Monday, April 29, 2024

అవ్యక్త గళాల గళం

- Advertisement -
- Advertisement -

కొందరు రచయితలు ప్రమాద సంఘటనలను అక్షరీకరిస్తారు. ప్రమాద సంఘటనను ఒక సృజనాత్మక రూపంగా చెక్కుతారు. ఆవిష్కరిస్తారు. కానీ ప్రమాద సంఘటనలు కూడా కొందరిలోని సృజనాత్మకతను బయటకి తీసుకువస్తాయనేందుకు నిదర్శనం ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన నార్వే రచయిత యూన్ ఫాసే. ఏడేళ్లప్పుడు జరిగిన ప్రమాదం ఆయనను మృత్యువు సమీపంలోకి తీసుకెళ్ళింది. కానీ విచిత్రంగా ఆ సంఘటనే ఆయనను రచయితగా రూపుదిద్దింది. ఆయన రచనలపై ఎక్కువ ప్రభావాన్ని కలిగించింది ఆ ప్రమాదం. నార్వేలోని వాణిజ్య పట్టణం హాగిసంలో క్రిస్టఫర్ ఫాసే, విగ్డిస్ నానా ఎర్లాండ్ దంపతులకు 1959 సెప్టెంబరు 29న యూన్‌ఒలావ్ ఫాసే జన్మించారు. వెస్ట్ లాండ్ లోని స్ట్రాండ్ బార్మ్ పట్టణంలో పెరిగారు. ఫాసే పుట్టేందుకు మూడు దశాబ్దాల ముందే మరణించిన మరో ప్రముఖ రచయిత హాన్స్ ఎర్నెస్ట్ కింక్ కు కూడా ఇదే పట్టణంతో సంబంధం ఉంది. నోబెల్ సాహిత్య పురస్కారానికి కింక్ పేరు 1912 నుండి 1926 మధ్యలో ఏడు సార్లు ప్రతిపాదన దశ దాకా వెళ్ళడం మరో విశేషం.

కింక్ పేరు నామినేట్ అయిన సుమారు శతాబ్ద కాలానికి అదే పట్టణానికి నోబెల్ సాహిత్య పురస్కారం రావడం గమనార్హం. ఇక్కడే వీరిద్దరి మధ్య వైరుధ్యాన్ని, పోలికలను గమనించాలి. వీరిద్దరూస్ట్రాండ్ బార్మ్ పట్టణంలో నివసించినప్పటికీ స్వస్థలాలు వేరు. ఉత్తర నార్వేలోని ఫిన్ మార్క్ జిల్లా లొప్పా పట్టణం ఓక్స్ ఫ్యూర్డ్ ప్రాంతంలో జన్మించారు కింక్. హాగిసంలో పుట్టారు ఫాసే. కింక్ రాసిన ‘డెన్ న్యె కపెల్లనెన్’ నవలకు స్ట్రాండ్ బార్మ్ పట్టణమే ప్రేరణ. నాటక రచయితలు కావడం ఇద్దరిలోని సామ్యం. అంతేకాకుండా ఇద్దరూ నవలలు రాశారు. వ్యాసాలు రాశారు. అయితే కింక్ నాటకాలు సుదీర్ఘమైనవి. ప్రదర్శనకు అనుకూలమైనవి కావు. ఇటలీ చారిత్రక, రాజకీయ అంశాలతో వ్యాసాలు, నాటకాలు రాసిన కింక్ నాటకాల్లో కొన్ని ఆరేడు గంటలపాటు ప్రదర్శించే నిడివి ఉన్న సుదీర్ఘ నాటకాలు. ఇటలీకి చెందిన సుప్రసిద్ధ తత్వవేత్త మాకియావెల్లి, సుప్రసిద్ధ రచయిత పియెట్రో అరెటినో మొదలైనవారి జీవితాలపై కూడా నాటాకాలు రాశారు కింక్. ఇందుకు భిన్నంగా యూన్ ఫాసే రాసిన నాటకాల్లో గొప్ప లక్షణం ప్రదర్శన యోగ్యత.

