Monday, April 29, 2024

తెలంగాణ ‘సోనా’కు అంతర్జాతీయ ఖ్యాతి

- Advertisement -
- Advertisement -

Telangana Sona

 

7 రాష్ట్రాల్లో ఈ విత్తనానికి భారీ డిమాండ్
జయశంకర్ వర్సిటీ తయారు చేసిన ఈ వరికి టైప్-2 షుగర్‌ను తగ్గించే శక్తి
అమెరికన్ జర్నల్‌లో తెలంగాణ సోనా ప్రత్యేకతపై డిసెంబర్‌లో కథనం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఎన్‌ఆర్ 15048 సాగు పెంచేందుకు ప్రణాళికలు
మొన్న అసెంబ్లీలోనూ ప్రస్తావించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలోని వరి విభాగం తయారు చేసిన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048) వరి వంగడం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. ఇప్పటికే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ విత్తనానికి భారీ డిమాండ్ ఉండగా, తాజాగా ప్రతిష్టాత్మక అమెరికన్ జర్నల్ తెలంగాణ సోనాపై కథనాన్ని ప్రచురించింది. మొన్న అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సోనాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో తెలంగాణ సోనా సాగును రాష్ట్రంలో విపరీతంగా పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుత రబీలో రికార్డు స్థాయిలో ఏకంగా 38 లక్షల ఎకరాల పైన వరి సాగవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఇంకా సాగు విస్తీర్ణం పెరుగుతుందని, ఖరీఫ్, రబీ కలిపి కోటి ఎకరాలు వరి సాగు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే వరిలో డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ వంగడం ప్రత్యేకత ఏమిటంటే తక్కువ కార్పొహైడ్రేట్స్ ఉండి టైప్ -2 షుగర్‌ను కూడా తగ్గించగలగడం. గ్లూకోజ్ శాతం కేవలం 51.6 మాత్రమే ఉండడం వల్ల ఈ తెలంగాణ సోనా వరి అన్నం తినే వారికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉండవు. ఇతర వరి వంగడాల్లో గ్లూకోజ్ శాతం 55 నుండి 62 శాతం వరకు ఉంటుంది. జొన్నలు, సజ్జలు వంటి చిరు ధాన్యాల్లో ఉండే స్థాయిలోనే ఈ వరి బియ్యంలో కార్బొ హైడ్రెట్స్ ఉండడం దీని ప్రత్యేకత. 2016లో విడుదలైన ఈ వరి వంగడాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ – తార్నాక విశ్లేషించి ధ్రువీకరించింది. పైగా సాంబా మసూరి వంటి వరి పంట పండించడానికి 155 నుండి 160 రోజుల సమయం పడితే ఈ తెలంగాణ సోనా వరి పండించడానికి 125 రోజుల సమయం సరిపోతుంది.

దిగుబడి కూడా ఇతర వంగడాల కంటే 5 నుండి 10 శాతం ఎక్కువ రావడం దీని ప్రత్యేకత. సాంబా మసూరి ఎకరానికి 22 కింటాల దిగుబడి వస్తే తెలంగాణ సోనా 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వానాకాలం , యాసంగి రెండు పంటలు పండించుకునే సౌకర్యం దీని మరో ప్రత్యేకత. తక్కువ రోజుల్లో పంట రావడం వల్ల నీటి అవసరం తక్కువ ఉండడంతో పాటు క్రాప్ క్రాప్ మధ్యలో జనుము , పిల్లి పెసర , పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల భూమి సారం పెరుగుతుంది. మిగతా ఎరువుల వినియోగం, ఖర్చు కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ వరి వంగడం సుమారు 7 రాష్ట్రాల రైతుల ఆదరణ పొందింది. తెలంగాణ సోనా లైసెన్స్ కోసం ఇతర రాష్ట్రాల వరి విత్తన వ్యాపారులు జయశంకర్ యూనివర్శిటీ వద్ద క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఖరీఫ్, రబీ కలిపి 225 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినా ఇబ్బంది లేదని సిఎం ఇప్పటికే చెప్పారు. ఇక జయశంకర్ వర్సిటీ 2014 నుండి ఆరేళ్ళ అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జాతీయ స్థాయిలో 27వ ర్యాంక్‌లో వర్సిటీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంక్‌లో ఉంది.

Telangana Sona Paddy is an international repute
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News