Monday, April 29, 2024

నెహ్రూ మ్యూజియం ఇక ప్రధానమంత్రుల మ్యూజియం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మారింది. వాటికి ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేరు మార్చింది. తీన్ మూర్తి భవన్ భారతదేశ తొలి ప్రధాని జవహరల్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉండేది. ‚నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీసొసైటీ(ఎన్‌ఎఎంఎంఎల్) ప్రత్యేక సమావేశంలో పేర్ల మార్పుపై తీర్మానం చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. సొసైటీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

సమావేశానికి అధ్యక్షత వహించిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు ప్రధాన మంత్రులందరికి సంబంధించిన జ్ఞాపికలు కొత్తగా పేరు మార్చుకున్న ఈ మ్యూజియంలో ఉంటాయని చెప్పారు. మాజీ ప్రధానమంత్రులందరి గౌరవసూచకంగా పేరు మార్పును చేపట్టినట్లు ఆయన తెలిపారు.

కాగా, ఎన్‌ఎంఎంఎల్ పేరు మార్పుపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మారు పేరు అల్పత్వం, ప్రతీకారమని ఆయన ఆరోపించారు. 59 సంవత్సరాలకు పైగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ విశ్వ మేధస్సుకు చిరునామాగా, పుస్తకాలు, జ్ఞాపికల నిధిగా విరాజిల్లుతోందని ఆయన అన్నారు. నవభారత నిర్మాత పేరును వారసత్వ సంపదను వక్రీకరించడానికి, నాశనం చేయడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని రమేష్ పేర్కొన్నారు. మోడీని అభద్రతాభావంతో కుంగిపోయిన స్వయం ప్రకటిత విశ్వగురుగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News