Monday, April 29, 2024

మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం

- Advertisement -
- Advertisement -

సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక పోలీసు క్యాంపును కూడా ఏర్పాటు చేశాయి. ఇది మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయగలదని పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పువర్తి నిషిద్ధ మావోయిస్టు పార్టీకి చెందిన స్వయం ప్రకటిత కమాండర్ హిడ్మాకు, అతని వారసుడు బర్సా దేవాకు స్వగ్రామం.

ఈ గ్రామం నుంచే మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులు జరిపేందుకు వ్యూహ రచనలు చేసేవారు. ఒక చెవువు, పొలాలు ఉన్న ఈ గ్రామంలో భద్రతా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఆదివారం ఈ గ్రామాన్ని సిఆర్‌పిఎఫ్, రాష్ట్ర పోలీసులకు చెందిన అధికారుల బృందం తనిఖీ చేసింది. మావోయిస్టుల కంచుకోటగా ఒకప్పుడు ఉన్న ఈ గ్రామంలో అటువైపుగా వెళ్లే వారి కదలికలను రహస్యంగా కనిపెట్టడానికి అవసరమైన నిఘా ఏర్పాట్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గ్రామం నడిబొడ్డున స్కూలుగా ఉన్న ఒక ఇంటిని మావోయిస్టులు తమ విశ్రాంతి గృహంగా మార్చుకున్నారు. ఆ ఇంటి చుట్టూ కూరగాయల మొక్కలను మావోయిస్టులు పెంచుకునేవారు. ఇప్పుడు ఆ ఇంటిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అనేక కిలోమీటర్ల విస్తారంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ శిక్షణా శిబిరాల కోసం వినియోగించుకునేవారు. సమీపంలోని గ్రామాలు, తండాల నుంచి యువకులను రిక్యూట్ చేసుకుని వారికి శిక్షణ ఇచ్చేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు ఉపయోగించేవారు.

మావోయిస్టుల పనితీరు, భద్రతా దళాలపై దాడులు జరపడానికి పన్నిన వ్యూహాలను అవగతం చేసుకోవడానికి ఈ గ్రామ సందర్శన తకు ఉపయోగపడుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు భద్రతా దళాలు, పోలీసులు అడుగెపెట్టడానికి భయపడిన గ్రామంలో ఇప్పుడు పోలీసు క్యాంపు వెలసింది. ఇలాంటివే మరో ఏడు క్యాంపులు గత కొద్ది నెలలుగా మావోయిస్టుల ఒకనాటి స్థావరాలలో ఏర్పడ్యాయి. ఈ క్యాంపులు మావోయిస్టుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. పువర్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలోనే మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాలు చేరుకోవచ్చు.

గతంలో ఆయా ప్రాంతాలను చేరుకోవాలంటే పోలీసులకు అనేక గంటల సమయం పట్టేది. కాగా..పువర్తి గ్రామంలో హిడ్మా తల్లిని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ ఆదివారం కలుసుకుని ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని అందచేస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టు కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. జనవరి 30న టేకల్‌గూడ పోలీసు క్యాంపుపై మావోయిస్టులు దాడి జరిపి ముగ్గురు సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని హతమార్చిన నేపథ్యంలో పోలీసులు పువర్తి గ్రామాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News