Monday, April 29, 2024

ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!

- Advertisement -
- Advertisement -

Maruti Rao

 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత

మనతెలంగాణ/హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌హత్య కేసు నిందితుడు మారుతీరావు శనివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌లో గల ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారుతీరావు శనివారం ఉదయం ఆర్యవైశ్య భవన్‌లో గది(306) అద్దెకు తీసుకుని బస చేశాడు. మారుతీరావు స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాగా కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో పిడి యాక్టు కేసులో అరెస్టై ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. ఇదిలావుండగా పోలీసుల ఒత్తిళ్ల వల్లే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2018 సెప్టెంబర్14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌హత్య జరిగిన విషయం విదితమే. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు.

కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ప్రణయ్‌ను మారుతీరావు కిరాయిహంతక ముఠాతో హత్యచేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?.ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక మారుతీరావు గదిలో పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఏలాంటి ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. అదేవిధంగా పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ పురుగు మందుకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్‌కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు.

శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు శనివారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు.గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు.మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతోపోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

సూసైడ్ నోట్‌పై సాంకేతిక దర్యాప్తు ః
మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌నోటులో ఉన్న చేతి రాతపై పోలీసులు సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సూసైడ్‌నోట్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపించారు. శనివారం ఉదయం బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్‌కాల్స్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

డ్రైవర్‌ను ప్రశ్నించిన పోలీసులు ః
మారుతీరావు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.

పోస్టుమార్టం పూర్తి
ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈక్రమంలో మిర్యాలగూడలో సోమవారం నాడు మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా మారుతీరావు శనివారం నాడు రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో బస చేయడం, ఆదివారం ఉదయం తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. దీంతో ఆర్యవైశ్య భవన్ నిర్వహకులు మారుతీరావు విషం తాగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడి సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు.

కుటుంబ కలహాలు కుంగదీశాయి ?
ఇటీవల కాలంలో మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు అతనితో ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు తెలుస్తోంది. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్‌హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో మారుతీరావు తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. ఇదిలావుండగా మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్‌హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి తన భార్య పేరిట తిరగరాశారని తెలుస్తోంది.

విబేధాలు అవాస్తవంః మృతుని సోదరుడు శ్రావణ్
తన అన్న మారుతీరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్‌ఖండించారు. అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమన్నారు. ప్రణయ్‌హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ ఆ కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. ఏడు నెలల పాటు జైలు జీవితం అనుభవించానని దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని శ్రావణ్ మీడియాకు తెలిపారు. మారుతీరావు ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్‌వచ్చినట్లు చెప్పారు. సూసైడ్‌నోట్‌లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్ తెలిపాడు.

షెడ్డులో మృతదేహంః ఆందోళనకు గురైన మారుతీరావు
ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. వారం రోజుల తన షెడ్డులో అనుమానాస్పదస్థితిలో పడిఉన్న మృతదేహం ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. తన షెడ్డులో గుర్తుతెలియని మృతదేహంపై పోలీసులు తనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని మారుతీరావు ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో మృతదేహం ఎవరిదన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తన షెడ్డులోని మృతదేహం విషయంపై పలువురు న్యాయవాదులతో చర్చించినట్లు తెలియవచ్చింది.

ఈక్రమంలో షెడ్డులోని మృతదేహం ఎవరిదన్న విషయం వెలుగుచూడక ముందే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో వ్యక్తిపైనా పోలీసులు పిడి యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసిన విషయం విదితమే.

విషం తీసుకుని ఆత్మహత్య ః సిఐ సైదిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మారుతీరావు విషం తీసుకున్నట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్ టీంతో తనిఖీలు చేయించాం.పరుపుపై పడి ఉన్న మారుతీరావును వెంటనే ఆస్పత్రికి తరలించాం. డాక్టర్లుమారుతీరావును పరీక్షించిన అనంతరం మృతిచెందినట్లు ధృవీకరించారు. ఘటనాస్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అమృత ఇంటి వద్ద భారీ బందోబస్తు ః
మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియ నిమిత్తం మిర్యాలగూడ తీసుకెళ్లారు. మారుతీరావు ఆత్మహత్యతో మిర్యాలగూడలోని అమృత ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మారుతీరావు ఆత్మహత్య ఘటనతో జిల్లా ఎస్‌పి సెక్యూరిటీ మరింత భద్రత పెంచారు. మారుతీరావు ఆత్మహత్యతో ఆయనకు సంబంధించిన అనుచరులు, బంధువులు.. అమృత ఇంటిపై దాడికి పాల్పడతారనే అనుమానంతో ముందస్తుగా భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

మారుతీరావు ఆత్మహత్యపై అమృత స్పందించింది. ‘ప్రణయ్‌ను హత్య చేశానని మా నాన్న పశ్చాతాపం చెంది ఉంటాడు. నాన్న ఆత్మహత్యపై మాకు క్లారిటీ లేదు. అన్ని వివరాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది.నాన్నఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని, ప్రణయ్ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతుని కూతురు అమృత అభిప్రాయం వ్యక్తం చేసింది.

Maruti Rao commits suicide
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News