Saturday, April 27, 2024

శిక్ష పడాలనుకున్నా

- Advertisement -
- Advertisement -

amrutha pranay

 

మారుతీరావు ఆత్మహత్య బాధ కలిగించింది

హత్య, ఆత్మహత్య రెండూ నేరమే
శ్రవణ్‌పై అనుమానాలు
తల్లికి ప్రాణహాని ఉండవచ్చు
సూసైడ్ నోట్‌లో అమృతా! తల్లి వద్దకు వెళ్లు
అని ఉన్నందునే కడసారి చూపు కోసం వెళ్లాను
 శ్రవణ్ అతని స్నేహితులే అడ్డుకున్నారు
తల్లి నా వద్దకు వస్తే బాధ్యత తీసుకుంటా
ప్రణయ్ కుటుంబాన్ని వదిలిపెట్టను
ఆస్తిపై ఆశలేదు : ప్రణయ్ భార్య అమృత

చట్టపరంగా శిక్ష పడాలని అనుకున్నా..
ఆత్మహత్య బాధనిపించింది
బాబాయ్ శ్రవణ్‌పై అనుమానాలు, తల్లికి ప్రాణహాని ఉండొచ్చు
మీడియాతో అమృత ప్రణయ్

మన తెలంగాణ/మిర్యాలగూడ : మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కుమార్తె అమృత ప్రణయ్ స్పందించారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. తన భర్త హత్య కేసులో ప్రధాన నిందితుడైన తన తండ్రి మారుతీరావుకు చట్టపరంగా శిక్షపడాలని భావించానే తప్ప ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకోలేదన్నారు. ప్రణయ్‌ని హత్య చేయించాడన్న కోపమే తప్ప ఆయనతో తనకెలాంటి వ్యక్తిగత వివాదాలు లేవన్నారు. సూసైడ్ నోట్‌లో అమృతా.. తల్లి వద్దకు వెళ్లు.. అని ఆయన రాసినదాన్ని గౌరవించాను కాబట్టే కడసారి చూపుకోసం వెళ్లానని అన్నారు. కానీ తన బాబాయ్ శ్రవణ్ స్నేహితులు తనను అడ్డుకున్నారని.. అడ్డుకున్నది కుటుంబసభ్యులు కాదని అన్నారు. తాను పాజిటివ్ మాట్లాడినా, నెటిటివ్ మాట్లాడినా.. నెగెటివే తీసుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా అమృత ప్రణయ్ తెలిపారు.

తల్లికి నైతిక మద్దతిస్తా.. బాధ్యత తీసుకుంటా..
తన తల్లికి నైతిక మద్దతినిస్తానని అమృత తెలిపింది. ఇదే సందర్భంలో ప్రణయ్ కుటుంబాన్ని వదిలేసి రావాలంటే మాత్రం ఒప్పుకోనని అమృత ప్రణయ్ స్పష్టం చేసింది. అమ్మ తన వద్దకు రావాలనుకుంటే.. తాను వేరే చోట ఉండి ప్రణయ్ తల్లిదండ్రులను, ఆమెను ఇద్దరినీ చూసుకుంటానని తెలిపింది. ప్రణయ్ చనిపోయినప్పుడు తానెంత బాధపడ్డానో ఇప్పుడు భర్త కోసం తన తల్లి ఎంతగా బాధపడుతుందో తెలుసునన్నారు. ప్రణయ్‌ని హత్య చేసినా ప్రణయ్ కుటుంబం తనను చేరదీయడంతో ఒంటరిదాన్ని కాలేదన్నారు. కానీ తన తల్లి ఒంటరిదైపోయిదని.. ఆమెకు మారుతీరావు సోదరుడు శ్రవణ్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని అనుమానాన్ని అమృత ప్రణయ్ వ్యక్తపర్చింది.

తండ్రి కోరిక మేరకు వెళ్లినా శ్రవణ్ స్నేహితులు అడ్డుకున్నారు.. ఉరిశిక్ష పడ్డ వ్యక్తికైనా చివరి కోరికను నెరవేరుస్తారని, తన తండ్రి సూసైడ్ నోట్‌లో ‘అమృతా.. తల్లి వద్దకు వెళ్లు’ అని రాసిన మాటలను తాను గౌరవించే తండ్రి అంత్యక్రియల వద్దకు వెళ్లానని ఆమె తెలిపింది. కానీ శ్రవణ్ కూతురు తనను అడ్డుకుని నెట్టివేసిందన్నారు. తమ కుటుంబసభ్యులెవరూ ఏమీ అనలేదని.. శ్రవణ్ స్నేహితులే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారన్నారు. ప్రణయ్ చనిపోయినప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా నిలబడ్డానో.. ఇప్పుడు అంతే స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నానని చెప్పారు. అలా అని తండ్రి చనిపోతే బాధ లేదని కాదన్నారు.

బాబాయ్ మాటే చెల్లుబాటు..
తమ కుటుంబంలో ఎప్పుడూ బాబాయ్ శ్రవణ్ మాటే చెల్లుబాటయ్యేదని, ఒకరకంగా చెప్పాలంటే ఆయన పెత్తనమే కొనసాగేదన్నారు. తన తండ్రి మారుతీరావు, శ్రవణ్‌కు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయన్నారు. ప్రణయ్ హత్య విషయంలోనూ మారుతీరావును శ్రవణ్ రెచ్చగొట్టాడన్నారు. ఎవరినైనా ఎదిరించే మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కి మాత్రం భయపడేవారన్నారు. ఈ మాట మిర్యాలగూడలో ఎవరిని అడిగినా చెబుతారని ఆమె అన్నారు. ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రిని శ్రవణ్ ౩,4 సార్లు కొట్టినట్లు తెలిసిందని, దాంతో ఆయన వేరేవాళ్ల ఇళ్లల్లో తలదాచుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆస్తి విషయంలో మారుతీరావు, శ్రవణ్ మధ్యలో ఏం జరిగిందో తెలియదన్నారు.

శ్రవణ్ వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న అనుమానం ఉందన్నారు. త్రండి ఆస్తిపై తన కెలాంటి ఆసక్తి లేదని, ప్రణయ్ హత్య తర్వాత తాను ఎన్నిసార్లు రాయబారం పంపినా ఒప్పుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఆస్తి కోసం ఎందుకు ఆశపడుతానని ప్రశ్నించారు. తన త్రండి చావును ఎగతాళి చేశానని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టీవీలో చూసే ఆయన ఆత్మహత్య గురించి తెలుసుకన్నామని చెప్పారు. ఎవరికైనా వారి పిల్లల మీద ప్రేమ ఉంటుందని.. కానీ పక్కనవాళ్ల పిల్లలను చంపే హక్కు ఎవరికి లేదని అన్నారు. హత్య.. ఆత్మహత్యా రెండు నేరమేనని అమృత అన్నారు.

Maruthi Rao suicide caused pain
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News