Saturday, April 27, 2024

సన్‌బర్న్‌కు అనుమతిలేదు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లో నిర్వహించనున్న సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మాదాపూర్ డిసిపి నంద్యాల నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్ డిసిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సన్‌బర్న్ నిర్వాహకులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ మాదాపూర్ పోలీసులు దానిని తిరస్కరించారని తెలిపారు. అయినా కూడా సన్‌బర్న్ నిర్వాహకులు బుక్‌మై షోలో టికెట్లు విక్రయించారని తెలిపారు. బుక్‌మై షో నిర్వాహకులపై ఛీటింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల కోసం తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సన్‌బర్న్ ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకులను, బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకొని గట్టిగా మందలించారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదు చేశారు.

డ్రగ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే: మాదాపూర్ అదనపు డీసీపీ

నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలనుకునే వారు పాటించాల్సిన నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశామని మాదాపూర్ ఎడిపి నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. అనుమతులు తీసుకోకుండా సన్ బర్న్ ఈవెంట్‌కు సుమంత్ అనే వ్యక్తి బుక్ మై షోలో టికెట్లు విక్రయిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేశామని, బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈవెంట్ నిర్వహణ అనుమతి కోసం దరఖాస్తు చేశారని, ఎక్సైజ్ సహా ఇతర అనుమతులు తీసుకోక పోవడంతో అనుమతి నిరాకరించామని తెలిపారు.

సన్ బర్న్ పేరును వాడుకొని నిర్వహిస్తున్నారు కానీ, ఇది ప్రధాన వేడుక కాదని, ఈవెంట్లు నిర్వహించే పబ్బులకు డ్రగ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యు నిర్వాహకులదని స్పష్టం చేశారు. ఈవెంట్‌కు వచ్చే వారి ఐడీ కార్డు సహా బ్యాగులు తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రదేశాలు ఉండాలని, సామర్థానికి మించి పాసులు జారీ చేయవద్దని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో వేడుకలు చేసుకునే వారు సౌండ్ సిస్టం అనుమతి కోసం స్థానిక ఎసిపి నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News