Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల నుంచి పెరిగిన విమాన ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -
Number of air-passengers on rise in Telugu states
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విమాన ప్రయాణాలు రెట్టింపు
గతేడాదితో పోల్చితే 5 లక్షలు అధికం
ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల్లో వెల్లడి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విమాన ప్రయాణాలు రెట్టింపును మించాయని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి జరిగిన రాకపోకలు పెరగ్గా, కడప నుంచి ప్రయాణాలు భారీగా పడిపోయాయని ఎయిర్‌పోర్టు అథారిటీ తెలిపింది. ఇరు రాష్ట్రాల నుంచి విమానాల్లో ప్రయాణించిన స్వదేశీ, విదేశీ ప్రయాణికుల సంఖ్య సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రెండు రాష్ట్రాల నుంచి 7,87,547 మంది ప్రయాణించగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా 12,67,969 మంది ప్రయాణించినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గతేడాదిలో 22,71,976 మంది మాత్రమే ప్రయాణం చేయగా ఈసారి ఆరు నెలల్లో ఏకంగా 54,01,042 మంది ప్రయాణించారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యిందని అధికారులు తెలిపారు.

ఆరు నెలల్లో ఏకంగా 4,18,979 మంది

రెండు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వారీగా ప్రయాణికుల వివరాలను అధికారులు వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో 38,324 మంది విదేశాలకు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,15,000 మంది ప్రయాణించారు. విశాఖపట్నం నుంచి విదేశీ ప్రయాణాలు 5మంది మాత్రమే చేయగా, విజయవాడ నుంచి 2,815 మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి గత సంవత్సరం 1,06,821 మంది కాగా ఈ ఏడాది అదే ఆరు నెలల్లో ఏకంగా 4,18,979 మంది ప్రయాణించారు.

స్వదేశీ ప్రయాణాల లెక్కలు….

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసిన వారి సంఖ్య అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే పెరిగిందని అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 9,11,835 మంది, విశాఖపట్నం నుంచి 1,30,719 మంది, తిరుపతి నుంచి 56,308 మంది, విజయవాడ నుంచి 48,035 మంది ప్రయాణించారు. అదే విధంగా కర్నూలు నుంచి 2,569 మంది కడప నుంచి కేవలం 583 మంది మాత్రమే ప్రయాణించారు. కడప విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే భారీగా పడిపోయిందని అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది.

50 శాతం పెరిగిన స్వదేశీ విమాన రాకపోకలు

సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 58 శాతానికి పైగా సాగాయి. అందులో స్వదేశీ విమాన రాకపోకలు 50 శాతానికిపైగా పెరిగినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నెలలో దేశీయ, విదేశీయ విమానాల రాకపోకల సంఖ్యను చూసినట్లయితే అంతకు ముందు ఏడాదిలో 97,125 ఉండగా ఈ ఏడాది 1,46,849 విమాన రాకపోకలు సాగాయి. సరుకు రవాణాలో తీసుకుంటే అంతర్జాతీయంగా 18శాతానికిపైగా దేశీయంగా 10శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News