Monday, April 29, 2024

ఎదురులేని ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

Mumbai Indians reach final in IPL

 

దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎదురులేని శక్తిగా తయారైంది. తాజాగా యూఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లోనూ ఫైనల్‌కు చేరి తనకు ఎదురులేదని చాటింది. ఇప్పటికే నాలుగు సార్లు ఐపిఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇది ముంబైకి ఆరో ఫైనల్ సమరం కానుంది. ఇందులోనూ గెలిచి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించడంతో ముంబైకి వరుస విజయాలు లభిస్తున్నాయి. ఈ సీజన్‌లో రోహిత్ శర్మతో పాటు కీరన్ పొలార్డ్ జట్టుకు సారధ్యం వహించారు. ఇద్దరు కూడా కెప్టెన్‌గా జట్టుపై తమదైన ముద్ర వేశారు. ఇద్దరి సారధ్య ప్రతిభతో ముంబై లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పటిష్టమైన ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించింది. క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో ముంబైను ఫైనల్‌కు చేర్చడంలో ముఖ్యభూమిక పోషించారు. ఇక హార్దిక్ పాండ్య, పొలార్డ్‌లు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టారు. క్వాలిఫయర్ మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబైకి భారీ స్కోరును సాధించి పెట్టాడు.

మరోవైపు సూర్యకుమార్, డికాక్, ఇషాన్ కూడా మెరుపులు మెరిపించారు. ముంబై జోరును చూస్తుంటే ఈసారి కూడా వారే ట్రోఫీని సాధిస్తారని కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ ముంబై అద్భుతంగా రాణిస్తోంది. జస్‌ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లు అసాధారణ రీతిలో చెలరేగి పోతున్నారు. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య కూడా కుదురుగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. వీరిని ఎదుర్కొవడంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో చాలా బలంగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి మ్యాచ్‌లో రోహిత్ డకౌటయ్యాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. ఫైనల్లో మాత్రం రోహిత్ మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ గాడిలో పడితే ముంబైని ట్రోఫీని సాధించకుండా అడ్డుకోవడం చాలా కష్టమనే చెప్పక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News