Sunday, April 28, 2024

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పనితీరును చూపించని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, తమది పనిచేసే ప్రభుత్వమని చాటడం, పార్టీలో, ప్రభుత్వంలో అసమ్మతిని చల్లార్చడం, పార్టీలో ఎవరూ తమను మించిన వారు లేరన్న అహంభావాన్ని ప్రదర్శించకుండా అడ్డుకట్ట వేయడం వంటివి మంత్రివర్గ మార్పులకు ప్రధాన కారణాలని పార్టీ వర్గాలు తెలిపాయి.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వరుసగా జరుగుతున్న సమావేశాలు మంత్రివర్గంలో మార్పుల వార్తలకు ఊతమిస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు సాగుతున్న ఊహాగానాలు పలువురు మంత్రులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 16, 17 తేదీలలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత, ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

ప్రభుత్వంలోనే కాక పార్టీ సంస్థాగతంగా కూడా మార్పులు ఉంటాయని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు పార్టీ సంస్థాగత బాధ్యతలు చేపట్టవచ్చని, కొత్త ముఖాలు ప్రభుత్వంలో చేరవచ్చని మంత్రి పదవిని ఆశిస్తున్న పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనున్నది. అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు అదే పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా ఈ రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News