Monday, April 29, 2024

రైతులకు తోమర్ లేఖ

- Advertisement -
- Advertisement -

Narendra Singh Tomar's letter to Farmers

 

ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం కరవైపోతున్నదనే అభిప్రాయానికి ఇది అవకాశం కలిగిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో సమ యం గడుస్తున్న కొద్దీ ఆందోళనకారుల సహనమే నశిస్తుంది. అధికార పీఠాల్లోని వారికి తక్షణమే ప్రత్యక్షంగా ఎటువంటి ఇబ్బంది కలగదు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టి మూడు వారాలు దాటిపోయింది. కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయవలసిందేనంటూ వారు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంతో పలుసార్లు జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల, తమ పట్ల సానుభూతితో ఉన్నదనే అభిప్రాయాన్ని కూడా ఈ చర్చలు రైతుల్లో కలిగించలేదని స్పష్టపడుతున్నది.

ఇళ్లను, పొలాలను వదిలిపెట్టి లక్షలాది మంది రైతులు ఇంకెంత కాలం ఢిల్లీ చలిలో ఉద్యమ జెండాను దించకుండా ఎగరవేయగలుగుతారనేది కీలక ప్రశ్న. మరి కొద్ది రోజులు ఆందోళన చేస్తే వారి శక్తులన్నీ ఉడిగిపోతాయని అప్పుడు వారే విరమించుకొని వెళ్లిపోతారని ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే అది ప్రభుత్వానికి, పాలక పక్షానికి కూడా మేలు చేయదు. ప్రధాని మోడీ ప్రభుత్వం అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అణచివేసిందనే మాట వారికి కీర్తిని చేకూర్చదు. ఇది తెలిసి కూడా రైతుల డిమాండ్లకు తలొగ్గకూడదని, కనీసం మధ్యస్థమైన ఫలితాన్ని ఇచ్చే చర్చలకు తగిన వాతావరణాన్నైనా కొనసాగనివ్వకూడదని పాలక పెద్దలు ఎందుకు అనుకున్నారో అర్థం కావడం లేదు. గురువారం నాడు రైతు ఆందోళనపై దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక మంచి సూచన చేసింది. రైతులతో సంప్రదింపులు ఫలించే వరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాల అమలును వాయిదా వేసుకోవాలన్నది.

అందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. చట్టాలపై రాజీపడే ప్రసక్తే లేదనేది కేంద్ర ప్రభుత్వ తిరుగులేని వైఖరిగా బోధపడుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న నిర్విరామ ఆందోళన వల్ల లడఖ్ వద్ద గల సైనికులకు అత్యవసర, నిత్యావసర సరఫరాలు పంపించలేని పరిస్థితి ఏర్పడిందని, రోడ్డు మార్గం మూసుకుపోడంతో విమానాల్లో తీసుకు వెళ్లవలసి వస్తున్నదని, ప్రజాధనం వృథా అవుతున్నదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం నాడు రైతులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొనడం వారి ఉద్యమం మీద దేశ ప్రజలలో ఏర్పడుతున్న సదభిప్రాయాన్ని తొలగించడానికి ఉద్దేశించిందేనని చెప్పవలసి ఉంటుంది. ఆందోళనకారులను అప్రతిష్ఠపాలు చేసి ఉద్యమం నుంచి విరమించుకునేలా చేయడానికే కేంద్ర మంత్రి సైనికుల ప్రస్తావన తీసుకు వచ్చినట్టు బోధపడుతున్నది. ఈ సందర్భంలో తోమర్ 1962 నాటి భారత చైనా యుద్ధాన్ని కూడా ప్రస్తావించారు.

ఆ యుద్ధంలో భారత పక్షం వహించని కొన్ని శక్తులు ఇప్పుడు రైతు ఉద్యమం వెనుక ఉన్నారని తోమర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లడఖ్ వద్ద చైనా దురాక్రమణదారులతో పోరాడుతున్న మన సైనికులను బలహీనపర్చడం కోసమే రైతు ఉద్యమ ఉధృతికి వారు తోడ్పడుతున్నారనే ధ్వని ఆయన లేఖలో వినిపిస్తున్నది. ఇది రైతుల వెంట ఉన్న వామపక్ష శక్తులపై నేరుగా సంధించిన బాణమేనని చెప్పక తప్పదు. 1962 భారత చైనా యుద్ధంలో దేశంలోని కమ్యూనిస్టుల్లో ఒక వర్గం చైనా వైఖరిని సమర్థించిన మాట వాస్తవం. సరిహద్దులపై చైనా వాదనకు మద్దతు తెలుపుతూ అప్పటి కమ్యూనిస్టు పార్టీ కలకత్తా సభల్లో ఆమోదించిన తీర్మానం ఆ పార్టీలో ప్రధానమైన చీలికకు దారి తీసింది. ప్రధాని మోడీ ప్రభుత్వం అమిత వేగంగా అమలు చేస్తున్న సంస్కరణలను వామపక్ష, ప్రజాతంత్ర శక్తులుగా పరిగణన పొందుతున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు ఇప్పుడు చేపట్టిన ఆందోళనను కూడా వారు గట్టిగా సమర్థిస్తున్నారు.

అయితే రైతులు తమది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని ఉద్యమమని తమ మౌలిక ప్రయోజనాలను సమూలంగా దెబ్బ తీసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినందునే తాము వాటి రద్దును కోరుతున్నామని స్పష్టం చేశారు. అందుచేత వారి భయాలను తొలగించి, వారిని ఒప్పించి తమ వైపు తిప్పుకోడానికి కేంద్ర పాలకులు ప్రయత్నించడమే సబబు. అందుకు బదులుగా వామపక్షాలను, ఇతర ప్రతిపక్షాలను నిందిస్తూ మాట్లాడడం వల్ల ఉద్యమంలోని రైతులను కేంద్రం మరింత దూరం చేసుకుంటుంది. ఈ విషయాన్ని పాలకులు గ్రహించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News