Saturday, April 27, 2024

అచ్చేదిన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమేనా..!?

- Advertisement -
- Advertisement -

Mallikarjun Kharge Press Meet in gandhi bhavan

హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకుందని రాజ్యసభ విపక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అచ్చేదిన్ తేవడమంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమో లేదా తాకట్టు పెట్టడమేనా? అని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రస్తుతం 35 లక్షల మంది పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతో 3 లక్షల 25 వేల కోట్ల లాభాలు ప్రభుత్వానికి వస్తాయన్నారు. జాతీయ రహదారులను, 404 రైల్వే స్టేషన్లను, 101 రైళ్లను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆర్థికవృద్ధి రేటు పెరగడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కారణం అని మల్లిఖార్జున ఖర్గే గుర్తు చేశారు. 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయకపోతే మీరు అమ్ముతున్న ఆస్తులు ఎక్కడివి? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునసాగర్, ఆల్మట్టిని కూడా అమ్మేస్తారా అంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ.. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అనేక పబ్లిక్ సెక్టార్‌లు, సంస్థలను తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్‌లో కూడా అనేక పబ్లిక్ సెక్టార్ సంస్థలను తీసుకొచ్చారని తెలిపారు. వ్యాపారం వృద్ధి చెందితేనే దేశ సంపద పెరుగుతుందని నెహ్రూ ఆలోచన చేశారన్నారు. మిశ్రమ ఆర్థికాభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్ సంస్థలను నెహ్రూ ప్రోత్సహించారని మల్లిఖార్జున ఖర్గే గుర్తు చేశారు. పబ్లిక్ సెక్టార్‌లను పూర్తిగా అమ్మేస్తే రిజర్వేషన్లు పూర్తిగా పోతాయన్నారు. నరేంద్రమోడీ ఇన్‌డైరెక్ట్‌గా రిజర్వేషన్లు ఎత్తేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

1991లో పివి నరసింహారావు హయాంలో విదేశీ నిధులను ఆహ్వానించినా పబ్లిక్ సెక్టార్‌ను డిస్టబ్ చేయలేదని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంపదను కాపాడిందని, బిజెపి తెగ నమ్మేస్తోందని మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. వంద కోట్లు పెట్టుబడులు వస్తాయని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పారన్నారు. ఎక్కడ వస్తాయి? ఉన్నవాటినే అమ్మేస్తున్నారని మోడీపై ఖర్గే ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎఐసిసి కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎన్నికల కార్యాచరణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News