Monday, April 29, 2024

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే విడిచి పెట్టేదే లేదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: గత ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విడిచే పెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వేద కన్వెన్షన్ హాల్‌లో బిఆర్‌ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తోందని తప్పుదారి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి మోసపోయామని జనం చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను నమ్మి మోసపోయారని వివరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఫాక్స్ కాన్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు తీసుకొచ్చారన్నారు.

పాలమూరు ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్‌ను నింపి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని ఇవ్వాలని అనుకున్నామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందేమోనని అనుమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ప్రజలు మంచి నాయకుడిని విస్మరించారన్న బాధ తనలో ఉందన్నారు. కాంగ్రెస్ తంతే పూల బుట్టలో పడ్డట్టు అధికారంలోకి వస్తారని ఆ పార్టీ నేతలే నమ్మలేదన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికీ అన్నీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి జనం సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో18 ఏళ్లు నిండిన కోటి 67 లక్షల మంది మహిళలు ఉన్నారని అందరికి రూ. 2500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 17వ తేదీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోతే బొంద పెడతామని హెచ్చరించారు.

మార్పు అని ఓటేస్తే రేవంత్ ప్రభుత్వం తమ కడుపు కొట్టిందని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి 37 లక్షల 50 వేల కరెంట్ మీటర్లు ఉన్నాయని వాళ్లలో కొంతమందికి మాత్రమే గృహజ్యోతి ఇస్తామని చెబుతున్నారని అన్నారు. ఇదే విషయం ఎన్నికల ముందు చెబితే కాంగ్రెస్ నేతలను తన్ని పంపేవారని మందలించారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగరాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, వంగేటి లక్ష్మా రెడ్డి, సత్తు వెంకటరమణరెడ్డి, దండెం రాంరెడ్డి, కందాడ లక్ష్మా రెడ్డి, సామ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News