Monday, April 29, 2024

రైలు బోగీలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రయాణికుని మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బైయప్పనహళ్లి లోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వద్ద కరైకాల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో బుధవారం ఉదయం 45 ఏళ్ల వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెంది ఉండడం కలవరం కలిగించింది. మృతుడు కేరళకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. దీంతో బోగీని పరిశుభ్రం చేయవలసి రావడంతో మూడు గంటలు ఆలస్యంగా రైలు అక్కడ నుంచి వెళ్లింది. అసహజ మరణంగా సెక్షన్ సిఆర్‌పిసి 174 కింద రైల్వే పోలీస్‌లు కేసు నమోదు చేశారు. పూర్తిగా అన్‌రిజర్వుడ్ అయిన ఈ రైలు మైసూరు నుంచి ఐదో నెంబరు ప్లాట్‌ఫారమ్‌కు బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించడానికి ఉదయం 7 గంటలకు వచ్చిన ప్రయాణికుడు ఆ బోగీలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు.

రైల్వే అధికారులకు వెంటనే తెలియజేశాడు. తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల మధ్య రైలు అంతా ఖాళీ అయిన తరువాత ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో అన్ని రైల్వేస్టేషన్ల మాస్టర్లకు, రైల్వే పోలీస్‌లకు ఈ సమాచారం తెలియజేశారు. ఎవరైనా వ్యక్తి కనిపించడం లేదన్న కేసు నమోదైతే తెలియజేయాలని అధికారులు సూచించారు. మృతుని వద్ద అన్‌రిజర్వుడు టికెట్ దొరికింది. దాన్ని బట్టి ఆ వ్యక్తి త్రిస్సూర్ నుంచి కెఎస్‌ఆర్ బెంగళూరుకు జనవరి 16న , అక్కడ నుంచి మైసూరుకు ప్రయాణించినట్టు తెలుస్తోంది. మిగతా తొమ్మిది కోచ్‌ల నుంచి ఈ కోచ్‌ను వేరు చేసి రైల్వేయార్డు లోకి తీసుకెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడ నుంచి సివి రామన్ నగర్ లోని జనరల్ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News