Monday, April 29, 2024

‘నందమూరి’లో ఇంట్లో విషాదం.. ఎన్‌టిఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

NTR's Daughter Suicide at home in Jubilee Hills

‘నందమూరి’లో ఇంట్లో విషాదం
ఎన్‌టిఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య
సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ ః దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్ (చిన్న)నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(52)సోమవారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉమామహేశ్వరి కూతురు దీక్షిత మధ్యాహ్నం రెండున్నర గంటలకు డయల్ 100కి పోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పోలీసులతో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భౌతికకాయం వెంట బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేశ్ సహా మరికొందరు కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు.
నందమూరి ఇంట విషాదం ః ఎన్‌టిఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,టిడిపి అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి కల్యాణ్ రామ్ జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశం ఉంది.
నేత్ర దానం ః
ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆస్పత్రి నుంచి ఆమె మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. ఈక్రమంలో కంఠమనేని ఉమామహేశ్వరి కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.కాగా, అనారోగ్య కారణాల నేపథ్యంలో ప్రాణాలు విడిచిన ఉమామహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంబామింగ్ ప్రక్రియ చేశారు. మరోవైపు, పోస్టుమార్టం నివేదికను రెండు రోజుల్లో అందిస్తామని ఉస్మానియా వైద్యుడు మీడియాకు వెల్లడించారు. మరణానికి గల కారణాలను ఇప్పుడే తామేమీ చెప్పలేమని వివరించారు.
ప్రముఖుల సంతాపం ః
ఉమామహేశ్వరి మృతి చెందడంతో ఆమె భర్త శ్రీనివాసరావుకు ప్రముఖులు సంతాపం తెలియజేయడంతో పాటు పరామర్శించారు. కాగా ఉమామహేశ్వరి మరణవార్త తెలియడంతో సినీ పరిశ్రమ నుంచి దగ్గుబాటి సురేశ్ బాబు, మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డిలు నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఉమామహేశ్వరి మేనల్లుడు నందమూరి కల్యాణ్‌రామ్, నందమూరి సుహాసిని ఇతర కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు, తెలంగాణ టిడిపి నేతలు ఆమె నివాసానికి వచ్చి తమ సంతాపం తెలియజేశారు. ఉమామహేశ్వరి భర్త శ్రీనివాసరావు గతంలో అమెరికాలోని ఓ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీవిరమణ అయ్యారు. ఆ తర్వాత వారు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఇటీవలే చిన్న కుమార్తె వివాహం జరగడంతో అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఉమామహేశ్వరి గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతోందని, ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

NTR’s Daughter Suicide at home in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News