Monday, April 29, 2024

బాలీవుడ్‌ను మరిపిస్తున్న ‘మహా’భారతం

- Advertisement -
- Advertisement -

దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని దాటి 5G అని ఆస్వాదిస్తున్న వర్తమానంలో వ్యాపారస్తులకు కేంద్రంగా భావించే గుజరాత్ నుంచి ఎదిగిన ఇద్దరు రాజకీయ నాయకులు పాత పాచికలను నమ్ముకోకుండా ఏకంగా వలలనే విసురుతున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ళ సిద్ధాంతానికి బెదిరింపుల భూతాన్ని జత కలిపి భారత దేశంలోని రాజకీయ వ్యవస్థను గుప్పిట్లో బంధించడానికి అస్త్రాలన్నీ సంధిస్తున్నారు. మతం, డబ్బు, ధర్యాప్తు సంస్థలను వాడటంలో ఆరితేరిన ఈ ఇద్దరి నేర్పరితనం, ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసి, చరిత్రలో నియంతలుగా నిలిచిన వారినందరినీ మరుగుజ్జులుగా చేస్తున్నది. అధికార దాహం, నీతిమాలిన తనం, బరితెగింపునైజం కలగలిసిన వ్యక్తిత్వాలు దేశం నలుమూలలా రాజకీయ కుంపట్లు రాజేస్తున్నాయి. “ఎడ్లెన్ని చచ్చినవి అనేది కాదు వడ్లెన్ని పండినవనేదే ముఖ్యం” అనే విపరీత మానసిక ధోరణితో నరేంద్ర మోడీ, అమిత్ షా లు భారతదేశ రాజకీయాలలో ఆడుతున్న చదరంగం అంతిమంగా ప్రజాస్వామ్యాన్నే బలి కోరుతున్నది.
వారం రోజులుగా ‘హిందుత్వ సిద్ధాంతం’ సాకుతో “షిండే”ని శిఖండిగా మార్చుకొని బిజెపి, ఆర్థిక రాజధానిలో ఆడుతున్న నాటకం జనాలందరికీ నయా విలనిజాన్ని చూపెడుతున్నది. దీంతో బాలీవుడ్ నటీ, నటులకు నివాస నగరమైన ముంబాయి నగరంలో వారికి మించిన మహానటులు వారం రోజుల నుంచి ‘మహా’భారతం సీరియల్‌ను జాతి జనులకు చూపిస్తున్నారు. ముంబై, సూరత్, గువాహటి, వడోదర నగరాల మధ్య చక్కర్లు కొడుతున్న కుట్రాజకీయం వెనక హస్తినాపురంలోని పెద్దన్న పన్నుతున్న వ్యూహాలు టెలివిజన్ తెరమీద నగ్నంగానే ప్రసారమవుతున్నాయి. చిన్న పామును పెద్ద పాము మింగినట్లు వెయ్యి పడగల రాజకీయ విషసర్పం శివసేనను మింగేయడానికి పడరానిపాట్లు పడుతున్నది.
1923లో వి.డి.సావర్కర్ రచించిన “హిందుత్వ” అనే పుస్తకంతో ప్రేరణ పొందిన కేశవ బలరాం హెడ్గేవర్ 1925లో హిందుత్వవాదుల ఏకీకరణ లక్ష ్యంతో, మహారాష్ట్రలోనే నాగపూర్ కేంద్రంగా, భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించాడు. హెడ్గేవర్‌ను ప్రభావితం చేసిన సావర్కర్ “రాజకీయాలను హైందవీకరించండి, హిందూ రాష్ట్రాన్ని సైనికీకరించండి” అనే సిద్ధాంతాన్ని నినాదంగా హిందుత్వ రాజకీయ శిబిరాలను అందించాడు. సరిగ్గా అదే నినాదాన్ని భారత దేశంలో వాస్తవంగా అమలులోకి తీసుకురావడంలో భాగంగానే మోడీ, అమిత్ షాలు, రెండవసారి అధికారం చేపట్టగానే ఎదురులేని విచ్చలవిడితనంతో, విపరీత రాజకీయ, పాలనా చర్యలు ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగానే “హిందుత్వ” ఎజెండా ముసుగుతో శివసేనను కబళిస్తున్నారు.

