకపోతే జరిమానాలు తప్పవు
వార్డుల వారీగా పచ్చదనం, పారిశుద్ధం, జల ప్రణాళికలు తయారు చేసుకోవాలి
విధులను విస్మరిస్తే అధికారులు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవు
10 రోజుల పట్టణప్రగతితో ఆశించిన మార్పులు రావు, పారిశుద్ధంపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలి
ఖమ్మం, ఇల్లందు పట్టణప్రగతిలో కెటిఆర్

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన సమాజాన్ని అందించేందుకు మార్పు అనేది ఇంటి నుంచి మొదలు కావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఇంటి నుంచి గల్లీ వరకు పరిశుభ్రం గా ఉంటే అంటురోగాలు ప్రబలవని ఆయన పేర్కొన్నా రు. ఆదివారం ఖమ్మం నగరం ఇల్లెందు పట్టణంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖమ్మం నగరంలో రూ.28.75 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని డివిజన్ కమిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. పురపాలన అంటేనే ప్రజల భాగస్వామ్యంతో చేసేదని, అయితే పట్టణాల అభివృధ్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు. కొత్త మున్సిపల్ చట్ట ం ప్రకారం ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలను భాగస్వాములను చేసేందుకే ఈ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. దే శంలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో చెత్త ఎంత వెతికినా కన్పించదని ఆయన చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల పట్టణంలో పందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో, కాలువల్లో, నాలాల్లో చెత్తను వేయడం వల్ల రోగాలు ప్రబలుతాయని ఆయన చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ఇప్పటికీ పలు పట్టణాల్లో బహింగర మల మూత్ర విసర్జన చేస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణ ప్రగతి జరిగే పది రోజుల్లో అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని, నిరంతరం ప్రజల్లో మార్పు రావాలన్నారు. పారిశుధంపై ప్రజల్లో అవగాహన కలిపించాలని ఆయన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచే తడి,పొడి చెత్త వేరు చేసి వాటిని మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని, కానీ అది పూర్తి స్థ్దాయిలో అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో 90శాతం తడి,పొడి చేత్తను వేరుచేస్తున్నామని నగర కమిషనర్ చెబుతున్న విషయాన్ని తాను నమ్మడం లేదని, 20శాతం ప్రజలే వేరు చేస్తున్నారని, మిగిలిన వారంతా విధిగా తడి, పొడి చెత్తను వేరు చేయాలని కెటిఆర్ కోరారు.

అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ప్రజల నుంచి సేకరించిన తడి,పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. తడి పొడి చెత్తతో మున్సిపాలిటీలు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకావం ఉందని, సిరిసిల్ల మున్సిపాలిటీలో పట్టణ డ్వాక్రా గ్రూపు సంఘాలు నెలకు రూ.రెండున్నర లక్షల ఆదాయాన్ని సమకుర్చుకుంటున్నాయని ఆయన అన్నారు. పూర్తి స్థ్దాయిలో తడి, పొడి చెత్తను సేకరించేందుకు గ్రీన్,బ్లూ రంగు గల రెండు బుట్టలను అందించాలని అధికారులను అదేశించారు. పారిశుధ్యం మెరుగుకు కోసం జనభా అనుగుణంగా సిబ్బందిని, తగిన వాహనాలను అన్ని మున్సిపాలిటీలకు కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి పట్టణంలో వార్డు, డివిజన్ శానిటేషన్ ప్రణాళిక,హరిత ప్రణాళిక,వాటర్ ప్రణాళికను విధిగా తయారు చేసుకోవాలని ఆయన చెప్పారు.ఈ నెల4లోగా పట్టణ ప్రణాళికలను తయారు చేసుకొని, ఈనెల6న జరిగే సమావేశానికి హాజర్ కావాలని అధికారులను,కౌన్సిలర్లను కోరారు. మంత్రులు వారి శాఖల పరంగా బిజీగా ఉంటున్నందున మంత్రిపై ఆధారపడకుండా ప్రతి కార్పొరేటర్లు,కౌన్సిలర్లే చిత్తశుద్ధితో పనిచేయాలని, ఒక్కొక్క కార్పొరేటర్ ఒక్కో కెసిఆర్ కావాలని మంత్రి కోరారు.ఖమ్మంలో ప్రస్తుతం 12 మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయని, వచ్చే జూన్ 1నాటికల్లా 400 పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మించాలని, ఇందులో 200 టాయిలెట్స్ ప్రత్యేకంగా మహిళల కోసమే నిర్మించాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని, అవసరం అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్ధలాలను సైతం సేకరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు అత్యవసరమైనది పబ్లిక్ టాయిలెట్స్ అని ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ చొప్పున నిర్మిస్తే బహిరంగ మల,మూత్ర విసర్జన అనేది ఉండదన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. .ప్రతి వార్డులో నర్సరీని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలకు అవసరమై మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రతి వార్డులో మొక్కల పంపిణీ యూనిట్‌ను వచ్చే వర్షకాలం నాటికి ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి వార్డులో 85శాతంకు పైగా నాటిన మొక్కలు సజీవంగా ఉండకపోతే సంబంధిత వార్డు కౌన్సిలర్ పదవి ఉడుతుందని ఆయన హెచ్చరించారు. నాటిన మొక్కలన్ని నూటికి నూరు శాతం సజీవంగా ఉండాలన్నారు. పది గజాల స్థలంలో కూడా నాలుగు మొక్కలను నాటుకోవచ్చని కెటిఆర్ చెప్పారు. అవినీతిని నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఇంటి అనుమతుల విధానాన్ని అమల్లోకి తెచ్చామని, 75 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 75 గజాల నుంచి 600 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే ఇంటి వద్దే ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో ఇంటి వద్దకే అనుమతి పత్రం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్ విధానాన్ని అమలులో తీసుకొస్తున్నామని ఎలాంటి ఫైరవీలు,లంచాలు లేకుండానే ఉచితంగా ఇంటి వద్దకే ఇంటి నిర్మాణ అనుమతుల వస్తాయన్నారు. ముందు చెప్పిన స్థలం కంటే అధిక స్ధలంలో ఇంటి నిర్మాణం చేస్తే ఎలాంటి నోటీస్‌లను జారీ చేయకుండానే ఇంటిని కూల్చివేసే విధంగా కొత్త మున్సిపల్ చట్టంలో నిబంధనలు చేర్చామని మంత్రి వివరించారు. ఆస్తి పన్ను మదింపు విషయంలో ప్రజలకే స్వేచ్ఛ ఇచ్చామని, నిబంధనలకు విరుద్ధంగా పన్ను చెల్లిస్తే మాత్రం 25 రెట్లు అదనంగా జరిమానా విధిస్తామని మంత్రి హెచ్చరించారు.
పందులను పెంచుకొని ఉపాధి పొందే ఎరుకల కులస్ధులకు ప్రత్యామ్నాయంగా వేరే ఉపాధి చూపించి పందులు పట్టణాల్లో తిరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలం యజమానులకు ముందుగా నోటీస్‌లను జారీ చేసి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరాలని, అప్పటికీ స్పందించకపోతే మున్సిపాలిటీ వారే క్లీన్ చేయించి, అందుకు అయిన ఖర్చు మొత్తాన్ని సంబంధిత ఖాళీ స్థలం యాజమాని నుంచి వసూలు చేయాలని, అప్పటికి స్పందించకపోతే ఈ స్థలం మున్సిపాలిటీది అనే బోర్డును పాతాలన్నారు.
ఖమ్మం నగరంలో ఏటా బడ్జెట్ రూ75కోట్లు అని, అందులో పదిశాతం అంటే రూ.7.5కోట్ల నిధులను కేవలం పచ్చదనం కోసమే వెచ్చించాలని మంత్రి పేర్కొన్నారు. పట్టణాల్లో ప్లాస్టిక్ భూతాన్ని తరమి కొట్టేందుకుగాను ప్రతి ఇంటికి ఉచితంగా జ్యూట్ బ్యాగ్‌ను అందించాలని, స్టీల్ బాక్స్‌ల వాడకాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

KTR Speach at Pattana Pragathi in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News