Sunday, April 28, 2024

ఆ విగ్రహం అసలైనది కాదు

- Advertisement -
- Advertisement -

ప్రాణ ప్రతిష్టకు ముందు నేత్రాలు బహిర్గతం చేయరాదు
అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడి స్పష్టీకరణ

అయోధ్య: ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి నేత్రాలను బహిర్గతం చేయకూడదని అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంత్ర దాస్ తెలిపారు. ఈనెల 22న శ్రీరామాలయంలో ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్నది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని గురువారం ఆలయంలో ప్రతిష్టించగా వస్త్రం కప్పిన విగ్రహానికి చెందిన ఫోటోలు అదే రోజు బయటకువచ్చాయి. కాగా నేత్రాలకు వస్త్రం విగ్రహం ఫోటోలు శుక్రవారం ఉదయం ఇంటర్‌నెట్‌లో దర్శనమివ్వగా సాయంత్రానికి బాలరాముడి నిజరూప విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

ఈ ఫోటోలపై ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ శనివారం స్పందిస్తూ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ముందు నేత్రాలను బహిర్గతం చేయకూడదని అన్నారు. స్వామివారి నేత్రాలు కనిపిస్తూ బయటకు వచ్చిన విగ్రహం ఫోటోలు అసలైన విగ్రహానివి కావని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నేత్రాలు దర్శనమిస్తే వాటిపైన వస్త్రాన్ని ఎవరు తొలగించారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టాలని, విగ్రహానికి చెందిన ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. యథావిధిగా అన్ని క్రతువులు జరుగుతాయని, అయితే ప్రాణ ప్రతిష్ట తరువాతే స్వామివారి నేత్రాలను బహిర్గతం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం టెంట్‌లో ఉన్న విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించడానికి సంబంధించిన సాంప్రదాయాలను గురించి కూడా ఆయన వివరించారు. గర్భగుడిలో కొత్త విగ్రహం ప్రతిష్టించిన ప్రదేశం సమీపంలోనే పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడం జరుగుతుందని, అందుకు కూడా శుభ ముహూర్తం ఉంటుందని ఆయన తెలిపారు. ఏదైనా కొత్త పని చేస్తే దానికి శుభ ముహూర్తం అవసరమని, ఇది సాంప్రదాయమని ఆయన చెప్పారు. అయితే ఆలయంలోకి పాత విగ్రహాన్ని ఎవరు తీసుకువెళతారన్నదే ప్రశ్నని ఆచార్య దాస్ అన్నారు.

గతంలో టెంట్ నుంచి తాత్కాలికంగా నిర్మించిన ఆలయానికి విగ్రహాన్ని ముఖ్యమంత్రి తీసుకువెళ్లారని, ఈసారి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత అదే ప్రదేశంలో శ్రీరాముడి చిన్న విగ్రహాన్ని కరసేవకులు ఒక టెంటులో ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. టెంటులో ప్రతిష్టించిన శ్రీరాముడి విగ్రహానికి కూడా చరిత్ర ఉంది. 1949లో బాబ్రీ మసీదులో కొందరు హిందూ నాయకులు ఈ విగ్రహాన్ని ఉంచారు. రాముడు మసీదులో స్వయంభువుగా వెలిశాడని వారు అప్పట్లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News