దేశభక్తి పేరుతో “అగ్నిపథ్‌” ద్వారా సైనిక శిక్షణ పొందిన యువతరానికి హిందూత్వ తలుపులు తెరుస్తున్నారు. హెడ్గేవర్ అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యతలు నిర్వహించిన గోల్వాల్కర్ 1960లో ఇండోర్‌లో జరిగిన సభలో చేసిన ప్రసంగంలో “బలవంతుడిదే రాజ్యం” అనే రాతియుగ నీతిని సమర్థిస్తూ వక్కాణించాడు. దానికి డార్విన్ సిద్ధాంతాన్ని ఆధారంగా చూపి, అదే అసలు సామాజిక సూత్రమని అన్నారు. ఇప్పుడు అదే “నాజీయిజాన్ని” పట్టుకున్న మోడీ, అమిత్ షాలు “తాతల నాటి కలను నిజం చేసేందుకు ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, దేశం నుదిటిరాతను వారికి నచ్చిన తీరున తిరగవ్రాసేందుకు ప్రయత్నిస్తున్నారు.

భిన్న మతాలు, జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాలతో వేల ఏండ్లుగా సహ జీవనం సాగిస్తున్న భారత దేశానిది ప్రత్యేకమైన సాంస్క ృతిక వారసత్వ చరిత్ర. ప్రజారాశులు చరిత్ర పొడగునా ఉన్నతమైన “గంగా జమునా తెహజీబ్‌” సంస్కృతినే జీవితంలో భాగంగా మలుచుకున్నారు. పాలకులే అధికారం ఆశతో, జనాల విశ్వాసాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. ఘజనీ, ఘోరీ, మోడీ, అమిత్ షా ఎవరైనా అధికారం సుస్థిరం చేసుకునే ఎత్తుగడలలో భాగంగా “మతాన్ని రాజకీయ ఎజెండాగా, వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మోడీ, అమిత్ షాలు తాము కోరుకున్న మూసలోకి సమాజాన్ని తయారు చేయడానికి అధికార వినియోగం కాదు, విచ్చలవిడి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, అసోం, మహారాష్ట్రా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రజల విశ్వాసంతో పని లేకుండానే కేవలం కుయుక్తులతో “కమలాన్ని” కుర్చీ లో కూర్చోబెడుతున్నారు.

కానీ, “దీపం పేరు చెప్పినంత మాత్రాన చీకటి తొలగిపోదు కదా..! హిందూత్వం వాడినంత మాత్రాన దేశంలోని మైనారిటీలే కాదు, మెజారిటీ ప్రజల గతుకుల బతుకుల్లోని విషాదాన్ని భారతీయ జనతా పార్టీ పాలకులు దీర్ఘకాలంలో దాచిపెట్టగలరా? దేశ సంపదను కుబేరులకు కట్టబెడుతూ, సామాన్యులను పేదరికానికి అప్పజెపుతూ సాగిస్తున్న పరిపాలనను ప్రజాగ్రహం నుంచి ఎంతకాలం మతం ముసుగు కాపాడగలదు..? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, ధరాఘాతం, పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ ప్రయాణం, ఆదానీ, అంబానీల జయకేతనం దాచేసే దాగే సత్యాలా..?

విపక్షాలను వేటాడడం ద్వారా అబద్ధాల ప్రభుత్వానికి ఆయుష్షు పెంచుకుంటామని మోడీ సర్కార్ భావించడం భ్రాంతి మాత్రమే అవుతుంది. దేశాన్ని దారి తప్పిస్తూ, దురాక్రమణ ధోరణితో స్వంత పార్టీని, హిందుత్వ సిద్ధాంతాన్నే కాదు, వ్యవస్థలన్నింటినీ కూలుస్తున్న మోడీ, అమిత్‌షాల విధానాలను సుబ్రహ్మణ్య స్వామి, వరుణ్ గాంధీ తదితర బిజెపి పార్లమెంట్ సభ్యులే తూర్పార పడుతున్నారు. విలువలతో రాజీపడకుండా ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని వదులుకున్న వాజ్‌పేయి లాంటి నాయకుడిని, కనీస సంఖ్యాబలం లేకున్నా, విపక్షాల్లోని చీలికలు, కూల్చివేతలను నమ్ముకొని రాష్ట్రాలను ఆక్రమిస్తున్న మోడీ, అమిత్ షాల వంటి నాయకుల మధ్య వ్యత్యాసాన్ని సాంప్రదాయ హిందుత్వవాదులే విశ్లేషిస్తున్నారు.

వాజ్‌పేయి, అద్వానీలు భిన్నాభిప్రాయాలతో సుదీర్ఘ కాలం దేశంలో “జుగల్బందీ” కొనసాగించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఏకాభిప్రాయంతో భారతదేశాన్ని “బందీ ఖానా”గా మార్చేస్తున్నారు. మారినతరం చేతుల్లోని భారతీయ జనతా పార్టీ గత చరిత్రను చెరిపేసుకొని, ధ్వంస రచనను కొనసాగిస్తున్నది. భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఈ ఇరువురు గుజరాతీయులు నేర్పుతున్న నయా చాణక్యం భవిష్యత్‌లో జాతి ప్రయోజనాలను ఏ తీరానికి చేరుస్తుందోననే ఆందోళన బుద్ధి జీవులు ఎవరికైనా ఊపిరి సలపనివ్వదు. ఢిల్లీలో కూర్చొని స్వరాష్ట్రంలో, స్వంత పార్టీ సిఎం కేశుభాయ్ పటేల్ కుర్చీ కిందికి నీళ్ళు తెచ్చి, సునాయాసంగా పార్టీ ఆమోదంతో 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న నరేంద్రమోడీ, అనంతరం వామనుడిలా గుజరాత్‌ను, పార్టీనీ, దేశ పాలనా పగ్గాలను ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు.

