Monday, April 29, 2024

ఈటెల రాజేందర్‌కు నోటీసులు!

- Advertisement -
- Advertisement -

వరంగల్: పదవ తరగతి పరీక్ష పత్రం లీకేజీ కేసులో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్‌పిసి కింద ఈ నోటీసులు జారీ చేశారు. డిసిపి కార్యాలయానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి ఎస్‌ఐ నేరుగా వెళ్లి ఈ నోటీసులు అందజేశారు.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్ నిందితుడు నెం.1గా, రెండో నిందితుడిగా బూర ప్రశాంత్ ఉన్నారు. కాగా రెండో నిందితుడైన ప్రశాంత్ ఇటు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు, ఆయన ఇద్దరు పిఎలైన రాజు, నరేందర్‌కు కూడా హిందీ ప్రశ్న పత్రం వాట్సాప్ ద్వారా పంపాడు. దీంతో వారి పేర్లను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌కు కూడా నోటీసు జారీ చేశారు. కాగా ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు నమోదు చేయనున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి హిందీ ప్రశ్నపత్రం లీకైన సంగతి తెలిసిందే. కమలాపూర్ బాలుర పాఠశాల నుంచి తెలుగు బిట్ పేపర్, హిందీ ప్రశ్న పత్రం లీక్ కావడంతో ఆ పాఠశాలనే ఎందుకు ఎంచుకున్నారన్న కోణంలో పోలీసులు పరిశోధన చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచే ఈటల రాజేందర్ ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌ను విచారించి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News