Saturday, April 27, 2024

చైనా నుంచి భారత్‌కు ఎంఎన్‌సిలు?

- Advertisement -
- Advertisement -

MNCs

 

కరోనా లాక్‌డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్‌నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని కొత్త అవకాశాలను కల్పించ వచ్చనే అభిప్రాయం కూడా వినవస్తున్నది. ఎన్‌డిఎ 1 హయాంలో ప్రధాని మోడీ పిలుపు ఇచ్చి పచ్చ జెండా ఊపిన ‘మేకిన్ ఇండియా’కు ఆలస్యంగానైనా జవసత్వాలు కలగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టిన చైనాలో లాక్‌డౌన్ వల్ల ఎదురయిన చేదు అనుభవంతో అక్కడ కేంద్రీకరించి ఉన్న బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను ఇతర దేశాలకు మార్చుకోవాలని గట్టిగా అనుకుంటున్న నేపథ్యం భారత్‌కు కలిసి రాగలదని భావిస్తున్నారు. జపాన్ సంస్థలు సహా చాలా ప్రపంచ స్థాయి కంపెనీలు చౌక శ్రమ మీద మక్కువతో తమ విడి భాగాల తయారీ కేంద్రాలను చైనాలో నెలకొల్పాయి. దేశ దేశాలలోని అసెంబ్లింగ్ (కూర్పు) యూనిట్లకు చైనా నుంచే విడి భాగాలను పంపిస్తున్నాయి.

లాక్‌డౌన్ సమయంలో చైనాలో అవన్నీ మూతపడడంతో జపాన్ సహా అనేక దేశాలకు అక్కడి నుంచి సరఫరాలు ఆగిపోయి ఆయా పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. ఇందువల్ల చైనా నుంచి జపాన్‌కు ఉత్పత్తుల రాక తగ్గిపోయిందని, తమ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడిందని జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయం బీజింగ్ పాలకుల వెన్నున వణుకు పుట్టించింది. అధిక అదనపు విలువ వస్తువులను ఉత్పత్తి చేసే జపాన్ పరిశ్రమలను స్వదేశానికి రప్పించాలని, ఇతర ఆసియా దేశాల్లో అవి నెలకొనేలా చూడాలని అబే అన్నారు. వాస్తవానికి కరోనా ముప్పు తలెత్తకుండా ఉంటే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇప్పటికే జపాన్‌లో తన తొలి పర్యటన జరిపి ఉండేవారు. దానితో పాత వైరాన్ని తెరదించుతూ చైనా, జపాన్‌ల సంబంధాల్లో నూతన శకారంభానికి పచ్చజెండా ఊపేవారు. టోక్యోలో జరగవలసి ఉన్న ఒలింపిక్ క్రీడల సందర్భంగా జపాన్‌ను అభినందించి ఉండేవారు. కాని కరోనా దెబ్బతో అవన్నీ రద్దయిపోయాయి.

చైనాతో ఆర్థిక బంధాన్ని పటిష్టపర్చుకునే బదులు అక్కడి నుంచి తమ పరిశ్రమలను ఉపసంహరించుకునే వైపు షింజో అబే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చైనా నుంచి తరలిపోవాలనుకుంటున్న బహుళ జాతి సంస్థలకు భారత దేశమే తదుపరి గమ్యం కానున్నట్టు ప్రారంభ సంకేతాలను బట్టి అర్థమవుతున్నదని స్విట్జర్లాండ్ యూనియన్ బ్యాంకు (యుబిఎస్) ఫిబ్రవరిలో సిద్ధం చేసిన ఒక నివేదికలో పేర్కొన్నది. ఇండియాలోని నిర్మాణ, ఎలెక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలు, జౌళి, ఆహార ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) రాకడ బాగా పెరిగిందని కూడా ఈ బ్యాంకు అభిప్రాయపడింది. గత ఏడాది 87 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఎఫ్‌డిఐలు భారత్‌లో ఈ సంవత్సరం 175 బిలియన్‌లకు పెరిగే అవకాశమున్నదని జోస్యం చెప్పింది. భారత దేశంలో భూమి, కార్మికులు సునాయాసంగా లభించడమే ఇందుకు కారణమని పేర్కొన్నది. విద్యుత్తు లభ్యతను కూడా పెంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల అనుమతులను వెంటవెంటనే ఇవ్వగలిగితే ఇతర దేశాల్లో లభించని స్థాయి ప్రోత్సాహకాలు కల్పించగలిగితే బహుళ జాతి కంపెనీలకు భావి గమ్యం ఇండియాయే కాగలదని అన్నది.

అయితే విచిత్రంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి వెళ్లిపోయిన దాదాపు 60 సంస్థల్లో అధిక భాగం వియత్నాం, తైవాన్, థాయిలాండ్‌లను గమ్యంగా చేసుకున్నాయి, మన దేశానికి కేవలం 3 సంస్థలే వచ్చాయని వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి. భారత టెలికం రంగంలోకి విదేశీ పెట్టుబడులు తక్షణమే రాగల అవకాశాలున్నాయని కొన్ని చైనా కంపెనీలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయని సమాచారం. టెలికం, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ రంగాల్లోకి, ఆ తర్వాత సెమీ కండక్టర్ల తయారీలోకి కూడా బహుళ జాతి సంస్థలు రాగలవని భావిస్తున్నారు. వాస్తవానికి మన హెచ్‌డిఎఫ్‌సిలో 1.1 శాతం వాటాలను చైనీస్ సంస్థ ఇటీవల నేరుగా కొనుగోలు చేసింది. దీనితో మన కంపెనీలను చైనా పెట్టుబడులు ఆక్రమించుకోనున్నాయనే ఆందోళన వ్యక్తమైంది. తగిన అనుమతులు లేకుండా పొరుగు దేశాల కంపెనీలు మన సంస్థల వాటాలను కొనుగోలు చేయడాన్ని అడ్డుకుంటూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తి కేంద్రాన్ని ఇండియాకు తరలించదలచినట్టు వార్తలు వచ్చాయి. ఆపిల్ ఉత్పత్తులను కాంట్రాక్టుపై నిర్వహిస్తున్న తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఇక్కడ 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 40 శాతం తగ్గుతుందని అంచనా. ఎలెక్ట్రానిక్స్ వంటి ఆధునిక రంగాలలో పెట్టుబడుల మీద దృష్టి కేంద్రీకరిస్తే మనకు లాభిస్తుంది. అదే సమయంలో చైనాలోని ఎటువంటి పరిస్థితులు బహుళ జాతి సంస్థలను పరంపరగా ఆకట్టుకున్నాయో అధ్యయనం చేసి మన దేశంలోని అవకాశాలు, పరిమితులతో వాటిని సరిపోల్చి తగినంత వేగంగా వీలైన సంస్కరణలు తీసుకు రావడం ద్వారానే ఎఫ్‌డిఐలను విరివిగా మనం ఆకర్షించగలుగుతాం.

 

MNCs from China to India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News