Monday, April 29, 2024

సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా మాధవి పూరీ బుచ్

- Advertisement -
- Advertisement -

మొదటిసారి ఈ కీలక పదవిలో మహిళ, టర్మ్ మూడేళ్లు
ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ

Madhabi Puri Buch appointed as Sebi chairperson
న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మొదటిసారి కొత్త చైర్‌పర్సన్‌గా మహిళను నియమించారు. మాధవి పూరీ బుచ్‌ను సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్‌గా నియమించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. బుచ్ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. దీనికి గాను కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆమె ఏప్రిల్ 2017 నుండి అక్టోబర్ 2021 వరకు సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన ఫైనాన్షియల్ మార్కెట్‌లో సెబీ ఒకటి, ఇంతటి కీలకమైన ఆర్థిక సంస్థకు తొలిసారిగా మహిళను హెడ్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగిసింది. ఆయన స్థానంలో బుచ్ నియమితులయ్యారు.
ఐసిఐసిఐ బ్యాంక్‌తో కెరీర్
మాధవి పూరీ బుచ్ 1989లో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసిఐసిఐ బ్యాంక్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె 2007 నుండి 2009 వరకు ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఫిబ్రవరి 2009 నుండి మే 2011 వరకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎండి, సిఇఒగా ఉన్నారు. 2011లో సింగపూర్‌కు వెళ్లి అక్కడ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్‌లో పని చేశారు. ఆమె సెబీలో విజిలెన్స్, ఆర్థిక, విధాన విశ్లేషణ, పెట్టుబడిదారుల సహాయం, విద్య, పెట్టుబడి నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వహించారు. సెబీలో పూర్తికాల సభ్యురాలుగా పనిచేసిన తర్వాత ఏడుగురు సభ్యుల నిపుణుల బృందానికి బుచ్ హెడ్‌గా వ్యవహరించారు. మాధవి పూరీ బుచ్ కఠినమైన స్వభావం కల్గినవారని చెబుతారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌లో ఎంబిఎ డిగ్రీ పొందగా, అంతకు ముందు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివారు. సెబీ కీలక పోస్ట్ కోసం అక్టోబర్ 2021లో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 6న ముగిసింది. మాధవికి ఆర్థిక రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది.

ముగిసిన అజయ్ త్యాగి పదవీకాలం

ప్రస్తుత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగిసింది. త్యాగి 1984 బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ఆయనను 2017 మార్చి 1న 3 సంవత్సరాల పాటు చైర్మన్‌గా నియమించగా, ఆ తర్వాత 6 నెలలు పదవీకాలం పొడిగించారు. దీని తర్వాత ఆయన పదవీకాలాన్ని ఆగస్టు 2020లో 18 నెలలకు పొడిగించారు. త్యాగి స్థానంలో ఇప్పుడు బుచ్ నియమితులయ్యారు. రెగ్యులేటర్ కొత్త చీఫ్ రేసులో మాజీ ఆర్థిక కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా ఉన్నారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అత్యున్నత పదవికి చేరుకున్న మొదటి మహిళా అధికారి మాధవి పూరీ కావడం విశేషం. ఆమె హోల్ టైమ్ డైరెక్టర్ అయిన మొదటి మహిళ, ప్రైవేట్ సెక్టార్ నుండి సెబీ చైర్‌పర్సన్ అయిన మొదటి అధికారి కూడా ఆమెనే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News