Monday, April 29, 2024

ఆవిష్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపండి

- Advertisement -
- Advertisement -

Modi advice to students at 51st Annual Graduation Ceremony of IIT-Delhi

 

ఐఐటి విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: యువజనులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపార విధానం) లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందకు ప్రతిగా తమ నూతన ఆవిష్కరణల ద్వారా సమాజంలోని నిరుపేదలకు ఈజ్ ఆఫ్ లివింగ్(సంతోషంగా జీవించడం) సమకూర్చేందుకు కృషి చేయాలంటూ ఐఐటి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఐఐటి-ఢిల్లీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో మోడీ ప్రసంగిస్తూ కొవిడ్-19 తదనంతర ప్రపంచం చాలా సంక్లిష్టంగా ఉండనున్నదని, దీన్ని ఎదుర్కోవడంలో సాంకేతికత అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నదని చెప్పారు. ప్రపంచీకరణ ప్రాముఖ్యాన్ని కొవిడ్-19 ప్రపంచానికి చాటినప్పటికీ స్వావలంబన కూడా అంతే ముఖ్యమని తెలుసుకోగలిగామని ఆయన అన్నారు. యువజనులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందచేయడానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుందని, యువజనులు కూడా తమ నూతన ఆవిష్కరణలతో కోట్లాది మంది నిరుపేదల జీవితాలలో మార్పులు తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు.

యువజనులు తమ నైపుణ్యం, అనుభవం, ప్రతిభ, ఆవిష్కరణలతో పేద ప్రజల జీవితాలు బాగుపడేలా కృషి చేయాలని ఆయన చెప్పారు. పట్టభద్ర విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో రాజీపడకుండా అసంఖ్యాక ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతికతతో సుపరిపాలనను ఎలా అందించగలమో స్వయంగా చూస్తున్నామని, గత కొన్నేళ్లుగా పేద ప్రజలకు దీని వల్ల జరిగిన మేలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు. బ్రాండ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా యువత మారాలని ఆయన కోరారు. భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. సాంకేతికత వల్ల ఎంతో సమర్థంగా సేవలు అందచేయగలుగుతున్నామని, దీని వల్ల అవినీతి కూడా తగ్గిందని ప్రధాని అన్నారు.

శనివారం జరిగిన స్నాతకోత్సంలో మొత్తం 2,019 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరిగింది. విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ(మాజీ రాష్ట్రపతి) స్వర్ణ పతకం, పర్ఫెక్ట్ 10 స్వర్ణ పతకాలు, ఇన్‌స్టిట్యూట్ రజత పతకాలు ప్రదానం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News