Thursday, May 9, 2024

డిసిసిబి ఎన్నికలకు నేడే నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

DCCB

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లు, 9 జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ (డిసిఎంఎస్)ల ఎన్నికలకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఇందుకు అవసరమైన విధంగా జిల్లా డిసిసిబి కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం బరిలో ఉన్న డైరెక్టర్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఈనెల 28న డిసిసిబిలకు 20 మంది చొప్పున, డిసిఎంఎస్‌లకు 10 మంది చొప్పున డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 29న డిసిసిబి, డిసిఎంఎస్‌ల ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టిఆర్‌ఎస్ మోజార్టీ పిఎసిఎస్‌లను గెలుచుకోవడంతో అన్ని డిసిసిబి, డిసిఎంఎస్‌లను ఆ పార్టీ ఏకపక్షంగా గెలుచుకోనుంది. దీంతో అధికార టిఆర్‌ఎస్ పార్టీలోనే డైరెక్టర్ పోస్టులకు పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో డిసిసిబి, డిసిఎంఎస్‌ల డైరెక్టర్ అభ్యర్థులను ఎంపికచేసే బాధ్యత జిల్లా మంత్రి, ఎంఎల్‌ఎ,ఎంఎల్‌సి,ఎంపిలకు పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా మంత్రుల నేతృత్వంలో ఏకగ్రీవంగా డైరెక్టర్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది.

Nominations for DCCB and DCMS Elections today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News