నిడివి రీత్యా ఆయన రాసిన నాటకాలుచిన్నవి. నార్వేకు చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత హెన్రిక్ ఇబ్సన్ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించిన రచయితగా ఫాసేను విమర్శకులు పేర్కొంటారు. అందుకే ఆధునిక ఇబ్సన్ గా ఫాసే పేరు పొందారు. నార్వే రచయితల్లో ఇబ్సన్ తర్వాత అధికంగా ప్రదర్శితమైన నాటకాలు ఫాసేవే. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో వెయ్యికి పైగా వేదికలపై ప్రదర్శితమైన ఫాసే నాటకాలు అంతర్జాతీయంగా ఉత్తమ నాటక రచయితగా ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి.
పన్నెండేళ్లకే సృజనాత్మక రచన దిశగా అడుగులు వేసిన ఫాసే కృషి నాటక రచనకే పరిమితం కాదు. విభిన్న సృజనాత్మక ప్రక్రియల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఫాసే. నాటకాలతో పాటు నవలలను కూడా ఆయన రచించారు. వ్యాసాలను రాశారు. అనువాదాలు చేశారు. కవిత్వం రాశారు. బాలసాహిత్యం సృజించారు. ఆయన రచనలు యాభై భాషల్లోకి తర్జుమా అయ్యాయి. ఇతర రచయితల సాహిత్యాన్ని కూడా ఆయన అనువదించారు. బర్గన్ విశ్వవిద్యాలయంలో ఫాసే తులనాత్మక సాహిత్యాన్ని చదువుకున్నారు. జర్నలిస్టుగా, హోర్డాలాండ్ లోని రైటింగ్ అకాడమీలో కన్సల్టెంట్ గా పని చేశారు.
పన్నెండేళ్లకే కవిత్వ రచనతో సృజనాత్మక రచనారంగంలోకి ప్రవేశించారు ఫాసే.

విద్యార్థి రచయితలకు నిర్వహించిన కథానికల పోటీల్లో బహుమతి పొందారు. నిత్యజీవిత సంఘటనలే ఫాసే రచనలకు ఆధారాలు. వాటినే సరళమైన భాషలో, అత్యంత శక్తిమంతంగా భావ ప్రకటన చేస్తూ రచనలు చేస్తున్నారు ఫాసే. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను ఆకర్షణీయంగా మలిచిన రచయితగా ప్రత్యేకత పొందారు. ‘రాట్, స్వార్ట్’ అనే పేరుతో ఆయన రాసిన తొలి నవల 1983లో వెలువడింది. ‘స్టెంగ్డ్ గిటార్’, ‘నాస్టెట్’, ‘కాంట్’ మొదలైన నవలలతో నవలా రచనలో ప్రత్యేక స్థానం పొందారు. ‘మెలంకలియా’ అనే పేరుతో చిత్రకారుడు లార్స్ హెర్టర్ విగ్ జీవితాన్ని రెండు సంపుటాలుగా 1995, 1996 సంవత్సరాలలో నవలలుగా తెచ్చారు. జీవితానికి, మరణానికి మధ్య స్థితికి చిత్రిక పట్టే నవలిక ‘మోర్గాన్ ఓగ్ క్యెల్డ్’. మానవ మస్తిష్కానికి అడ్డం పట్టే నవలిక ఇది. భాషలో లయాత్మకతతో పాఠకుడిని చదివింపజేస్తుంది. ఇలాంటిదే మరో నవలిక ‘డెట్ ఎర్ అలెస్’.

