Monday, April 29, 2024

111 జిఓ స్థానంలో నూతన మార్గదర్శకాలు!

- Advertisement -
- Advertisement -

New Guidelines to Replace 111 GO

 సుప్రీంకోర్టు, గ్రీన్‌ట్రిబ్యునల్ ఆమోదించాకే అమల్లోకి?
 84 గ్రామాలతో నూతన నగరం ఆవిష్కరణ
 గ్రామీణం ఉట్టిపడేలా, పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు
 అందుబాటులోకి వేల ఎకరాలు

హైదరాబాద్ : 111 జీఓ స్థానంలో నూతన మార్గదర్శకాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నిపుణుల కమిటీతో ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా సమాచారం. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో 84 గ్రామాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో పర్యవరణానికి నష్టం జరగకుండా ఈ 84 గ్రామాలను గ్రీన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ప్రభుత్వం రూపొందించే కొత్త మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ముందు ఉంచి న్యాయస్థానం అనుమతితోనే ఈ పక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్ల క్రితం 111 జీఓను సమీక్షించేందుకు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం అంగీకరించింది. ఒకవేళ ప్రభుత్వం రూపొందించే నూతన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లు అంగీకరిస్తే ఈ 84 గ్రామాలతో నూతన నగరాన్ని ఆవిష్కరింప చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

20 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు తీర్పు
111 జిఓ ఎత్తివేతపై ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుండగా పర్యావరణ వేత్తలు మాత్రం మరో రకం వాదనను వినిపిస్తున్నారు. 2000 సంవత్సరం, డిసెంబర్‌లో 111 జిఓ ఎత్తివేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పునిచ్చిందని వారు తెలిపారు. కచ్చితంగా జంట నగరాల దాహార్తిని తీర్చేది హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లే అని వారు పేర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి నీళ్లు ఒకవేళ మనకు అందుబాటులోకి వచ్చినా ఆ నీరు ఎంతమాత్రం త్రాగడానికి మంచివి కావని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1974 వాటర్ యాక్ట్ ప్రకారం నీరు కలుషితం కాకుండా చూసే బాధ్యతలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు కట్టబెడుతూ ప్రభుత్వాలు వాటిని ఏర్పాటు చేశాయని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. అయినా వాటి పరిధి నామమాత్రంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు.

84 గ్రామాల పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాలు
శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్ పల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల మండలాల్లోని 84 గ్రామాల పరిధిలోని దాదాపు 1.32 లక్షల ఎకరాల భూముల్లో 68 కాలుష్య పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడాన్ని గతంలో నిషేధించారు. అయితే వాస్తవానికి దీని క్యాచ్‌మెంట్ ఏరియా మొత్తం దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం కేవలం పది కిలోమీటర్ల మీదనే చర్చ జరుగుతుందని మిగతా 1,990 కిలోమీటర్ల మీద కూడా చర్చ జరగాలని రియల్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

పెట్టుబడులకు అనుకూలంగా..
కొత్తగా 111 జీఓను ఎత్తివేసినా, సడలించినా 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహించిన వేలానికి సుమారుగా రూ.3వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఈ భూములు కూడా అందుబాటులోకి వస్తే వివిధ రకాల పద్ధతిలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. దీంతోపాటు 111 జిఓ ఎత్తివేతతో 84 గ్రామాలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతుందని ప్రభుత్వం సైతం ఇదే దిశగా ఆలోచన చేస్తుందని రియల్ వర్గాలు తెలిపాయి. నగరం మరింత విస్తరిస్తుందని వారు పేర్కొంటున్నారు.

కొత్తగా రెండు రకాల గ్రీన్ జోన్లు
ప్రస్తుతం 111 జీఓ పరిధిలో గ్రామకంఠాలు మినహా మిగతా ప్రాంతాల్లో 10 శాతం స్థలంలో నిర్మాణాలు చేపట్టే విధంగా నిబంధనలున్నాయి. దీనికి అనేక తిరకాసులు పెట్టారు. అయి తే, ఈ నిబంధనలు ఎక్కడా అధికారికంగా అమలు చేయడం లేదు. ప్రభుత్వం నూతన మార్గదర్శకాల్లో భాగంగా ప్రాంతా ల్లో నిర్మాణాలకు సంబంధించి మరింత వెసులుబాటులు కల్పిస్తూ కొత్త జీఓ తీసుకొచ్చే ఆలోచనతో ముందుకెళుతున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా జంట జలాశయాల పరిధిలో కొత్తగా రెండు రకాల గ్రీన్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. 111 జీవో ప్రాంతంలో ఇప్పటికే గ్రీనరీ ఉంది. గండిపేట్, హిమాయత్‌సాగర్ నిండినప్పుడు నాలుగైదు కిలోమీటర్ల వరకూ భూగర్భజలాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పచ్చదనం అధికమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

500 గజాల నుంచి 1000 గజాల విస్తీర్ణంలో
నూతన మార్గదర్శకాల్లో భాగంగా 500 గజాల నుంచి 1000 గజాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతినివ్వడంతో పాటు అందులో కేవలం 15 నుంచి 20 శాతం నిర్మాణాన్ని, మూడంతస్తుల వరకే ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మిగతా స్థలంలో చెట్లను పెంచే విధం గా విధి, విధానాలను రూపొందించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. రోడ్లను కాంక్రీటు జంగిల్ తరహాలో కాకుండా మట్టి రోడ్లను వేయడంతో పాటు వాటి పక్కన చెట్లను పెంచడంతో పాటు గ్రామీణ వాతావరణ ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ప్రతి ఇంటికి ఎస్‌టిపిల ఏర్పాటు చేసేలా నిబంధనలను విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News