మోడీ రాజకీయ రథానికి ఇరువైపులా గల మృత రాజకీయాలు, మత రాజకీయాల చక్రాల క్రింద నలిగి ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రాణాలు వదులుతున్నాయి. మనుషులు మరణిస్తే మళ్ళీ జన్మిస్థారనేది హిందూ ధర్మ విశ్వాసం. కానీ వ్యవస్థలు హత్యగావించబడితే అంతిమంగా వినాశనమే కదా..! ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతి ఐక్యతను, దేశ క్షేమాన్ని గాలికొది లేసింది. భారతీయతకు విడాకులిచ్చి, బుల్డోజర్‌లను నమ్ముకొని ప్రయాణం సాగిస్తున్నది, ఉత్తర దక్షిణాది రాష్ట్రాలలో విజయాన్ని మాత్రమే ఆకాంక్షిస్తున్న కమలం పార్టీకి నేడు సిద్ధాంతం సాకు మాత్రమే. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల మానస పుత్రికగా మారిపోయిన బిజెపి, మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను మాయ చేస్తున్నది. ఆశయాలు అమలవుతున్నాయనే తృప్తిని సంఘ్ సేవకులకు మిగులుస్తూ, మరో వైపు వేగంగా దేశాన్నే కొందరికి దోచిపెడుతున్నారు. తోక ముందా..? తలముందా..? అనే ప్రశ్నకు ఇప్పుడు ఆస్కారం లేదు. తోకనే తలను ఊపుతున్నది. నాగ్‌పూర్ ఆదేశాల కోసం న్యూఢిల్లీ, ఎదురుచూసే రోజుల పాత మధుర జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు నాగ్‌పూరే ఆశగా న్యూఢిల్లీ వైపు చూస్తూ ఉండాల్సిన విచిత్ర పరిస్థితి.
అందుకే స్వదేశీ నినాదం సమాధి చేయబడుతున్న పరివారం మౌనంగా దిక్కులు చూస్తున్నది. మోడీ ఆత్మీయుడైన ఆదానీ కోసం శ్రీలంకలో భారత్‌ను బేరానికి పెట్టినా, విదేశీ పర్యటనలలో కార్పొరేట్ దోస్తుల కోసం దేశం ప్రతిష్ఠను పణంగా పెడుతున్నా, దేశభక్తులు నోరు విప్పే సాహసం చేయజాలరు. దివాలా తీస్తున్న దేశాన్ని చూసి దిగులు పడకుండా, సిద్ధాంతం పేరిట నమోదు చేయబడుతున్న నాలుగు విజయాలను చూసి సంబరపడుతున్నారు. దేహమే రోగగ్రస్థమయ్యాక, నాలుక నిరుపయోగమనే అవగాహనను విడిచిపెట్టారు. కణం, కణం మా ప్రతిక్షణం భారతమాతకే సమర్పణం అనే వారి నినాదం ఇప్పుడు కేవలం గోడ మీద రాతలకే పరిమితం. దారి తప్పిన ఇద్దరు సంతానం స్వంత ఇంటినే అమ్మకానికి పెట్టినా, నిలదీయలేని నిస్సహాయులు. సత్యాన్ని సంరక్షించాల్సి సంస్థలన్నీ ఆధిపత్యం ముందు సాగిలపడినప్పుడు, సామాన్యులే శక్తిమాన్‌లుగా మారి కాపాడుకున్నారన్నది చరిత్రలో నమోదు కాబడిన నిజం. ఆ వెలుగులోనే అందరం ఏకోన్ముఖంగా కదిలి బేరగాళ్ళను, బెదిరింపుల భూతాన్ని ఎదిరించాలి. ఒక్క తెలంగాణనే కాదు, దేశంలోని నలుమూలలా పరుచుకున్న నేలంతా మనకు ప్రియమైనదే కదా..! అందుకే బుల్డోజర్‌ల క్రింద భారతదేశం నలిగిపోకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత.

డా. ఆంజనేయ గౌడ్ (రాష్ట్ర మాజీ
బిసి కమిషన్ సభ్యులు)
9885352242

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News