ఒకట్రెండు శతాబ్దాల పూర్వ ప్రేమ కథకు అక్షర రూపం ఫాసే నవల ‘అండ్యాకే’. దీనికి కొనసాగింపుగా ‘ఒలావ్స్ డ్రౌమర్’, ‘క్యెల్ స్వేవ్డ్’ అనే మరో రెండు నవలలతో కలిపి నవలాత్రయాన్ని వెలువరించారు ఫాసే. అసల్, అతని ప్రేమికురాలు అలిడాల మధ్య ప్రణయాన్ని ‘అండ్యాకే’లో చిత్రించారు రచయిత. ఆ ప్రణయానికి గుర్తుగా అలెస్ కు జన్మనిస్తుంది అలిడా. ‘క్యెల్ స్వేవ్డ్’ నవలలో అలెస్ కథనం ఉంటుంది. నవలాత్రయ ప్రయోగంతో ఆగిపోని ఫాసే సప్త నవలారచనను కూడా చేపట్టి విజయం పొందారు. ‘సెప్టాలజియెన్’ అనే పేరుతో ఏడు సంపుటాల ఆ నవలాస్రవంతిని ‘డెట్ ఆండర్ నామ్నెట్’, ‘ఎగ్ ఎర్ ఈన్ అనదర్’, ఈట్ నైట్ నామ్’ అనే మూడు భాగాలుగా విడుదల చేశారు. మద్యపానానికి బానిసగా మారిన వ్యక్తి ఆత్మహత్య దిశగా ఆలోచించడం ఇతివృత్తంగా ఒకే జీవితపు రెండు పరస్పర వ్యతిరేక ఆలోచనారీతులను చిత్రిస్తారు రచయిత. ఈ సప్త నవలా స్రవంతిలో ప్రతి భాగం ‘అండ్ ఐ సీ మి స్టాండ్ అండ్ సీ’ అనే ఏడు పదాలతో మొదలవుతుంది. ప్రతి భాగం ఒక ప్రార్థనతో ముగుస్తుంది. వస్త్వాశ్రయత, మానవత, కళలకు సంబంధించిన మౌలిక ప్రశ్నలను ఈ నవల లేవనెత్తుతుంది.

మూడు భాగాలుగా వచ్చిన ఈ ఏడు నవలల్లో రెండు భాగాలు బుకర్ ప్రైజుకు నామినేట్ కావడం విశేషం. ఫాసే రచించిన కవిత్వంలో ఆధ్యాత్మికత దర్శనమిస్తుంది. ఎక్కువ కవితలు ప్రార్థనారూపంలో ఉండడాన్ని గమనించవచ్చు. ‘ఏంజెల్ మెడ్ వట్న్ ఐ ఆగెన్’, ‘హున్ డెన్స్ వెజెల్సర్’, హున్ ఓగ్ ఏంజెల్’, ‘డిక్ట్ ఐ సమ్లింగ్’ తదితర కవితా సంపుటాలను ఆయన వెలువరించారు. శామ్యూల్ బెకెట్ రాసిన ‘వైల్ వి వెయిట్ ఫర్ ద గోడాట్’ నాటకం స్ఫూర్తితో 1992లో ‘నొకొన్ క్యామ్ టిల్ కొమ్మింగ్’ అనే నాటకాన్ని 1992లో రచించారు ఫాసే. అదే ఆయన రాసిన తొలి నాటకం. అయితే ‘ఓగ్ అల్డి స్కాల్ వి స్కిల్యాస్ట్’ అనే నాటకం ప్రదర్శన జరిగిన ఆయన తొలి నాటకం. ఇప్పటివరకు నలభైకి పైగా నాటకాలు రాశారు ఫాసే. అధివాస్తవికతకు, అసంబద్ధతకు నడుమ హద్దురేఖగా గోచరిస్తుంది ఫాసే నాటకం. గద్యానికీ పద్యానికీ మధ్య పరిభ్రమిస్తూ ఉంటుంది. వచనంలోని లయాత్మకత కనబడుతుంది. లోతైన ఆత్మ పరిశీలనతో కూడి ఉంటాయి. ఫాసే నాటకంలో నటీనటుల నటన ముఖ్యం కాదు.

ఆ మాటకొస్తే తెరపై కనబడేవి కొన్ని పాత్రలే. ఆ పాత్రల్లోనూ అధికశాతం పేరు లేనివే. సంభాషణలూ అరకొరే. ఎన్నో నాటకాల్లో మాట చేయలేని పనినిఫాసే నాటకంలో మౌనం చేస్తుంది. అందుకే ఫాసేను ‘మాస్టర్ ఆఫ్ పాజెస్’ గా పేర్కొంటారు విమర్శకులు.ఫాసే నాటకాల్లోని నిశ్శబ్దం, సంభాషణ లేకపోవడం ప్రేక్షకుడి దృష్టిని నటుల పరస్పర ప్రతిచర్యలపై దృష్టి పెట్టేలా చేస్తాయి. ‘ఫ్రా టెల్లింగ్ వయా షోయింగ్ టిల్ రైటింగ్’, ‘గ్నోస్టిస్క్ ఎస్సే’ మొదలైనవి ఫాసే వ్యాస సంపుటాలు. సాహిత్యంపై, వివిధ ప్రక్రియలపై ఈ వ్యాసాలు చక్కటి అంతర్వీక్షణ కలిగిస్తాయి. ఇవే కాకుండా బాల సాహిత్యానికి సంబంధించిన రచనలు కూడా ఆయన వెలువరించారు. యూన్ ఫాసే రచనల్లో కనబడే ఆధ్యాత్మికత కుటుంబం నుండే వచ్చిందని ఆయన చెప్పుకుంటారు. అయితే గిటారిస్టు గానో వైద్యుడిగానో స్థిరపడాలని చిన్ననాట కోరుకున్నారు ఫాసే. ఎక్కువ కాలం సంగీత అభ్యాసంలోనే గడిపేవారు. బాల్యంలోఫిడేల్ వాయించేవారు. యువకుడిగా ఉన్నప్పుడు తాను రాసిన పాటలకు తానే సంగీతం సమకూర్చుకున్నారు. యవ్వన దశలో కమ్యూనిజం వైపు ఆకర్షితుడయ్యారు. తన రచనలను బైబిల్ ఎక్కువగా ప్రభావితం చేసిందని ఆయన పేర్కొంటారు.

