Saturday, April 27, 2024

ప్రేమోన్మాది ఘాతుకం

- Advertisement -
- Advertisement -

పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరుయువతులపై దాడి
అక్కడికక్కడే ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
మన తెలంగాణ/ ఖానాపూర్ : నిర్మల్ జిల్లా, ఖానాపూర్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి పట్టపగలే యువతిని వెంబడించి నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం… ఖానాపూర్ పట్టణానికి చెందిన శట్‌పెల్లి అలేఖ్య (22)ను అదే వీధికి చెందిన జువికింది శ్రీకాంత్ అనే యువకుడు ఐదేళ్ల నుండి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రెండు నెలల క్రితం కుల పెద్దలతో పాటు ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా పెద్దలందరి సమక్షంలో ఒప్పందం కూడా కుదిరింది. ఇటీవల ఆ యువతికి పెళ్లి నిశ్చయమై నిశ్చితార్ధం జరుగగా, తన ప్రేమను నిరాకరిస్తూ మరొకరిని వివాహం చేసుకుంటోందన్న అక్కసుతో కక్ష పెంచుకున్నాడు. నిశ్చితార్ధం రోజున అయిన తంతును కూడా చెడగొట్టాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విభేదాలు వచ్చినప్పటికీ పోలీసుల కౌన్సెలింగ్‌తో సద్దుమణిగింది. అయినప్పటికీ ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో అలేఖ్య తన వదిన జయశీల, ఆమె కుమారుడు రియాన్ తో కలిసి రోజు మాదిరిగానే స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఒక టైలరింగ్ కేంద్రంలో శిక్షణ తీసుకొని శివాజీ నగర్ మీదుగా అంబేద్కర్ నగర్ వెళ్తున్నారు. దీనిని గమనించి మాటువేసిన శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడి నుంచి వారు పారిపోవడానికి ప్రయత్నించినా వెంబడించి అలేఖ్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. అలేఖ్య వదిన జయశీల సైతం నిందితునితో పోరాడినప్పటికీ ఆమెతో పాటు ఆమె కుమారుడిపై కూడా కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 సహాయంతో గాయపడిన జయశీల, ఆమె కొడుకు రియాన్ష్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపి మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. స్వల్పంగా గాయపడిన రియాన్ష్‌కు ఖానాపూర్‌లో చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న సిఐ మోహన్ , ఎస్‌ఐ లింబాద్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఖానాపూర్‌లో యువతి దారుణ హత్యకు గురైన సంఘటనను ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా ఇంచార్జ్జి మంత్రి సీతక్క యువతి హత్యపై ఆరా తీశారని నిర్మల్ డిఎస్‌పి గంగారెడ్డి తెలిపారు. ఖానాపూర్ వచ్చి సంఘటన స్థలాన్ని సందర్శించి, ఆసుపత్రిలో ఉన్న అలేఖ్య మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ దారుణ ఘటనపై మంత్రి సీతక్క హత్యపై ఆరా తీశారని, నిందితుడు ఎంతటివాడైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. సిఐ మోహన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లింబాద్రి కేసును పరిశీలిస్తున్నారని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు గంగవ్వ, గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చి కన్నీటి పర్యంతమై నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలేఖ్య మృతితో అంబేద్కర్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News