Thursday, May 16, 2024

మాఫీ మస్త్

- Advertisement -
- Advertisement -

Loan waiver

 

40.38లక్షల మంది రైతులకు వర్తించనున్న రుణమాఫీ

కిమ్మత్తు రూ. 25,936 కోట్లుగా ప్రాథమిక నిర్ధారణ
కేటగిరీలవారీగా ప్రభుత్వానికి నివేదించిన ఎస్‌ఎల్‌బిసి, వ్యవసాయ శాఖ
మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్య మాఫీ మొత్తం కొంత మేరకు తగ్గే అవకాశం
రూ.25 వేల లోపు రుణాల మాఫీ కోసం ఈ నెలలోనే రూ. 1198 కోట్ల విడుదలకు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 40.38 లక్షల మంది రైతులు అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి), వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించాయి. రూ.25 వేల లోపు ఉన్న పంట రుణాలన్నింటిని ఏకకాలంలోనే మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1198 కోట్లు ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. నేరుగా రైతు ఖాతాల్లోకి కాకుండా సంబంధింత ఎంఎల్‌ఎల చేతుల మీదుగా చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని సిఎం నిర్ణయించారు. తక్కువ మొత్తంలో పంట రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రూ.24,798 కోట్లు విడతల వారీగా మాఫీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ అమలు మార్గదర్శకాల్లో ఇచ్చే నిబంధనల ఆధారంగా రైతుల సంఖ్యతో పాటు, మాఫీ మొత్తం కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.

కేటాగిరీల వారీగా రుణమాఫికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపింది. ఇందులో రూ.25 వేల వరకు ఉన్న రుణాలు, ఆ తరువాత రూ.25 వేల రూ.50 వేల వరకు, రూ.50 వేల నుంచి రూ.75 వేలు, రూ.75 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారని విభజించారు. రూ. ఒక లక్ష పైన రుణం ఉన్నప్పటికీ, లక్ష రూపాయల వరకు వారికి మాఫీ చేయనున్నారు. డిసెంబర్ 11వ తేదీ 2018 వరకు ఉన్న లక్ష రూపాయాల పంట రుణాలను మాఫీ చేయనున్నారు. రూ.25 వేలు ఒకేసారి మాఫీ చేశాక, రూ.50 వేల వరకు ఉన్న రుణాలను కూడా ఏకకాలంలో మాఫీ చేస్తే రూ.3104 కోట్లు అవసరం అవుతుంది. ఈసారి బడ్జెట్‌లో రూ.6225 కోట్లు రుణమాఫీకి ప్రతిపాదించినందున రూ.50 వేల వరకు ఉన్న రుణాలను కూడా ఒకేసారి చెక్కుల ద్వారా మాఫీ చేసే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రుణమాఫీ మాదిరి రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు ఒక అధికారి తెలిపారు.

ఇదీ లెక్క
ఎస్‌ఎల్‌బిసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.25 వేల వరకు పంట రుణాలు రూ.1198 కోట్లు 5.83 లక్షల మంది రైతులు తీసుకున్నారు. అలాగే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రూ.3104 కోట్లు 8.14 లక్షల మంది పంట రుణాలు పొందారు. అలాగే రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు రూ.5061 కోట్లు 8.81 లక్షల మంది రైతులు తీసుకున్నారు. రూ.75 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు 7.09 లక్షల మంది రైతులు రూ.5776 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. ఇక రూ. ఒక లక్షకు పైగా రుణం తీసుకున్నప్పటికీ వారికి రూ. ఒక లక్ష లోపు మాఫీ చేస్తే రూ.10,795 కోట్లు అవుతుంది.

ఇందులో 10.79 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తంగా 40.38 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా మారనున్నారు. 2014లో రుణమాఫీ చేసినపుడు అనుసరించిన విధానాలే 90 శాతం వరకు ఇప్పుడు అమలు చేయనున్నారు. నిబంధనలు ఈ రకంగా ఉండనున్నాయి. రైతులు తీసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా డిసెంబర్ 11, 2018 కటాఫ్ తేదీతో అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ వర్తింపజేస్తారు.
* కుటుంబం అంటే భార్య, భర్త వారి మీద ఆధారపడి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం రేషన్ కార్డు వివరాలను ఆధారం చేసుకుంటారు.
* ఎఇఒ, విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. స్వల్పకాలిక పంట రుణాలు 12 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది, ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

పంట రుణం                                  రైతులు(లక్షల్లో)                                     మొత్తం (రూపాయాల్లో)

రూ.25 వేల లోపు                          5,83,916                                         1197.66 కోట్లు
రూ.25 వేల నుంచి రూ.50 వేలు          8,14,261                                          3104.74 కోట్లు
రూ.50 వేల నుంచి రూ.75 వేలు           8,51,869                                         5061.89 కోట్లు
రూ.75 వేల నుంచి రూ.ఒక లక్ష           7,09,292                                          5776.52 కోట్లు
రూ.లక్ష పైన తీసుకున్నా ఒక లక్ష          10,79,522                                       10,795.22 కోట్ల
రూపాయాల వరకు మాఫీ చేస్తే

Loan waiver for small and marginal Farmers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News