సుప్రసిద్ధ రచయితలుశామ్యూల్ బెకెట్, జార్జ్ ట్రాక్ల్, థామస్ బెర్నార్డ్, ఒలావ్ హాగ్, ఫ్రాంజ్ కఫ్కా, విలియం ఫాక్నర్, వర్జీనియా వూల్ఫ్ ల ప్రభావం కూడా తన రచనలపై అధికంగా ఉందని ఆయన చెప్తారు.
అనేక అంతర్జాతీయ బహుమతులను, పురస్కారాలను యూన్ ఫాసే స్వీకరించారు. నైనారస్క్ సాహిత్య బహుమతి, ఇబ్సన్ బహుమతి, నార్వేజియన్ కల్చర్ కౌన్సిల్ గౌరవ పురస్కారం, హెడ్డా బహుమతి, స్వీడిష్ అకాడమీ బహుమతి మొదలైనవెన్నో ఆయన పొందారు. ఫ్రెంచ్ జాతీయ పురస్కారం స్వీకరించారు. సాహిత్యరంగంలో ఆయన అందించిన సేవలకు బర్గన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటును అందజేసింది. ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక రూపొందించిన వందమంది జీవించి ఉన్న మేధావుల జాబితాలో 83వ స్థానంలో యూన్ ఫాసే నిలిచారు. నార్వేజియన్ కళలకు, సాహిత్యానికి, సంస్కృతికి ఉత్తమ సేవలందించిన వారికి నార్వే రాజు ఓస్లోలోని రాజప్రాసాద ఆవరణలో నివాసం ఏర్పాటు చేస్తారు. ఈ నివాసం ఏర్పాటు రచయితలకు, కళాకారులకు అందజేసే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తారు. ‘గ్రాటెన్’ గా పేర్కొనే ఈ గౌరవ నివాస సౌకర్యాన్ని పొందిన ఉత్తమ రచయిత యూన్ ఫాసే.

ఫాసేకు నోబెల్ బహుమతిని ప్రకటిస్తూ బహుమతి కమిటీ చెప్పిన మాట ‘అవ్యక్త గళాలకు తన కలంతో గళాన్నిచ్చిన సాహితీవేత్త ఫాసే’ అని. ఆ మాట వాస్తవం. ఫాసే నైనారక్స్ భాషలో రచనలు చేస్తారు. ఈ పురస్కారం పొందిన నాలుగో నార్వే రచయితగానూ తొలి నైనారక్స్ భాషా రచయితగానూ గుర్తింపు పొందారు ఫాసే. ఫాసేకు నోబెల్ బహుమతి ప్రకటించడం ద్వారా మైనారిటీ భాషలకు గుర్తింపు ఇచ్చింది నోబెల్ కమిటీ. కేవలం లిఖిత రూపంలో ఉన్న నైనారక్స్ భాషను ఉపయోగించేవారు నార్వేలో కేవలం పది నుండి పదిహేను శాతం ప్రజలే. మిగతా ప్రజల వాడుక భాష బొక్మల్. ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన నైనారక్స్ భాషా రచయితకు ఈ పురస్కారం ఇచ్చి, మైనారిటీ గళాలకు బాసటగా నిలుస్తామన్న ధైర్యాన్ని ఇచ్చింది నోబెల్ కమిటీ.

డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News